అనిశ్చితి దాటి కొత్త ఆశల దిశగా..

president ramnath kovind speech in parliament - Sakshi

నవభారత నిర్మాణానికి పాటుపడుతున్న ప్రభుత్వం

రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం

ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

ఎన్డీయే విజయాల్ని కొనియాడిన కోవింద్‌

న్యూఢిల్లీ: తీవ్ర అనిశ్చిత పరిస్థితులు రాజ్యమేలుతున్న సమయంలో 2014లో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. ఆనాటి నుంచి నవభారత నిర్మాణానికి కృషిచేస్తూనే ఉందని తెలిపారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల్ని ప్రారంభిస్తూ కోవింద్‌ గురువారం ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రఫేల్‌ ఒప్పందం, వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు, పౌరసత్వ బిల్లు, నోట్లరద్దు తదితరాలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ సాగిన ఆయన ఉపన్యాసం సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రావడంతో ప్రాధాన్యత ఏర్పడింది.

శుక్రవారం ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు పలు ఉపశమన చర్యలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యవసాయ సంక్షోభాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులన్న కోవింద్‌..2022 నాటికి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రకమని ప్రశంసించారు. 2016 నాటి సర్జికల్‌ దాడులను ప్రస్తావించగానే అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో విజయాల్ని ప్రశంసించిన కోవింద్‌..తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పలు అంశాలపై సుమారు గంటసేపు కొనసాగిన కోవింద్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

నవభారత నిర్మాణంపై...
2014 ఎన్నికలకు ముందు దేశంలో అస్థిరత నెలకొంది. ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నవభారత నిర్మాణానికి పూనుకుంది. అవినీతి, జడత్వ, లోపరహిత వ్యవస్థలతో కూడిన దేశ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో కొత్త ఆశలు, విశ్వాసాన్ని పాదుకొల్పింది. దేశ ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక, ఆర్థిక మార్పును       తీసుకొచ్చింది.  

రైతు సమస్యలపై..
పవిత్ర పార్లమెంట్‌ తరఫున నేను మన అన్నదాతల్ని అభినందిస్తున్నా. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం రేయింబవళ్లు కష్టపడుతోంది. రైతుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.

పౌరసత్వ బిల్లుపై..
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో వేధింపులకు గురై భారత్‌కు వలసొచ్చే ముస్లిమేతరులకు ఈ బిల్లు న్యాయం చేస్తుంది. పౌరులకు సామాజిక, ఆర్థిక న్యాయం కల్పించడమే లక్ష్యంగా న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు పాటుపడుతోంది.

ఆర్థిక వ్యవస్థపై..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ వాటా 2014లో 2.6 శాతం ఉండగా, 2017 నాటికి 3.3 శాతానికి ఎగబాకింది. నాలుగున్నరేళ్లుగా నమోదవుతున్న వృద్ధిరేటే దీనికి కారణం. సగటున వార్షిక వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదైంది. దీంతో భారత్‌..ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

నోట్లరద్దుపై..
అవినీతి, నల్లధన వ్యతిరేక పోరులో నోట్లరద్దు కీలక ఘట్టంగా నిలిచిపోయింది. ఈ నిర్ణయంతో సమాంతర ఆర్థిక వ్యవస్థ మూలాలు దెబ్బతిన్నాయి.

సంక్షేమ పథకాలపై..
పీఎం జీవిత బీమా పథకంతో సుమారు 21 కోట్ల మంది, సౌభాగ్య పథకంతో 2 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా 9 కోట్ల టాయిలెట్‌లు నిర్మించాం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top