గ్రీన్‌ రెవల్యూషన్‌తోనే కాలుష్యం!?

Green Revolution Causes For Pollution In National Capital Area - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట దుబ్బులను తగుల బెట్టడం వల్ల ఢిల్లీ నగరాన్ని కాలుష్య భూతం కమ్ముకుంది. ఈసారి గాలులు మందగమనాన్ని మించకపోవడం, టెంపరేచర్‌ తక్కువగా ఉండడం వల్ల కాలుష్య కణాలు దిగువ వాతావరణంలోనే స్థిరపడిపోయి ఇటు ఢిల్లీ వాసులనే కాకుండా అటు ఉత్తరాది ప్రాంతంవైపు కూడా ప్రయాణిస్తూ అక్కడి  ప్రజలనూ భయకంపితుల్ని చేస్తున్నాయి. అసలు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఎందుకు పంట దుబ్బులను తగులబెడుతున్నారు. అందుకు కారణాలేమిటీ? ఒకప్పుడులేని ఈ పద్ధతి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? గ్రీన్‌ రెవల్యూషన్‌ నుంచే వచ్చిందా? అసలు గ్రీన్‌ రెవల్యూషన్‌ ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? దాని వల్ల ప్రజలకు కలిగిన లాభాలేమిటీ, నష్టాలేమిటీ? పంట దుబ్బులను తగులబెట్టకుండా ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? ఉంటే అవేమిటీ? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలన్నింటికీ సరైన, స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి. 

1960 ప్రాంతంలో భారత్‌కు తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. అమెరికా సరఫరా చేసే ఆహార పదార్థాలపై ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది. దేశంలో ఆహారోత్పత్తిని బాగా పెంచాలని అప్పటి భారత ప్రభుత్వం భావించింది. అందుకు వ్యవసాయ సంస్కరణలు అవసరమని రెండు కమిటీలు అభిప్రాయపడ్డాయి. ఒక కమిటీ వ్యవసాయ రంగంలో తీసుకరావాల్సిన సాంకేతిక మార్పులను సూచించగా, సామాజిక మార్పులు అవసరమని మరో కమిటీ అభిప్రాయపడింది. ఎరువులు, క్రిమిసంహారక మందులతో పాటు హైబ్రీడ్‌ విత్తనాలను ప్రవేశపెట్టాలని సాంకేతిక కమిటీ సూచించింది.

ఎక్కువ దిగుబడి నిచ్చే వంగడాలను ప్రవేశపెట్టాలని 1961లో అప్పటికి భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ సూచించారు. ఖరీదైన విత్తనాలను, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని, వీటి విషయంలో రైతులను ప్రోత్సహించాలంటే సబ్సిడీపై విత్తనాలు ఇవ్వడమే కాకుండా రైతుల పెట్టుబడులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలని సూచించారు. చర్చోపచర్చల అనంతరం దీన్ని అమలు చేయాలని 1964లో అప్పటి వ్యవసాయ మంత్రి సీ. సుబ్రమణియం నిర్ణయించారు. ఈ విధానం వల్ల పెద్ద రైతులు బాగు పడతారని, వినియోగదారులు నష్టపోతారని ప్రతిపక్షాలు గొడవ చేశాయి. దాంతో ప్రతిపాదన అటకెక్కింది. 

ఆహార సహాయంపై అమెరికా ఆంక్షలు
భారత ప్రజలకు తేరగా ఆహారాన్ని సాయం చేయడానికి తాము సిద్ధంగా లేమని 1965లో అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్‌ బీ జాన్సన్‌ ప్రకటించి ఆంక్షలు విధించారు. 1966 నుంచి తాము నిల్వ ఉండే ఆహార పదార్థాలకు బదులుగా రెడీమేడ్‌ ఆహార పదార్థాలను పంపిస్తామంటూ ‘షిప్‌ టూ మౌత్‌’ పాలసీని ప్రకటించారు. అదే సంవత్సరం అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిపక్షాల అభ్యంతరాలను లెక్క చేయకుండా గ్రీన్‌ రెవెల్యూషన్‌ను అమలు చేశారు. ఏడాది కాలంలోనే గోధుమ పంట 40 శాతం పెరిగింది. అంటే 120 లక్షల టన్నుల నుంచి 170 లక్షల టన్నులకు పెరిగింది. ఆ తర్వాత వరి ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. గ్రీన్‌ రెవల్యూషన్‌ కాలాన్ని 1965 నుంచి 1980 వరకని పేర్కొనవచ్చు.

