9 గంటల్లోనే అంతా..

Ayodhya Verdict: December 6 which changed the cover of India - Sakshi

ఉదయం 10.30 నుంచి సాయంత్రం7.30 దాకా

భారత ముఖచిత్రాన్ని మార్చేసిన డిసెంబర్‌ 6

న్యూఢిల్లీ: వేలల్లో పోలీసులు పహారా కాశారు. కానీ లక్షల్లో కరసేవకులు చొచ్చుకొచ్చారు. కొద్ది గంటల్లోనే బాబ్రీ మసీదు నేలమట్టమైంది. 1992, డిసెంబర్‌ 6న ఐదు వేల మంది కరసేవకులు ఒక్క సారిగా బాబ్రీ మసీదులోకి చొచ్చుకురావడంతో భద్రతా దళాలు చేతులెత్తేశాయట! ఆ  సమయంలో అయోధ్యలో 35 కంపెనీల పీఏసీ పోలీసు బలగాలు, 195 కంపెనీల పారామిలటరీ దళాలు, నాలుగు కంపెనీలు సీఆర్‌పీఎఫ్, 15 బాష్ప వాయువు బృందాలు, 15 మంది పోలీసు ఇన్‌స్పె క్టర్లు, 30 మంది పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 2,300 మంది పోలీసు కానిస్టేబుళ్లు మోహరించి ఉన్నారు. అయినప్పటికీ కరసేవకుల్ని అడ్డుకోవడంలో  విఫలమయ్యారని లిబర్‌హాన్‌ కమిషన్‌ నివేదిం చింది. రామ జన్మభూమి–బాబ్రీ మసీదును కూల్చివేసే సమయంలో దాదాపు 75 వేల నుంచి లక్షన్నర మంది కరసేవకులు ఆ ప్రాంతంలో ఉన్నారని పేర్కొంది. 

లిబర్‌హాన్‌ నివేదిక ప్రకారం ఆ రోజు ఏం జరిగిందంటే... 
ఉదయం 10:30 ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషి వంటి సీనియర్‌ బీజేపీ నేతలు, వీహెచ్‌పీ నేతలు, సాధువులు కరసేవ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ 20 నిమిషాల సేపు గడిపి మత ప్రబోధకులు ఉపన్యాసం చేస్తున్న రామ్‌ కథ కుంజ్‌కి చేరారు. 

ఉదయం 11:45 ఫరీదాబాద్‌ డీఎం, ఎస్‌ఎస్‌పీ రామ జన్మభూమి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 

మధ్యాహ్నం 12:00 ఓ టీనేజీ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకొని మసీదు గుమ్మటంపైకి ఎక్కాడు. అతనితో పాటు మరో 150 మంది  కరసేవకులు, ఒక్కసారిగా మసీదుని చుట్టుముట్టేశారు.

మధ్యాహ్నం 12:15  దాదాపు 5 వేల మంది వివాదాస్పద కట్టడంపైకి ఎక్కి కొడవళ్లు, సుత్తులు, రాడ్లతో కూల్చివేతకు దిగారు. అద్వానీ, జోషి, అశోక్‌ సింఘాల్‌ వంటి నాయకులు బయటకు వచ్చేయమని చెబుతున్నా వినలేదు. 

మధ్యాహ్నం 12:45 మసీదు దగ్గరకి వెళ్లడంలో పారామిలటరీ విఫలమైంది. విధ్వంసం జరుగుతున్నా బలగాలు నియంత్రించలేకపోయాయి. రాష్ట్ర పోలీసులు, ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ బలగాలు ఏ చర్యలూ తీసుకోలేకపోయాయి.

మధ్యాహ్నం 1:55 కరసేవకులు మొదటి గుమ్మటాన్ని కూల్చేశారు.

మధ్యాహ్నం 3:30 అయోధ్యలో మత ఘర్షణలు చెలరేగాయి

సాయంత్రం 5:00 కట్టడం పూర్తిగా కుప్పకూలిపోయింది.

సాయంత్రం 6:30 7:00 కేంద్ర కేబినెట్‌ సమావేశమై యూపీలో రాష్ట్రపతి పాలన విధించింది. సీఎం కల్యాణ్‌సింగ్‌ రాజీనామా చేశారు.

రాత్రి 7:30 విగ్రహాలను యథాతథంగా వాటి స్థానంలో ఉంచారు. తాత్కాలిక రామాలయ నిర్మాణం ప్రారంభించారు. 

సుప్రీం అధికారాన్ని ఉపయోగించిన కోర్టు
అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పునిస్తూ.. ఆర్టికల్‌ 142 ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకుంది. ఆలయ నిర్మాణానికి కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్టులో నిర్మోహి అఖాడకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని ఈ అధికరణం ద్వారా సూచించింది. ఈ కేసులో కొన్ని పరిధుల నేపథ్యంలో నిర్మోహి అఖాడా పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చినా.. ఆర్టికల్‌ 142ను ఉపయోగించి అఖాడాకు ట్రస్ట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలంది. ఈ ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టుకు విశేష అధికారం ఉంటుంది. ఈ ఆర్టికల్‌ ప్రయోగం ద్వారా ఒక్కోసారి పార్లమెంట్‌ చట్టాల్ని కూడా పక్కనపెట్టే అధికారం కోర్టుకు ఉంది. తన ముందు పెండింగ్‌లో ఉన్న ఏదైనా కేసులో పూర్తి న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసే అధికారం ఆర్టికల్‌ 142 కల్పిస్తుంది.  

గతంలోనూ పలు కేసుల్లో.. 
1989 భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన బాధితులకు ఉపశమనం కోసం ఈ ఆర్టికల్‌ను ఉపయోగించారు. బాధితులకు రూ.3,337 కోట్ల పరిహారం చెల్లించాలని యూనియన్‌ కార్బైడ్‌ను అప్పట్లో కోర్టు ఆదేశించింది. ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి.. 1993 నుంచి కేంద్రం చేసిన బొగ్గు గనుల కేటాయింపును 2014లో సుప్రీం రద్దు చేసింది. ఈ అధికరణం మేరకు డిసెంబర్‌ 2016లో తీర్పునిస్తూ.. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండకూడదని ఆదేశించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top