భళా.. ‘బాహుబలి’!

Isro's GSLV MkIII-D2 rocket successfully places GSAT-29 satellite into orbit - Sakshi

భారీ రాకెట్‌ మార్క్‌3–డీ2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

నింగిలోకి జీశాట్‌29 సమాచార ఉపగ్రహం

16 నిమిషాల్లో ప్రయోగం పూర్తి

ఇస్రో శాస్త్రవేత్తలకు వెంకయ్య, మోదీ అభినందనలు

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన జీఎస్‌ఎల్వీ మార్క్‌3–డీ2 రాకెట్‌.. కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌29ను విజయవంతంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఈశాన్య రాష్ట్రాలు,  కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కమ్యూనికేషన్‌ అవసరాలను ఈ ఉపగ్రహం తీర్చనుంది. మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్‌ ముగియగానే బుధవారం సాయంత్రం 5.08 గంటలకు మార్క్‌3–డీ2 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది.

నెల్లూరు జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని ప్రయోగ కేంద్రం ఇందుకు వేదికైంది. ఉపగ్రహాన్ని వాహకనౌక విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో చేర్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. లాంచ్‌ప్యాడ్‌ నుంచి బయల్దేరిన 16 నిమిషాల్లోనే రాకెట్‌ నిర్ణీత కక్ష్యను చేరుకుంది. దీంతో ప్రయోగాన్ని వీక్షిస్తున్న శాస్తవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. గజ తుపాను నేపథ్యంలో ఓ దశలో ప్రయోగ నిర్వహణపై ఆందోళనలు నెలకొన్నా,  చివరకు వాతావరణం సహకరించడంతో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకున్నారు.

జీఎస్‌ఎల్వీ మార్క్‌3– డీ2 రాకెట్‌ ప్రయోగం రెండోసారీ విజయవంతం కావడం విశేషం. 2017లో జీశాట్‌19ను నింగిలోకి పంపేందుకు మార్క్‌2–డీ1ను వాడారు. భవిష్యత్తులో చేపట్టనున్న మానవ సహిత మిషన్‌ ‘గగన్‌యాన్‌’లో ఈ రాకెట్‌నే వినియోగించనున్న నేపథ్యంలో తాజా ప్రయోగం శాస్త్రవేత్తల మనోధైర్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

మూడు దశల్లో ప్రయోగం..
ఈ ప్రయోగాన్ని మూడు దశల్లో  16.43 నిమిషాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే రాకెట్‌కు మొదటి దశలో రెండు వైపులా అమర్చిన 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్లు (ఎస్‌–200)ను మండించడంతో రాకెట్‌ ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనం (ఎల్‌–110)ను మండించి రాకెట్‌ వేగాన్ని పెంచారు. తరువాత 2.19 నిమిషాలకు మొదటి దశలోని ఎస్‌–200 రెండు బూస్టర్లను విడదీసి మొదటి దశను విజయవంతంగా పూర్తిచేశారు. ఎల్‌–110 దశ 5.18 నిమిషాలకు రెండో దశను పూర్తి చేసింది.  ఆ తర్వాత  25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనం(సీ–25)తో మూడో దశను ప్రారంభించారు. 16.28 నిమిషాలకు క్రయోజనిక్‌ దశ కటాఫ్‌ అయిపోయింది. 16.43 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,423 కిలోల జీశాట్‌–29ను విడదీసి భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు.  

శాస్త్రవేత్తలకు జగన్‌ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3–డీ2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని జయప్రదం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో చేసే ప్రయోగాలు సైతం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారతీయ అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదొక మైలురాయి అని జగన్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

ప్రయోగం.. ఎవరెస్ట్‌తో సమానంఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే ఈ ప్రయోగం మాత్రం ఎవరెస్ట్‌ అంత ఎత్తయినదని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ అభివర్ణించారు. మన సమాచార ఉపగ్రహాలనే కాకుండా విదేశాలకు చెందిన భారీ ఉపగ్రహాలను కూడా పంపే స్థాయికి చేరుకోవడం గర్వకారణమని అన్నారు. తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్‌’ను డిసెంబర్‌ 2021 నాటికి చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి ముందు ప్రయోగాత్మకంగా మానవ రహిత గగన్‌యాన్‌ను డిసెంబర్‌ 2020 నాటికి పరీక్షించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, 2019 జనవరిలో చంద్రుడిపై పరిశో«ధనలు చేసేందుకు చంద్రయాన్‌–2  గ్రహాంతర ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. 2019లో 10 ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు.

అధునాతన పేలోడ్‌లతో..
జీశాట్‌–29లో ప్రత్యేకించి కేయూ–బ్యాండ్‌ ఫోర్‌ యూజర్‌ స్పాట్‌ బీమ్స్, కేఏ–బ్యాండ్‌ ఫోర్‌ యూజర్‌ స్పాట్‌ భీమ్‌తో పాటు వన్‌ యూజర్‌ స్టీరిబుల్‌ భీమ్, క్యూ/వీ– బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ పేలోడ్, జియో హైరిజల్యూషన్‌ కెమెరా, ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ పేలోడ్‌ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల్లో ఇలాంటి పేలోడ్స్‌ పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని మారుమూల గ్రామాలను ఈ ఉపగ్రహం ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తుంది. విలేజ్‌ రీసోర్స్‌ సెంటర్స్‌ అంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు, సదుపాయా లు, ఇతర ఏర్పాట్లను గుర్తించి సమాచారాన్ని అందించడమే కాకుండా భారత సైనిక అవసరాలకూ దోహదపడుతుంది.

ఉపగ్రహం వివరాలు..
► రాకెట్‌: జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3–డీ2
► ఉపగ్రహంతోకలిపి మొత్తం బరువు: 640 టన్నులు
► ఎత్తు: 43.39 మీటర్లు  
► వ్యాసం: 4 మీటర్లు
► ప్రయోగ దశలు: మూడు (ఘన, ద్రవ, క్రయోజెనిక్‌)
► జీశాట్‌29 ఉపగ్రహం బరువు: 3,423 కిలోలు
► ఉపగ్రహ జీవితకాలం: 10 ఏళ్లు
► పనిచేయడానికి కావాల్సిన విద్యుత్‌: 4600 వాట్లు


రాకెట్‌ నమూనాతో ఇస్రో చైర్మన్‌ శివన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top