గంగా ప్రక్షాళన కోసం ప్రాణాలను అర్పించిన జిడి అగర్వాల్‌

'Clean Ganga' Activist GD Agarwal Dies - Sakshi

111 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తూ గుండెపోటుతో మరణం

న్యూఢిల్లీ : గంగానది పరిరక్షణ కోసం అమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రొఫెసర్‌ జిడి అగర్వాల్‌ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. కాన్పూర్‌ ఐఐటీ మాజీ ప్రొఫెసర్‌ అయిన అగర్వాల్‌ గంగానది ప్రక్షాళనæకు తన జీవితాన్ని అంకింతం చేశారు. గంగానదిని కాలుష్యరహితం చేయాలని,దాని ప్రవాహాన్ని నిరోధించరాదని కోరుతూ అగర్వాల్‌ గత జూన్‌ 22 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.111 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బుధవారం రాత్రి రిషీకేశ్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)కు తరలించారు. అక్కడ చికిత్సనందిస్తుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.1932లో జన్మించిన అగర్వాల్‌ కాన్పూర్‌ ఐఐటీలో ఎన్విరాన్మెంటల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేశారు అక్కడ పదవి విరమణ చేసిన తర్వాత గంగానది పరిరక్షణకు నడుం కట్టారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్‌ సెక్రటరీగా కూడా పని చేసిన అగర్వాల్‌ 2012లో సన్యాసం స్వీకరించి తన పేరును స్వామి జ్ఞాన స్వరూప్‌ సనంద్‌గా మార్చుకున్నారు.

గంగానది పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఆయన 2008,2009,2012లలో కూడా ఆమరణ దీక్ష చేపట్టారు. గంగానదిపై ఆనకట్టలు కట్టి దాన్ని ప్రవాహ మార్గాన్ని మార్చడాన్ని,గంగానదిని కలుషితం చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ దీక్షలు చేపట్టారు.ఈ దీక్షలకు అన్నా హజారే వంటి వారు కూడా మద్దతు పలికారు.అగర్వాల్‌ డిమాండ్‌ మేరకు అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం నేషనల్‌ గంగా రివర్‌ బేసిన్‌ అథారిటీ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.

అగర్వాల్‌లాగే మరి కొందరు కూడా గంగానది ప్రక్షాళన కోసం తమ ప్రాణాలనుత్యాగం చేశారు. వారిలో నిగమానంద ఒకరు. హైందవ సన్యాసి అయిన స్వామి నిగమానంద సరస్వతి గంగానది కాలుష్యానికి కారణమవుతున్న ఉత్తరాఖండ్‌లోని అక్రమ గనుల తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ 2011 ప్రారంభంలో  ఆమరణ దీక్ష చేపట్టారు. జూన్‌లో దీక్షలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.అనంతరం ఆయన ఆశ్రమానికి చెందిన స్వామి శివానంద 2011, నవంబర్‌ 25 నుంచి 11 రోజుల పాటు ఆమరణ నిరశన చేశారు.దాంతో జిల్లాలో అక్రమ తవ్వకాలను నిషేధిస్తూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

భారతీయ జీవనాడి
భారత దేశ జీవనాడి గంగానది. దేశంలో అతిపొడవైన, పవిత్రమైన నదిగా పేరొందింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన గంగానది 11 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. దేశ జనాభాలో 40% మంది నీటి అవసరాలు గంగానదే తీరుస్తుంది. 50 కోట్ల మంది ప్రజలు గంగానదిపై ఆధారపడి బతుకుతున్నారు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది గంగా పరీవాహక ప్రాంతంలోనే నివసిస్తున్నారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలతో ముడిపడి ఉన్న గంగానది మన దేశంలో 52 నగరాలు, 48 పట్టణాల గుండా ప్రవహిస్తోంది. పరిశ్రమలు వదిలే వ్యర్థాలు, మానవ విసర్జితాలు, చెత్తాచెదారం తదితరాల వల్ల గంగానది కలుషితమైపోతోంది.రాను రాను ఈ నీరు తాగడానికే కాక సాధారణ వినియోగానికి కూడా పనికిరానంతగా కలుషితమైపోవడంతో నదిని ప్రక్షాళన చేయాలన్న ఆలోచన వచ్చింది. రాజీవ్‌ ప్రభుత్వం నుంచి మోదీ సర్కారు వరకు అన్ని ప్రభుత్వాలు గంగా ప్రక్షాళణకు నడుం కట్టాయి. కేంద్ర ప్రభుత్వం దీని కోసం వేల కోట్లు వెచ్చిస్తోంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top