
ఆశీర్వచనాలు అందుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి ఆదివారం మొదటిసారి ఢిల్లీ వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్థానిక తెలుగు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తారని తెలిసి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. వైఎస్ జగన్ వారందరినీ నవ్వుతూ పలకరిస్తూ ముందుకు సాగారు.
ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో సమావేశం అనంతరం మొదటిసారి ఏపీ భవన్‌కు వచ్చిన వైఎస్ జగన్‌కు అక్కడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జై జగన్ నినాదాలతో కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. వైఎస్ జగన్‌ను బీజేపీ నేతలు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కలసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పలువురు ఏపీ, తెలంగాణ కేడర్‌కు చెందిన సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులు కలసి శుభాకాంక్షలు తెలిపారు.
గౌరవవందనం స్వీకరిస్తోన్న వైఎస్సార్‌సీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ముందుగా ఢిల్లీలోని టీటీడీ దేవాలయం వేదపండితుల నుంచి ఆశీర్వాదం పొందారు. ఏపీ భవన్‌లోని సీఎం కాటేజీలో భోజనం చేసిన అనంతరం వైఎస్ జగన్, పార్టీ నేతలు ఢిల్లీలో గతంలో ముఖ్యమంత్రికి కేటాయించిన అధికారిక నివాసమైన 1, జన్‌పథ్‌కు వెళ్లారు. అక్కడ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
100 అడుగుల భారీ ఫ్లెక్సీ..
వైఎస్ జగన్ ఏపీ భవన్ వస్తుండడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిలో 100 అడుగుల వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌ల ఫ్లెక్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఫ్లెక్సీని ఏపీ భవన్‌లోని 9 అంతస్తుల గోదావరి బ్లాక్‌పై ఏర్పాటు చేయడంతో అందర్నీ అకట్టుకుంది.
శుభాకాంక్షలు తెలుపుతున్న పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా