వివాద పరిష్కారానికి జైట్లీ మధ్యవర్తిత్వం!  

 Arun Jaitley mediates to resolve supreme dispute - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇప్పటికే సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతోపాటుగా.. నలుగురు న్యాయమూర్తులతో మాట్లాడినట్లు సమాచారం. శనివారం ఈ చర్చలు మరో అడుగు ముందుకు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వివాదం మరింత పెద్దదైతే న్యాయవ్యవస్థ స్వతంత్రతపై లేనిపోని దురభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉందని భావించిన కేంద్రం మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తోందని సమాచారం.

అయితే ఇదంతా తెరవెనకే జరుగుతోంది. బహిరంగంగా మాత్రం ఈ వివాదంలో జోక్యం చేసుకోవటం లేదని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని న్యాయవ్యవస్థ అంతర్గత వివాదంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. న్యాయమూర్తుల మీడియా సమావేశం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుటిన న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో  సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయంలో విపక్షాల ప్రతిస్పందననూ కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోంది. కాగా, నలుగురు న్యాయమూర్తుల లేఖకు సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఇప్పటికీ స్పందించలేదు. 

వివాదాన్ని ముందే ఊహించిన కేంద్రం 
రెండు నెలల క్రితం.. రోస్టర్‌ విధానంలో సీజేఐ సీనియర్లను విస్మరిస్తున్నారనే విషయాన్ని జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ లేవనెత్తారు. దీన్ని గమనించిన కేంద్రం అప్పుడే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. మరోవైపు, నలుగురు న్యాయమూర్తులు సీజేఐ దీపక్‌ మిశ్రాకు సంబంధించి సీరియస్‌ అంశాలను లేవనెత్తిన నేపథ్యంలో సీజేఐ రాజీనామా చేసే అవకాశాలూ ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది. ఒకవేళ మిశ్రా రాజీనామా చేయని పక్షంలో ఆయన్ను అభిశంసించేందుకు ఇతర న్యాయమూర్తులు ముందడుగేస్తారనే అంశమూ తెరపైకి వచ్చింది. అయితే, ఈ వివాదం రెండ్రోజుల్లో సద్దుమణుగుతుందని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ విమర్శించి ఉండాల్సింది కాదన్నారు. ఆ నలుగురు హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top