జీశాట్‌–31 ప్రయోగం సక్సెస్‌

India successfully launches communication satellite GSAT-31 - Sakshi

కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి  ఉపగ్రహ ప్రయోగం

దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం

శ్రీహరికోట(సూళ్లూరుపేట)/బెంగళూరు: దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన జీశాట్‌–31 సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.31 గంటలకు ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌–5 ఉపగ్రహ వాహక నౌక (రాకెట్‌ వీఏ 247) ద్వారా జీశాట్‌–31 కమ్యూనికేషన్‌ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది.

ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్‌ రావు ఉపగ్రహ పరిశోధన కేంద్ర డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌ పర్యవేక్షణలో సుమారు రూ.400 కోట్ల వ్యయంతో తయారు చేశారు.  జీశాట్‌–31తోపాటు సౌదీకి చెందిన 1/హెల్లాస్‌ శాట్‌–4 జియోస్టేషనరీ శాటిలైట్‌ను ఏరియన్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ప్రయోగించిన 42 నిమిషాల్లోనే 2 ఉపగ్రహాలు అత్యంత సునాయాసంగా ముందుగా నిర్ణయించిన సమయానికే నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించాయి.

జీశాట్‌–31 ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 250 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,850 కిలోమీటర్ల ఎత్తులోని దీర్ఘ వృత్తాకార భూ బదిలీ కక్ష్యలో 3.0 డిగ్రీల కోణంలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు తమ అధీనంలోకి తీసుకున్నారు. భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాన్ని రెండు మూడు విడతల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

కౌరునే ఎందుకు..
జూన్, జులైలో మరో జియోస్టేషనరీ శాటిలైట్‌ జీశాట్‌30ను ఇక్కడి నుంచే ప్రయోగిస్తామని  కౌరు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌.పాండియన్‌ చెప్పారు. ఫ్రెంచ్‌ గయానాతో భారత్‌కు 1981 నుంచి అంతరిక్ష సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇవి క్రమంగా మరింత బలపడుతున్నాయన్నారు. ఈ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2 ద్వారా ప్రయోగించే వీలున్నప్పటికీ ఇక్కడ చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాల్సి వచ్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

బహుళ ప్రయోజనకారి..
సుమారు 2,536 కిలోలు బరువున్న ఈ అధునాతన ఉపగ్రహాన్ని ఇస్రో తయారుచేసింది.  ఇందులో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల అత్యంత శక్తివంతమైన కేయూ బాండ్‌ ట్రాన్స్‌ఫాండర్ల వ్యవస్థను అమర్చారు. ఇది ఇన్‌శాట్, జీశాట్‌ ఉపగ్రహాలకు ఆధునిక రూపంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌–4సీఆర్, ఇన్‌శాట్‌–4ఏ సమాచార ఉపగ్రహాల కాలపరిమితి త్వరలో ముగియనుంది. ఈ రెండు ఉపగ్రహాల స్థానాన్ని కూడా జీశాట్‌–31 ఉపగ్రహం భర్తీ చేయనుంది.

ఈ ఉపగ్రహం ముఖ్యంగా భారత భూభాగం, ద్వీపాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర పరిసరాలను పర్యవేక్షించి తగిన సమాచారాన్ని అందించనుంది. దీని ద్వారా వీశాట్‌నెట్‌వర్క్స్, టెలివిజన్‌ అప్‌లింక్స్, డిజిటల్‌ శాటిలైట్‌ న్యూస్‌ గ్యాదరింగ్, సెల్యులార్‌ బ్యాకప్, డీటీహెచ్‌ టెలివిజన్‌ సర్వీసులు, స్టాక్‌ ఎక్చ్సేంజీ, ఈ–గవర్నెన్స్, ఏటీఎం సేవలన్నీ మెరుగుపడే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన టెలి కమ్యూనికేషన్‌ అప్లికేషన్లకు అవసరమైన సమాచారాన్ని పెద్దమొత్తంలో ట్రాన్స్‌ఫర్‌ ఇది చేయనుంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top