ఎర్రటి స్ట్రాబెర్రీ.. రోజుకు రూ. 8 వేలు ఆదాయం!

Civil Engineer Strawberry Cultivation In Karnataka Hubli - Sakshi

బంజరు భూముల్లో స్ట్రాబెర్రీ సాగు

హుబ్లీ వద్ద సివిల్‌ ఇంజినీర్‌ కృషి

నెలకు లక్షలాది రూపాయల ఆదాయం  

అమెరికా, యూరప్‌ దేశాల్లో కనిపించే స్ట్రాబెర్రీ పండ్లు హుబ్లీ వద్ద విరగ్గాస్తున్నాయి. ఎర్రగా నిగనిగలాడుతూ చూడగానే ఉల్లాసం కలిగించే పండ్లు ఒక బంజరు భూమిలో పండడం వెనుక శ్రమ,ఉత్సాహం దాగున్నాయి. శశిధర అనే సివిల్‌ ఇంజనీరు మహారాష్ట్రలో చూసి తమ ఊళ్లోనూ స్ట్రాబెర్రీల సాగుతో ఆదర్శంగా నిలిచారు. 

సాక్షి, బళ్లారి: ఆయన సివిల్‌ ఇంజనీర్‌. వ్యవసాయంపై మక్కువతో వినూత్న పంటలు సాగుచేస్తూ నేలతల్లి సేవలో పులకిస్తున్నారు. హుబ్లీ నగరానికి చెందిన సివిల్‌ ఇంజనీర్‌ శశిధర మహారాష్ట్రలో పనిచేస్తున్న సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ పండ్ల తోటలను పండించడం చూశారు. అక్కడ అవగాహన పెంచుకుని అక్కడే పొలం కౌలుకు తీసుకుని స్ట్రాబెర్రీ పండించారు. మంచి దిగుబడులు రావడంతో స్వంత ప్రాంతం హుబ్లీ చుట్టుపక్కల ఎక్కడైనా భూమి తీసుకుని స్ట్రాబెర్రీ పండించాలని ఆలోచించి మహారాష్ట్ర తిరిగి వచ్చారు.  

ఎకరాతో ఆరంభం  
కలఘటిగి తాలూకా హుల్లంబి గ్రామంలో రాళ్లతో కూడిన ఆరు ఎకరాల బంజరు భూమిని ఎంపిక చేసుకున్నారు. ఇక సాగుకు ఉపక్రమించారు. తొలుత స్ట్రాబెర్రీని  గడ్డలను తీసుకుని వచ్చి తన పొలంలోనే నర్సరీ చేసుకుని, ఒక ఎకరంలో 25వేల మొక్కలను నాటేందుకు సిద్ధం చేసుకున్నారు. డ్రిప్‌ వ్యవసాయ పద్ధతిని అలవరుచుని, ఒక ఎకరా పొలంలో స్ట్రాబెర్రీ మొక్కలను నాటారు. 45 రోజులకే ఎర్రగా నిగనిగలాడే స్ట్రాబెర్రీలు పండడంతో రైతు శశిధర ఆనందానికి అవధుల్లేవు. క్రమంగా మరికొన్ని ఎకరాలకు పంటను విస్తరించారు. బంజరు భూముల్లో ఎవరికి అంతుపట్టని విధంగా ఆమెరికాలో పండించే స్ట్రాబెర్రీని పండిస్తున్న సివిల్‌ ఇంజనీర్‌ శశిధర పలువురు రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. నిత్యం 20 మంది కూలీలకు ఉపాధిని కల్పిస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు.  

కేజీ రూ. 100-400  
ఒక కేజీ పండ్లు 100 నుంచి రూ.400 వరకు వరకు అమ్ముడుపోతున్నాయని శశిధర సంతోషంగా చెప్పారు. మార్కెట్‌లో కూడా మంచి గిరాకీ ఉందని, ఇంజనీర్‌ వృత్తి కంటే వ్యవసాయం చేయడం సంతృప్తినిస్తుందని, ప్రతి నిత్యం తన కుమారులు, భార్య పొలంలో పనిచేస్తుంటారని తెలిపారు. ఒక ఎకరం స్ట్రాబెర్రీతో పాటు మరో ఐదు ఎకరాల్లో వివిధ రకాలు కూరగాయాలు, పంటలను పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్నానన్నారు.

రోజుకు రూ.8 వేల ఆదాయం  
మొక్కలు నాటిన 45 రోజుల్లో పండ్లు కాశాయన్నారు. 11 నెలలుగా మంచి ఆదాయం వచ్చిందన్నారు. ప్రతి రోజు కూలీలు ఖర్చులు పోను రూ.8 వేల వరకు ఆదాయం వస్తోందని శశిధర తెలిపారు. దీంతో పాటు ఎలాంటి రసాయనిక మందులు, పురుగులు మందులు వాడడం లేదన్నారు. పలువురు రైతులు తన పొలం సందర్శించి, సలహాలు అడుగుతూ ఉంటారన్నారు. అందరూ శశిధర మాదిరిగా కృషిచేస్తే వ్యవసాయం పండుగే అవుతుంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top