ఇమ్రాన్‌ నుంచి ఇంకా ఆహ్వానం అందలేదు

Imran Khan Not Invited Us, Says Ministry of External Affairs Of India - Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) అధినేత, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా సార్క్‌ దేశాల అధినేతల్ని ఆహ్వానించినట్లు మొదట కథనాలు ప్రచారమయ్యాయి. అయితే ఆపై విదేశీ నేతలెవరినీ ఆహ్వానించడం లేదని పాక్‌ విదేశాంగశాఖ ప్రకటించింది. ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారానికి సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని భారత విదేశాంగశాఖ కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ నుంచి కానీ, పీటీఐ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ దేశానికి చెందిన ఎవరికైనా పాక్‌ నుంచి ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినట్లు సంప్రదిస్తే.. వారికి అనుమతి ఇవ్వాలా.. వద్దా అనే దానిపై చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. 

ప్రధాని మోదీతో పాటు భారత మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, సునీల్‌ గావస్కర్‌, బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ ఖాన్‌లకు ఆహ్వానం అందినట్లు కథనాలు వచ్చాయి. అయితే భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే పాక్‌కు వెళ్తామని ఈ క్రికెటర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆమీర్‌ తెలిపారు. (ఇమ్రాన్‌ కోసం పాక్‌కు వెళ్తాం : భారత దిగ్గజ క్రికెటర్లు)

తొలుత ఆగస్టు 11నే ప్రధానిగా ప్రమాణం చేస్తానని స్వయంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. అయితే పాక్‌ నూతన ప్రధాని ఆగస్టు 14న (పాక్‌ ఇండిపెండెన్స్‌ డే) ప్రమాణస్వీకారం చేయాలన్నది తన, ఆపద్ధర్మ ప్రధాని నసీరుల్‌ ముల్క్‌ ఉద్దేశమని తాత్కాలిక న్యాయమంత్రి అలీజాఫర్‌ తెలిపారు. జాతీయ అసెంబ్లీ ఆగస్టు 12న ప్రారంభవుతుందనీ, ఇమ్రాన్‌ ప్రధానిగా 14న ప్రమాణం చేస్తారని ఆయన ఇటీవల వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top