అయ్యప్పపై మరో తీవ్ర వివాదం

Another Controversy On Sabarimala Ayyappa Temple - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ పక్క రాదాంతం జరుగుతుండగా మరో వివాదం రాజుకుంది. ఈ ఆలయం తరతరాలుగా తమదని, తమ ఆలయాన్ని తమకు అప్పగించాలని, అలా జరగక పోయినట్లయితే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి సాధించి తీరుతామని కేరళకు చెందిన మాల ఆర్యులు డిమాండ్‌ చేస్తున్నారు. 

‘12 శతాబ్దానికి చెందిన శబరిమలలోని అయ్యప్ప ఆలయం మాల ఆర్యులది. పండలం రాజ కుటుంబం 1800లో దీన్ని ఆక్రమించుకున్నారు. ఆలయంలోని పలు దేవతా విగ్రహాలను తొలగించి వాటిని అడవుల్లో విసిరేశారు. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు. చరిత్రగతిలో అడవుల్లో పడేసిన విగ్రహాలు కరిమల, పొన్నంబాల్మేడు, కొత్తకుతితార, నీలక్కల్, తలపరమల అడవుల్లో దొరికాయి. 1904లో పండలం రాజు ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాహ్మణ వర్గానికి చెందిన తాజమన్‌ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రధాన పూజారి బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకు ద్రావిడ పద్ధతిలో జరిగిన పూజాది కార్యక్రమాలను మార్చివేసి బ్రాహ్మణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. గతంలో అయ్యప్పకు పూజారులుగా వ్యవహరించిన మాల ఆర్యులు తేనతోనే అభిషేకం చేసేవారు. ఆ స్థానంలో బ్రాహ్మణ పూజారులు పాలతోని అభిషేకం చేయడం ప్రారంభించారు. 1950లో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ఆలయ పాలనా బాధ్యతలను స్వీకరించింది. 

‘మాకు ఈ ఆలయాన్ని తిరిగి అప్పగించాల్సిందిగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఆ తర్వాత అవసరమైతే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి న్యాయం సాధిస్తాం. అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం మా మంచికే జరిగిందేమో! మా గొంతును కూడా ఈ ప్రపంచానికి వినిపించేందుకు అవకాశం దొరికింది. మాకు ఆలయాన్ని అప్పగించినట్లయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తాం. మా గుండెల నిండా ఎప్పుడూ గూడుకట్టుకొనే ఉండే మా అయ్యప్ప మహిళల పట్ల ఎప్పుడూ వివక్షత లేదు’ అని ఐక్య మాల ఆర్య మహా సభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీకే సజీవ్‌ చెప్పారు. ఆయన అయ్యప్ప ఆలయంపై విస్తృత పరిశోధనలు జరిపారు. 

అయ్యప్ప ఎవరి పుత్రుడు ?
శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నంబాలమేడు గుహలో కందన్, కారతమ్మ దంపతులకు అయ్యప్ప జన్మించారన్నది మాల ఆర్యులు నమ్మకం. అయ్యప్ప ఆలయం మొట్టమొదటి పూజారి కరిమల ఆర్యన్‌ అని, ఆయన్నే ఆలయానికి శంకుస్థాపన చేశారని, ఆఖరి పూజారి కోచుకుట్టి కోచురామన్‌ అని, వారి బంధువులు ఇప్పటికీ కొట్టాయం జిల్లా ముండక్కయమ్‌లో నివసిస్తున్నారని సజీవ్‌ తెలిపారు. 

దక్షిణ కేరళలోని పట్టణంతిట్ట, కొట్టాయం, ఇదుక్కి ప్రాంతాల్లోని ఎత్తైన పర్వతాల వాలున దాదాపు 30 వేల మంది మాల ఆర్యులు నివసిస్తున్నారు. వారి రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలుగా పరిగణిస్తోంది. వారి ఇళ్లన్నీ విసిరేసినట్లుగా దూర, దూరంగా కొండ చెరియ వాలుకు ఆనుకొని ఉన్నాయి. అలా వాళ్ల ఊళ్లన్ని ఎత్తైన కొండ శిఖరాల వాలునే ఉండేవని, అందుకే వారికి మాల ఆర్య (కింగ్‌ ఆఫ్‌ ది మౌంటేన్‌) అని పేరు వచ్చిందని 1883లోనే ప్రచురించిన ‘నేచర్‌ లైవ్‌ ఇన్‌ ట్రావెంకోర్‌’ పుస్తకంలో శామ్యూల్‌ మతీర్‌ రాశారు. 

ఇప్పటికే కరిమల, పొన్నంబాలమేడు, నీలక్కల్‌ మహదేవ్‌ ఆలయాలపై హక్కుల కోసం పోరాడుతున్న ఐక్య మాల ఆర్య మహా సభ ఇప్పుడు అయ్యప్ప ఆలయాన్ని తమ పోరాటంలో భాగం చేసింది. కేరళలో దాదాపు వంద ఆలయాలపై ఆదివాసీ, దళిత సంఘాలు తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. బ్రాహ్మణ పూజారులకు ముందు మాల ఆర్య పూజారులు ఉండేవారని, వారు అయ్యప్పకు తేనాభిషేకం చేసేవారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అక్టోబర్‌ 23వ తేదీన పట్టణంతిట్టలో జరిగి బహిరంగ సభలో వ్యాఖ్యానించడం గమనార్హం.


 
చరిత్రగతిలో ఆదివాసీల ఆలయాలు అన్యాక్రాంతం అవడం, ధ్వంసమవడం తెల్సిందే. తూర్పు గోదావరి జిల్లా తలుపులమ్మా, కొడగులోని తాళకావేరి, చిక్‌మగలూరులోని బాబా బుడాన్‌ గిరి టెంపల్, తిరుపతిలో వేంకటేశ్వర స్వామి ఒకప్పడు గిరిజన దేవాలయాలన్న వివాదం ఉంది. తమ దేవుళ్ల పక్కన అన్య మతస్థులను పేర్కొనే సంస్కృతి ద్రవిడులదని, గిరిజనులు లేదా ఆదివాసీల సంప్రదాయం కూడా ద్రవిడ సంస్కృతికి దగ్గరగా ఉంటుందని చరిత్రకారులు చెబుతారు. అందుకేనేమో అయ్యప్ప ముస్లిం మిత్రుడు వావర్‌ మసీదు అయ్యప్పకు దగ్గరలోనే ఉంది. అయ్యప్పను సందర్శించే భక్తుల్లో 80 శాతం మంది 40 కిలోమీటర్ల దిగువనున్న వావర్‌ మసీదు సందర్శించాకే అయ్యప్ప వద్దకు వెళతారు. వేంకటేశ్వరుడి భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ అన్న విషయం తెల్సిందే. వేంకటేశ్వరుడు ఒకప్పటి చెంచుల ఆరాధ్య దైవంగా చరిత్రకారులు చెబుతారు. 

శబరిమల; కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top