మహారాష్ట్రలో నాలుగు స్తంభాలాట | The four columns in Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో నాలుగు స్తంభాలాట

Published Wed, Oct 15 2014 2:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

మహారాష్ట్రలో నాలుగు స్తంభాలాట - Sakshi

మహారాష్ట్రలో నాలుగు స్తంభాలాట

ఇటీవలివరకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై చాలామంది దాదాపు ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు.

నాలుగు పార్టీల హోరాహోరీ
 
బీజేపీ అతిపెద్ద పార్టీగా ఏర్పడుతుందంటున్న ఒపీనియన్ పోల్స్

 
ఇటీవలివరకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై చాలామంది దాదాపు ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, పరిపాలనాపరమైన నిష్క్రియాపరత్వం.. వీటి కారణంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి దారుణంగా ఓడిపోతుందని.. మోదీ హవా, శివసేనల కేడర్ బలం తో శివసేన-బీజేపీ సంకీర్ణం ఈజీగా మెజారిటీ సీట్లు సాధిస్తుందని అంతా అంచనావేశారు. కానీ ఆ రెండు కూటముల మధ్య సీట్ల పంపకంలో విభేదాలు తలెత్తి.. నాలుగు పార్టీలు వేటికవే సొంతంగా బరిలోకి దిగడంతో ఒక్కసారిగా మహారాష్ట్ర ఎన్నికల ముఖచిత్రం మారింది. 288 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఏ పార్టీకీ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీకి అవకాశం ఉందని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే పరిస్థితి ఉందని పలు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. మహారాష్ట్రలో ఆయా పార్టీల ప్రస్తుత పరిస్థితుల విశ్లేషణ..

మోదీనే నమ్ముకున్న బీజేపీ!

శివసేనతో విడిపోయిన తరువాత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైననే అన్ని ఆశలు పెట్టుకుంది. ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకున్న మోదీ కూడా సాధ్యమైనన్ని ప్రచార సభల్లో పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే రాష్ట్రంలోనూ గెలిపిస్తే.. అభివృద్ధికి అవకాశం ఉంటుందంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే, రాష్ట్రంలో బలమైన నేత లేకపోవడం బీజేపీకి ప్రతికూలించే అంశం. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కూడా ప్రకటించలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. రాష్ట్రంలో మంచి పేరున్న దళిత నేత గోపీనాథ్ ముండే మరణం పార్టీకి తీరని లోటుగా మారింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కూడా మళ్లీ రాష్ట్రానికి రావడానికి ఇష్టపడటం లేదని సమాచారం. మరోవైపు, విదర్భ సహా సంప్రదాయ ఓటర్లు బలంగా ఉన్న అనేక ప్రాంతాల్లో శివసేన, రాజ్‌ఠాక్రే పార్టీ ఎంఎన్‌ఎస్, బీజేపీల మధ్య ఆ ఓటు బ్యాంక్ చీలే అవకాశం ఉండటం బీజేపీకి ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం బీజేపీ అతిపెద్ద పార్టీగా ఏర్పడే అవకాశముందని రెండు టీవీ చానళ్ల ఒపీనియన్ పోల్స్‌లో తేలింది. దాంతో ఎన్నికల అనంతరం బీజేపీ మళ్లీ శివసేనతో జట్టు కడుతుందా? లేక శరద్ పవార్ పార్టీ ఎన్సీపీని అక్కున చేర్చుకుంటుందా? అనేది వేచిచూడాల్సి ఉంది. ‘శివసేన మాకు సహజ భాగస్వామి’ అంటూ బీజేపీ నేత నితిన్ గడ్కారీ ఇటీవల చేసిన వ్యాఖ్యను ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది.
 
గతమే ఘనమైన శివసేన!

బీజేపీతో విడిపోవడం వల్ల ఎక్కువ నష్టం శివసేనకే అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ వ్యవస్థాపకుడు దివంగత బాల్‌ఠాక్రేకున్న చరిష్మా ఈ ఎన్నికల్లో కూడా ఉపయోగపడుతుందని సేన భావిస్తోంది. రాష్ట్రంలో పార్టీకున్న బలమైన కేడర్‌ను కూడా సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నమ్ముకున్నారు. కానీ వాస్తవానికి బాల్‌ఠాక్రేకున్న జనాదరణ ఆయనకుమారుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేకు లేదని.. మరోవైపు, పార్టీ కేడర్ చాలావరకు బీజేపీ, శివసేననుంచి విడిపోయి రాజ్‌ఠాక్రే స్థాపించిన ఎంఎన్‌ఎస్‌ల వైపు వెళ్లిందని విశ్లేషకుల భావన. శివసేనకు బీజేపీ కన్నా తక్కువ సీట్లు వస్తే మాత్రం సొంతగడ్డ మహారాష్ట్రలో సేన ప్రాభవం తగ్గుముఖం పట్టినట్లేనని స్పష్టమవుతుంది. అలాగే, బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో గెలిచి.. మళ్లీ బీజేపీతో అధికారం పంచుకున్నా.. సీఎం సీటుపై ఆశలను ఉద్ధవ్ ఠాక్రే వదిలేసుకోవాల్సిందే. మరోవైపు, ఎంఎన్‌ఎస్ కూడా సేన ఓట్లకు గండికొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఎంఎన్‌ఎస్ కనీసం 27 స్థానాల్లో గెలుస్తుందని ఇటీవలి ఒక ఒపీనియన్ పోల్ తేల్చిన విషయం ఇక్కడ గమనార్హం.
 
కాంగ్రెస్.. మునక ఖాయం!


మహారాష్ట్రలో కాంగ్రెస్ పరిస్థితి మునిగిపోతున్న నావేనని దాదాపు అందరి నిశ్చితాభిప్రాయం. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు వ్యక్తిగతంగా మంచి పేరున్నా ప్రభుత్వ వైఫల్యం, సహచరుల అవినీతి, విధానలోపాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయి. 2009 ఎన్నికల్లో 82 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈ సారి ఆ సంఖ్యను తిరిగేస్తే వచ్చే 28 స్థానాలైనా గెలుచుకుంటుందా?  అనేదే ఇక్కడ ప్రశ్న.

ఎన్సీపీ.. పవర్ చూపుతుందా?!

రాష్ట్రంలో కాంగ్రెస్‌తో అధికారం పంచుకున్న ఎన్సీపీకి కాంగ్రెస్ వైఫల్యాల్లోనూ భాగం ఉంది. అయితే మరాఠ్వాడా నేత శరద్ పవార్ ప్రాబల్యం బలంగా ఉన్న ప్రాంతాలపైనే ఎన్సీపీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు సాధించడంతో ఎన్సీపీలో విశ్వాసం పెరిగింది. అయితే, పార్టీ కేడర్ చాలావరకు బీజేపీకి వెళ్లడం, పార్టీ బలంగా ఉన్న దక్షిణ మహారాష్ట్రలో ‘స్వాభిమాని షేత్కారీ పక్ష’ పార్టీ ప్రాబల్యం పెరగడం ఎన్సీపీకి ఆందోళనకరంగా మారింది.
 - నేషనల్ డెస్క్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement