పేదోడి పొట్టగొట్టిన ‘ఆధార్‌ తీర్పు’ | Aadhar Judgement Impact On Poor People | Sakshi
Sakshi News home page

పేదోడి పొట్టగొట్టిన ‘ఆధార్‌ తీర్పు’

Sep 27 2018 2:52 PM | Updated on Sep 27 2018 4:54 PM

Aadhar Judgement Impact On Poor People - Sakshi

‘మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ కింద జాబ్‌ కార్డులు కలిగిన వారిలో 90 లక్షల మంది నకిలీ కార్డుదారులని 2017, ఏప్రిల్‌లో ప్రభుత్వం తొలగించింది.

సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ కార్డుల న్యాయబద్ధతపై బుధవారం వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు ఓ కీలకమైన అంశాన్ని అంతగా పట్టించుకోలేదు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్‌కు లింకు పెట్టడం ఎంత మేరకు సమంజసమనే అంశాన్ని లోతుగా పరిశీలించినట్లు లేదు. ఏదో ఒక ధ్రువపత్రం కూడా లేనందున 0.232 శాతం మందికి మాత్రమే ఆధార్‌ కార్డులు దక్కలేదని, వీరికి కార్డులు లేవన్న కారణంగా కార్డులున్న 99.76 శాతం లబ్ధిదారుల ప్రయోజనాలను విస్మరించలేమంటూ ప్రభుత్వం చేసిన వాదనకు సుప్రీంకోర్టు బెంచీ బోల్తా పడింది. కేవలం 0.232 శాతం మందికే ఆధార్‌ కార్డులు లేవన్న ధ్రువీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎలా వచ్చింది? మొత్తం దేశ జనాభా ఎంత? మొత్తం జారీ చేసిన ఆధార్‌ కార్డుల సంఖ్య ఎంత? అని సుప్రీం కోర్టు నిలదీసి ఉంటే అసలు లెక్కలు బయటకు వచ్చేవేమో!

ఆధార్‌ కార్డుల గురించి ఎంత మందికి తెలుసు?
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో 85 శాతం మందికే ఆధార్‌ కార్డుల గురించి తెలుసని, వారిలో 41 శాతం మందికి వాటిని ఉచితంగానే ఇస్తారన్న విషయం తెలియదని ఓ స్వతంత్ర అధ్యయనంలో ఇటీవలే తేలింది. అంటే, 15 శాతం మందికి ఆధార్‌ కార్డుల గురించే తెలియదంటే వారి వద్ద అవి లేవన్న మాటే. ఇక 41 శాతం మందికి అవి ఉచితంగా ఇస్తారన్న విషయం తెలియదంటే వారిని ఇంటి వారో, బయటివారో మోసం చేసి ఆధార్‌ కార్డులకు డబ్బులు తీసుకొని ఉంటారు. ఆ మధ్య జార్ఖండ్‌లో వారం రోజులకుపైగా ఆహారం తీసుకోక పోవడం వల్ల సంతోషి కుమారి అనే 11 ఏళ్ల బాలిక మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన విషయం తెలిసిందే. ఆ బాలిక తల్లికి ఆధార్‌ కార్డు లేదన్న కారణంగా అంతకుముందు రెండు నెలల నుంచి డీలర్‌ రేషన్‌ బియ్యం నిరాకరించడమే బాలిక మరణానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లో 20 శాతం మందికి ఆధార్‌ కార్డులు లేవని ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

ప్రభుత్వం మాటలకు, లెక్కలకు పొంతన ఉందా?
క్షేత్రస్థాయి లెక్కలను పట్టించుకోకుండా ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీం కోర్టు నమ్మింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్‌ను లింక్‌ చేయడం వల్ల ఏటా 90 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని, నకిలీ రేషన్‌ కార్డులను, నకిలీ లబ్ధిదారులను అరికట్టడం వల్లనే ఇది సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ‘మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ కింద జాబ్‌ కార్డులు కలిగిన వారిలో 90 లక్షల మంది నకిలీ కార్డుదారులని 2017, ఏప్రిల్‌లో ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత ఇదే విషయమై సంబంధిత శాఖను సమాచార హక్కు కింద వివరాలు కోరగా, రద్దయిన వాటిలో కేవలం 4 శాతం కార్డులే నకిలీవని తేలినట్లు చెప్పారు. ప్రభుత్వం లెక్కలకు, మాటలకు ఎంత తేడా ఉంటుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ సహజ న్యాయసూత్రం వర్తించదా!?
ఏదో ఒక ధ్రువపత్రం లేనికారణంగా ఆధార్‌ కార్డులు దక్కని వారి సంఖ్య కేవలం 0.232 శాతం మాత్రమేనని ప్రభుత్వం కోర్టులో వాదించింది. ఆ అంకే నిజమనుకున్నా 27.60 లక్షల మందికి ఆధార్‌ కార్డులు అందలేదు. వారంతా కచ్చితంగా పేదవాళ్లు, అట్టడుగు వర్గాల వారే అయ్యుంటారు. ఎందుకంటే ఎలాంటి గుర్తింపు కార్డులు వారికే ఉండవు కనుక. వెయ్యి మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదుగానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనే న్యాయ సూత్రాన్ని సెలవిచ్చిన సుప్రీం కోర్టు, వెయ్యి మంది నకిలీ వ్యక్తులు లబ్ధి పొందినా పర్వాలేదుగానీ ఒక్క నిజమైన పేదవాడికి అన్యాయం జరగకూడదంటూ ఎందుకు తీర్పివ్వదో మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement