పిల్లాడి పాటి బుద్ధి కేంద్రానికి లేదా?

Finance Ministry Refusing To Disclose Names Of Loan Defaulters - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఘరానా కార్పొరేట్‌ కంపెనీలు తీసుకున్న అక్షరాల 2.4 లక్షల కోట్ల రూపాయలను మొండి బకాయిల కింద ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు ఎంతో ఉదారంగా ఇటీవల రద్దు చేసిన విషయం తెల్సిందే. ఎవరి బకాయిలను రద్దు చేశారో వెల్లడించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఇటీవల పార్లమెంట్‌లో ఓ సభ్యుడు లిఖిత పూర్వకంగా కోరగా, అందుకు ఆ శాఖ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు–1934 చట్టంలోని 45ఈ సెక్షన్‌ ఇందుకు అనుమతించడం లేదని, ఈ విషయాన్ని ఆర్బీఐ స్వయంగా మంత్రిత్వ శాఖకు తెలియజేసిందని సదురు మంత్రిత్వ శాఖ సుస్పష్టం చేసింది. అంతకుముందు ఇదే విషయమై ఓ సామాజిక కార్యకర్త సమాచార చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తును కూడా ఆర్బీఐ తోసిపుచ్చింది.

ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశంలో లక్షల కోట్ల రూపాయలను ఎగవేసి బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉనికికే ప్రమాదం తెస్తున్న కార్పొరేట్ల బాగోతాన్ని బయట పెట్టవద్దని చట్టం చెబుతుందా ? చెబుతుంటే అలా చెప్పే చట్టం చెల్లుతుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి చట్టానికి కాలం మూడదా, పాడె కట్టరా? సుప్రీం కోర్టు 2015లో అదే చేసింది. ఆర్బీఐ వర్సెస్‌ జయంతిలాల్‌ ఎన్‌ మిస్త్రీ మధ్య నడిచిన కేసులో సమాచార చట్టాన్ని ఉల్లంఘించే ఏ చట్టం చెల్లదని స్పష్టం చేసింది.  ప్రజల సమాచార హక్కుకు ప్రాధాన్యతనిస్తున్న సమాచార చట్టంలోని 22వ సెక్షన్‌ను ఆర్బీఐ యాక్ట్, బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్, అఫీషియల్‌ సీక్రెట్‌ యాక్ట్‌ ఎప్పుడూ అడ్డుకోలేవని, ముఖ్యంగా సమాచార సేకరణకు సంబంధించిన పారదర్శక చట్టమే చెల్లుతుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

‘దేశంలోని ఆర్థిక సంస్థలు తమ అవకతవలకు స్వచ్ఛత లేదా పారదర్శకత లేని చట్టాలను అడ్డం పెట్టుకుంటున్నాయి. అలాంటి చట్టాలు ఇక చెల్లవు. అవకతవకల ఆర్థిక సంస్థలకే ఆర్బీఐ కొమ్ముకాస్తూ ప్రజా సమీక్ష నుంచి తప్పించుకోవాలని చూడడం భావ్యం కాదు. అగౌరవ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. గతంలో కూడా ప్రజలను బ్యాంకుల ఇలా మభ్యపెట్టడం గురించి మాకు తెలుసు. ఇలాంటి చర్యలు దేశ ప్రయోజనాలకుగాని, ప్రజల ప్రయోజనాలకుగానీ ఎంత మాత్రం మంచివి కాదు. వాచ్‌డాగ్‌ సంస్థగా సమాచార హక్కు చట్టం కింద ప్రజలు అడిగిన సమాచారాన్ని వెల్లడించేందుకు ఉత్సాహం చూపాల్సిన ఆర్బీఐ, బ్యాంకుల అవకతవకలను దాచిపెట్టడం దిగ్భ్రాంతికరం’ అంటూ 2015లో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది.

ఆర్బీఐ చట్టంలోని 45ఈ సెక్షన్‌ కింద బ్యాంకులకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు తమకు హక్కు ఉందని, అలాగే చట్టంలోని 45ఈ (3) సెక్షన్‌ కింద సదరు సమచారాన్ని కోర్టులుగానీ, ట్రిబ్యునల్‌గానీ, మరే ఇతర అథారిటీగానీ వెల్లడించడానికి వీల్లేదంటూ ఆర్బీఐ చేసిన వాదనలను కూడా సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. అంతేకాకుండా దేశ ఆర్థిక ప్రయోజనాలు భంగం లేదా హాని కలిగించే సమాచారాన్ని తాము సమాచార చట్టంలోని 8 (1)(ఏ), 8 (1)(డీ) సెక్షన్ల మేరకు వెల్లడించాల్సిన అవసరం లేదని కూడా ఆర్బీఐ వాదించింది. ఈ సెక్షన్లను ఉటంకిస్తూనే  సమచార వెల్లడికి సంబంధించి కేంద్ర సమాచార కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఆర్బీఐ అనేక సార్లు త్రోసి పుచ్చింది.

ఈ వాదనను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చిన సుప్రీం కోర్టు ఆర్బీఐ వైఖరిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ‘సమాచారాన్ని వెల్లడిస్తే దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ ఆర్బీఐ చేస్తున్న వాదనలో ఆధారాలే కాదు, ఎలాంటి పస లేదు. పైగా అది అర్థంపర్థంలేని వాదన. ప్రజలు కోరిన సమాచారాన్ని ఇవ్వడం వల్ల ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయని, ఇవ్వక పోవడం వల్ల దేశ ప్రయోజనాలే కాదు, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ కేంద్ర సమాచార కమిషన్‌ చెప్పడంలో అర్థం ఉంది. ప్రజాస్వామ్య దేశంలో సార్వభౌములైన ప్రజలు అడిగిన సమాచారాన్ని వెల్లడించకుండా, అది దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం అనడం ఎంత అర్థరహితం!’ అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top