రైల్వే సందేహాలా..‘దిశా’ను అడిగితే పోలా!

New App to give different types of Railway services  - Sakshi

     ప్రయాణికుల కోసం ‘ఆస్క్‌ దిశా’ చాట్‌బోర్డు

     24 గంటల సేవలు, త్వరలోనే యాప్‌

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే అందించే సేవల వివరాలను పొందడంలో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తాము అందించే వివిధ రకాల సేవల వివరాలను ప్రయాణికులు క్షణాల్లో తెలుసుకునేలా రైల్వే శాఖ కొత్త సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్‌లో ‘ఆస్క్‌ దిశా’ పేరుతో కొత్త చాట్‌బోర్డును అందుబాటులో ఉంచింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఇది శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే కుడివైపు ఆకుపచ్చ చీర కట్టుకుని ఉన్న భారతీయ మహిళ బొమ్మతో ‘ఆస్క్‌ దిశా’ అనే లోగో దర్శనమిస్తుంది. దీని కింద సెర్చ్‌ ఆప్షన్‌లో మీ సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. రైలు ప్రయాణ వేళలు, టికెట్‌ బుకింగ్, రద్దు, తత్కాల్‌ టికెట్, ఆహారం తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలకు ఈ చాట్‌బోర్డు టెక్ట్స్‌ రూపంలో సమాధానాలు ఇస్తుంది. అలాగే ఇది కృత్రిమ మేధస్సుతో రూపొందించిన ఫీచర్‌ కావడంతో వాయిస్‌ రూపంలోనూ సమాధానాలు తెలుపుతుంది. ఈ సదుపాయం 24 గంటలూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.  

ఎవరు రూపొందించారు? 
రైల్వేలో తొలిసారి కృత్రిమ మేధస్సుతో రూపొందించిన చాట్‌బోర్డు ఫీచర్‌ ఇదే కావడం గమనార్హం. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. ఐఆర్‌సీటీసీ అందిస్తున్న వివిధ రకాల సేవలను ముందుగానే దీనిలో పొందుపరిచిన నేపథ్యంలో ఇది పరిమితమైన ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. బెంగళూరుకు చెందిన కో రోవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’అనే స్టార్టప్‌ కంపెనీతో కలసి ఐఆర్‌సీటీసీ దీన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే ఉన్న ఈ ఫీచర్‌ త్వరలోనే యాప్‌ రూపంలో కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉండగా.. త్వరలోనే ప్రముఖ భారతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఐఆర్‌సీటీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా రోజూ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించే 40 లక్షల మందికి, టికెట్లు బుక్‌ చేసుకునే దాదాపు 11 లక్షల మంది ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని ఐఆర్‌సీటీసీ అధికారులు చెబుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top