
ఘట్టమనేని శ్రీనివాస్
నాన్నలాగే నేనూ ఓ ఉన్నతాధికారి కావాలన్న కోరిక నాన్నలో ఉందేమో కానీ..
బి.కొత్తకోట: నాన్న లాగే నేనూ ఓ ఉన్నతాధికారి కావాలన్న కోరిక నాన్నలో ఉందేమో కానీ.. నేను సినిమాల్లోకి వెళ్తానంటే మాత్రం అడ్డు చెప్పలేదని చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ కుమారుడు, సూర్య వర్సెస్ సూర్య చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అన్నారు. ఆయన బి.కొత్తకోట మండలంలోని హర్సిలీహిల్స్‌కు వచ్చిన సందర్భంగా బుధవారం విలేకరులతో మాట్లాడారు. చిన్న వయసులోనే దర్శకునిగా, ఛాయాగ్రాహకునిగా ప్రతిభను నిరూపించుకున్న కార్తీక్ మాటల్లోనే...
హైదరాబాద్‌లో బీటెక్ అయ్యాక ఛాయాగ్రహణం విభాగంలో శిక్షణ పొందేందుకు నిర్ణయం తీసుకున్నా. ఈ విషయం నాన్నకు చెప్పాను. ఆయన కాదనలేదు. ప్రోత్సహించారు. వెం టనే చెన్నైలోని మైండ్ స్క్రీన్ ఫిల్మ్ స్కూలులో ఏడాదికాలం శిక్షణ తీసుకున్నా. ఇది పూర్తయ్యాక కార్తికేయ చిత్రానికి తొలిసారిగా ఛాయాగ్రహకునిగా పనిచేసే అవకాశం దక్కింది. చందు ముందేటీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవలంలో45 రోజుల్లో పూర్తి చేశాం. ఈ చిత్రానికి నిఖిల్ హీరో.
దర్శకునిగా సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నాక సూర్య వర్సెస్ సూర్య చిత్రానికి కథ, దర్శకత్వం, ఛాయాగ్రహణం నేనే అందించే అవకాశం కల్పించారు నిర్మాత శివకుమార్. ఈ చిత్రానికీ హీరో నిఖీలే. త్వరలో చందు దర్శకత్వంలో కొత్త చిత్రానికి ఛాయగ్రాహకునిగా పనిచేయనున్నాను. సూర్య వర్సెస్ సూర్య చిత్రం విజయవంతం కావడం ఆనందంగా ఉంది.
బాగాలేదని చెప్పలేరుగా..
నేను దర్శకత్వం వహించిన సూర్య వర్సెస్ సూర్య చిత్రాన్ని నాన్న హైదరాబాద్‌లో చూశారు. నాన్నకు ఈ సినిమా నచ్చిందో నచ్చలేదో తెలియదు కానీ.. బాగలేదని నాతో చెప్పలేరు. బాగుందనే అంటారు. ఎందుకంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహం కదా.
భవిష్యత్తులో వినోదమే..
ఐపీఎస్ అధికారిగా నాన్న ప్రజలకు సేవచేస్తున్నారు. నేనూ అలాగే ఉండాలనీ నాన్న కోరుకున్నారేమో తెలియదు. నాన్న సేవచేస్తుంటే.. నేను ప్రజలకు వినోదం పంచాలనుకుంటున్నాను. ఆ దిశగానే నా ప్రయత్నాలు చేస్తాను.