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనే 
అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను వాడేందుకు పలు రాష్ట్రాల్లోని రైతులు నిరాకరించారు. సంప్రదాయ వంగడాలకే వారు మొగ్గు చూపారు. అప్పటి వరకు గోధుమ పంటలకే అలవాటు పడిన పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఈ వరి వంగడాలను వాడేందుకు ముందుకు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం రైతులు కూడా సరేనన్నారు. జాతీయంగా వరి ఉత్పత్తిలో 1960లో పంజాబ్‌ వాటా 0.7 శాతం ఉండగా, 1979 వరకల్లా దాని వాటా ఏడు శాతానికి చేరుకుంది. ఓ పంట వరి, మరో పంట గోధుమ (ఆర్‌డబ్లూసీఎస్‌) వేసే విధానాన్ని అమలు చేయడంతో అమోఘ ఫలితాలు వచ్చాయి. హర్యానా కూడా పంజాబ్‌తో పోటీ పడుతూ వచ్చింది. 

జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు వరి
సంప్రదాయ వరి వంగడాలకు భిన్నంగా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను జూన్‌లో వేస్తే అక్టోబర్‌లో పంట చేతికి వస్తోంది. మళ్లీ అక్టోబర్‌ లేదా నవంబర్‌ మొదటి వారంలోనే గోధుమలను వేయాల్సి ఉంటుంది. ఇరు పంటల మధ్య వ్యవధి ఉండేది 15 రోజులే. ఈ రోజుల్లో వరి పంట నూర్పుడు అయిపోవాలి. వరి దుబ్బును తొలగించాలి. రెండో పంట గోధుమకు పొలాన్ని సిద్ధం చేయాలి. 

దుబ్బును తగులబెట్టడానికి సవాలక్ష కారణాలు
వరి దుబ్బును తొలగించడానికి కూలీలు దొరకరు. దొరికినా చాలా ఖర్చు. ఎకరాకు ఆరేడు వేల రూపాయలు అవుతుంది. మన మసూరు బియ్యం లాగా పంజాబ్, హర్యానాలో పండించే విదేశీ వంగడం ఉండదు. ఏపుగా పెరుగుతుంది. భూమిలో బలంగా పాతుకు పోతుంది. లాగితే ఓ మానాన రాదు. వాటి పొలుసు చాకులా ఉండడం వల్ల లాగేటప్పుడు గీసుకుపోయి రక్తం కారుతుంది. మిగతా వరిదుబ్బును ఇష్ట పడినట్లు ఈ రకం దుబ్బును పశువులు అంతగా ఇష్టపడవు. పశు గ్రాస మార్కెట్‌లో దీన్ని ఎవరూ కొనరు. రైతుకు రవాణా ఖర్చులు కూడా రావు.

ఈ దుబ్బును ఇంటి పశువులకు వేయాలంటే కొన్ని తరాలుగా ఇక్కడి రైతులు పశువులకు బదులుగా యంత్రాలనే వాడుతున్నారు. ఇప్పుడు దుబ్బును కోసే ధ్వంసంచేసే యంత్రాలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. అవి ఖరీదైనవి. అద్దెకు ఇంకా అందుబాటులోకి రాలేదు. భారీ ఎత్తున వ్యవసాయం చేసే రైతులు, ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు ఈ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. స్వతంత్ర రైతులు ఉపయోగించడం లేదు. అలాంటి వారు ఒక్క పంజాబ్‌ రాష్ట్ర రైతుల్లో 25 శాతం మంది ఉన్నారు. వారు పొలంలో కిరోసిన్‌ పోసి తగుల బెడితే తెల్లారే సరికి మొత్తం వరి దుబ్బు మాయం అవుతుంది. వారే కాలుష్యానికి కారణం అవుతున్నారు. 1980 తర్వాతే ఈ పద్ధతి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

(గమనిక: సిద్ధార్థ్‌ సింగ్‌ రాసిన ‘ది గ్రేట్‌ స్మాగ్‌ ఆఫ్‌ ఇండియా’లోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top