పోరు రసవత్తరం..!

పోరు రసవత్తరం..! - Sakshi


బెంగాల్‌లో మారుతున్న బలాలు!

 

♦ తృణమూల్ - లెఫ్ట్ - కాంగ్రెస్ కూటమిల మధ్య హోరాహోరీ

♦ ఎన్నికల సమరంలో కేంద్ర బిందువుగా మారిన ‘అవినీతి’

♦ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పోత్ర పోషిస్తామంటున్న బీజేపీ

 

 పశ్చిమబెంగాల్‌లో సుదీర్ఘ వామపక్ష పాలనకు తెరవేసి అధికారంలోకి విచ్చన తృణమూల్ కాంగ్రెస్.. మళ్లీ అధికారం నిలుపుకుంటుందని ఎన్నికల ఆరంభానికి ముందు పలు సర్వేలు, రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. అయితే.. ఆరు దశలుగా జరుగుతున్న ఎన్నికల్లో ఒక్కో దశ ముగిసే కొద్దీ.. పరిస్థితులు మారుతూ పోటీ హోరాహోరీ రూపం తీసుకుంటోంది. వరుసగా ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ చేతుల్లో అధికారం కోల్పోయిన లెఫ్ట్ ఫ్రంట్.. ఇప్పుడు ఆమెను ఎదుర్కోవటానికి తొలిసారి కాంగ్రెస్‌తో జట్టుకట్టటం విశేషం.



 మెత్తబడ్డ మమత

 బెంగాల్ ఎన్నికల సమరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘అవినీతి’ అంశం కేంద్ర బిందువుగా మారింది. శారదా కుంభకోణం, నారదా స్టింగ్ టేపులు అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను తీవ్రంగా ఇరకాటంలో పెట్టాయి. మార్చి 31వ తేదీన రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలోని ఫై-ఓవర్ కుప్పకూలి 21 మంది ప్రానాలు కోల్పోవటం అధికార పార్టీ కష్టాలను పెంచింది. ఆ నిర్మాణానికి మెటీరియల్ సరఫరా చేసింది స్థానిక తృణమూల్ ఎమ్మెల్యే బంధువేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మార్చి 14న బయటపడ్డ నారదా స్టింగ్ టేపులు 11 మంది టీఎంసీ సీనియర్ నేతలు భారీగా డబ్బులు అందుకుంటున్నట్లు చూపాయి. వారిలో కొందరు శారదా కుంభకోణంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలన్నీ లెఫ్ట్ ఫ్రంట్ - కాంగ్రెస్ కూటమికి, బీజేపీకి ఆయుధాలుగా కలిసివచ్చాయి.



అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం మొదలుపెట్టాయి. తమ పాలనలో అభివృద్ధి, పురోగతి నినాదాలతో బరిలోకి దిగిన సీఎం మమతాబెనర్జీ.. స్టింగ్ ఆపరేషన్, అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణిస్తూ మొదట్లో తీవ్ర ఎదురుదాడికి దిగారు. కానీ.. పోలింగ్ దశలు ఒక్కొక్కటిగా ముగుస్తున్న కొద్దీ ఆమె స్వరం మారుతోంది. ‘‘ఏదైనా తప్పు చేస్తే క్షమించండి’’ అంటూ ఓటర్లను కోరుతూ పరోక్షంగా తప్పులను ఒప్పుకుంటున్నారు. ఈ నెల 8వ తేదీన కుల్తీలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ‘‘అన్ని పొరపాట్లకూ నేను బాధ్యత వహిస్తున్నాను. మీకు నాపై కోపం ఉండొచ్చు.. కానీ తృణమూల్ కాంగ్రెస్‌కు మీ ఆశీస్సులు ఇవ్వకుండా ఉండొద్దు.



లేదంటే నేను ముందుకు సాగటం కష్టమవుతుంది’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు రోజులకు నారదా టేపులపై మమత సర్కారు విచారణకు ఆదేశించింది. మళ్లీ ఈ నెల 17న మమత కోల్‌కతా నడిబొడ్డున ఒక సభలో మాట్లాడుతూ.. ‘‘ఒక అక్రమ సంస్థ 2014లో ఈ పని (స్టింగ్ ఆపరేషన్) చేసింది. దీనిని ఇప్పుడు ఎందుకు తెరపైకి తేవటం? ఇంతకుముందే తెచ్చి ఉంటే నేను ఆలోచించి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఏమీ చేయలేం. అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తర్వాత వారిని మార్చలేను’’ అని పేర్కొన్నారు. అనంతరం రెండు రోజులకు.. నర్మదా టేపుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముకుల్‌రాయ్.. తాను డబ్బులు తీసుకున్నానని, కానీ అది తన కోసం కాదని, పార్టీ కోసమని అంగీకరించారు. మరోవైపు.. కాంగ్రెస్, వామపక్షాల నుంచి అధికారపక్షంలో భారీగా వచ్చిన వలసలు రావటంతో.. ఆ పార్టీలో అంతర్గత పోరు కూడా తీవ్రమవుతున్న వార్తలు వెలువడుతున్నాయి.



 కలవరపెడుతున్న హింస..

 ఇక రాజకీయ హింస.. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై దాడులు, హత్యల వంటి ఘటనలు కూడా అధికారపక్షాన్ని కలవరపెడుతున్నాయి. శతాబ్దాల తరబడి ఎన్నికల హింస ఆనవాయితీగా సాగిన బెంగాల్‌లో దానిని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరు విడతలుగా పోలింగ్ నిర్వహించేందుకు షెడ్యూలును ప్రకటించింది. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ 12 మంది రాజకీయ హింసలో హతమయ్యారు. తాజాగా గురువారం నాడు మూడో దశ పోలింగ్‌లో కూడా బర్ధమాన్ జిల్లాలో ఇద్దరు సీపీఎం కార్యకర్తలు హత్యకుగురయ్యారు. ఇది తృణమూల్ మద్దతుదారుల పనేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.



 మొత్తం పశ్చిమబెంగాల్‌లో ఈ నెల 4, 11, 17, 21 తేదీల్లో మూడు దశల పోలింగ్ నాలుగు విడతలుగా ముగిసింది. మొదటి రెండు విడతల్లో పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. మూడో విడతలో హింస చోటు చేసుకుని ఇద్దరు కార్యకర్తలు హత్యకు గురయ్యారు. మొత్తం 167 స్థానాలకు ఓట్ల ప్రక్రియ ముగియగా.. దాదాపు 83 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 25, 30 తేదీలు, మే 5వ తేదీన మిగతా 127 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. సోమవారం (25వ తేదీన) 49 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

 

 పుంజుకుంటున్న లెఫ్ట్ - కాంగ్రెస్...

 ఈ పరిస్థితుల్లో లెఫ్ట్ ఫ్రంట్ - కాంగ్రెస్ కూటమి పుంజుకుంటుందోని.. తృణమూల్‌కు బలమైన పోటీని ఇస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాన ప్రత్యర్థుల బలాబలాలు మారుతున్న నేపధ్యంలో ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తమది కీలక పాత్ర అవుతుందని బీజేపీ ఆశిస్తోంది. అయితే.. తృణమూల్‌తో తెరవెనుక దోస్తీ వార్తలను కమలదళం కొట్టివేస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top