వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్‌ | Sakshi
Sakshi News home page

వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్‌

Published Mon, Jul 22 2019 3:40 PM

ISRO Chairman Sivan Says Next 24 Hours Is Crucial - Sakshi

సాక్షి, శ్రీహరికోట : అంతరిక్ష చరిత్రలోనే భారత్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో చైర్మన్‌ కే.శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్‌-2 ప్రయోగానంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైందన్నారు. అత్యంత కీలకమైన క్రయోజనిక్‌ దశ విజయవంతంగా ముగిసిందని, నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ప్రవేశించిందని తెలిపారు. చంద్రుడిపై భారత్‌ చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఇదని అభివర్ణించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని చెప్పారు. ఇస్రో టీమ్‌ అహర్నిశలు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మూడు ఉపగ్రహాలను ఒకే రోవర్‌ ద్వారా ప్రయోగించినట్లు తెలిపారు. ఊహించనదానికంటే చంద్రయాన్‌-2 తొలిదశ ఎక్కు విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.

అభినందనల వెల్లువ.. 
చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి.. భారత్‌ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఇస్రోశాస్త్ర వేత్తలను రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌,  ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్వీటర్‌ వేదికగా శాస్త్రవేత్తలను కొనియాడారు. ‘ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగంతో దేశం మొత్తం గర్వించేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇస్రో ఇలానే మరిన్ని కొత్త విషయాల కోసం ప్రయోగాలు చేపడుతూ విజయవంతం కావాలి.’ అని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చరిత్రలోనే ఇదో అద్భుత ఘట్టమని, మన శాస్త్రవేత్తల శక్తిని,130 కోట్ల భారతీయుల అంకిత భావాన్ని చంద్రయాన్‌ ప్రయోగం ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

కొనియాడిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..
ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ‘చంద్రయాన్‌-2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు అభినందనలు. కోట్ల కలలను చంద్రునిపైకి తీసుకెళ్లడం చారిత్రాత్మక సందర్భం. మన శాస్త్రవేత్తలు, ఇస్రో భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 


చదవండి: జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్‌–2

Advertisement

తప్పక చదవండి

Advertisement