‘సైకిల్‌’పై 13న స్పష్టత!

‘సైకిల్‌’పై 13న స్పష్టత!


ఎల్లుండి ములాయం, అఖిలేశ్‌ వాదనలు విననున్న ఈసీ

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎన్నికల గుర్తు సైకిల్‌ ఎవరికి దక్కనుందనే ఉత్కంఠకు మరో మూడు రోజుల్లో తెరపడనుంది. ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ అయిన ఎస్పీ రెండు వర్గాలుగా విడిపోయి ఎన్నికల గుర్తు సైకిల్‌ను తమకే కేటాయించాలంటూ కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఎన్నికల సంఘం ఎస్పీ ఇరు వర్గాల నాయకులు అయిన ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ యాదవ్, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ల వాదనలు విననుంది. అనంతరం సైకిల్‌ గుర్తు ఎవరికి కేటాయించాలన్న దానిపై నిర్ణయం ప్రకటించనుంది. ఉత్తర ప్రదేశ్‌ తొలి దశ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుండటంతో అంతకు ముందే ఎన్నికల సంఘం గుర్తు ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


దీంతో ఈసీ ఈ నెల 13న విచారణకు హాజరవాలని ఎస్పీలోని ఇరు వర్గాలకు నోటీసులు పంపింది. ఇప్పటికే ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలని కోరుతూ ఇరు వర్గాలు ఎన్నికల కమిషన్‌ అధికారులను వేర్వేరుగా కలిశారు.  ఉత్తర ప్రదేశ్‌ అధికార పార్టీ ఎస్పీలో రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ మంగళవారం తన తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ను కలిశారు. తన కుమారుడే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ములాయం ప్రకటించిన  నేపథ్యంలో ఆయనతో అఖిలేశ్‌ 90 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండానే సీఎం అధికార గృహంలోకి వెళ్లిపోయారు.


పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో ఇరువురూ ఏ విషయంపైనా ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో అఖిలేశ్‌ వ్యతిరేకిస్తున్న శివ్‌పాల్‌ యాదవ్, అమర్‌ సింగ్‌ల గురించి చర్చకు రాకపోవడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదరనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఎస్పీ యూపీ అధ్యక్షుడిగా శివ్‌పాల్‌ యాదవ్‌ను తప్పించాలని, అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న అఖిలేశ్‌ డిమాండ్లను ములాయం అంగీకరించకపోవడంతోనే అసలు వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఒకటిన ఎస్పీ అధ్యక్షుడిని తానేనని అఖిలేశ్‌ ప్రకటించుకున్నాడు. అయితే ఇప్పటికీ తానే ఎస్పీ అధ్యక్షుడినని ములాయం అంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల మద్దతు ఉన్నందున ఆ పదవిని వదులుకోవడానికి అఖిలేశ్‌ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

Back to Top