రజనీతో సోనాక్షి?
బాలీవుడ్ భామ సోనాక్షీసిన్హాకు ‘సూపర్‌స్టార్’ రజనీకాంత్‌తో జతకట్టే అవకాశం లభించింది. అయితే... చేతిలో మూడు హిందీ సినిమాలు ఉండటంతో,
బాలీవుడ్ భామ సోనాక్షీసిన్హాకు ‘సూపర్‌స్టార్’ రజనీకాంత్‌తో జతకట్టే అవకాశం లభించింది. అయితే... చేతిలో మూడు హిందీ సినిమాలు ఉండటంతో, ఈ సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారామె. ‘కొచ్చడయాన్’ తర్వాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా చేయనున్నారు. అందులో అనుష్క కథానాయిక. మరొక కీలక పాత్ర కోసం చాలామంది కథానాయికల్ని పరిశీలించారు రవికుమార్. కాగా, ఆ పాత్రకు సోనాక్షీ సిన్హా బావుంటుందని సాక్షాత్ రజనీకాంతే చెప్పారట. దాంతో బంతి ఈ ముద్దుగుమ్మ గోల్‌లోకి వచ్చింది. డేట్స్ సర్దుబాటు చేసుకోనైనా సరే... ‘సూపర్‌స్టార్’ సినిమాకు ‘ఓకే’ చెప్పాలని సోనాక్షి భావిస్తున్నట్లు సహచరుల సమాచారం.
‘నరసింహా’ చిత్రంలో నీలాంబరి పాత్రలా... ఈ పాత్ర కూడా శక్తిమంతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే... సోనాక్షి దక్షిణాదిన నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. గతంలో దక్షిణాది సినిమాల్లో సోనాక్షిని నటింపజేయాలని చాలామంది దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు. మహేశ్, క్రిష్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘శివం’ చిత్రంలో సోనాక్షిని కథానాయికగా ఎంపిక చేసినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే... అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఏకంగా సూపర్‌స్టార్ సినిమాలోనే చాన్స్ కొట్టేశారీ ‘దబాంగ్’ భామ. సోనాక్షి లక్కీగాళ్ అనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి!