దక్షిణాసియాలో కరోనా కేసులు తక్కువెందుకు?

Why Coronavirus Cases Low In South Asia - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన ప్రాంతం దక్షిణాసియా. దాదాపు రెండు వందల కోట్ల మంది నివసించే ఈ ప్రాంతం ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యరంగంలోనూ వెనకబడింది. అయినా ఆరోగ్యరంగంతోపాటు ఆర్థికంగా బాగున్న చైనా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలకన్నా కరోనా వైరస్‌ బాధితులు తక్కువగా ఉండడం ఎంతో విశేషం. 

ఏప్రిల్‌ 20వ తేదీ నాటికి భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌ దేశాల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,446 కాగా, మృతుల సంఖ్య 817. అమెరికాలోని ఒక్క న్యూయార్క్‌ సిటీలోనే 1,34,436 మంది కరోనా బాధితులుకాగా, 10,022 మంది మరణించారు. ప్రపంచ జనాభాలో 20 శాతానికి పైగా జనాభా కలిగిన దక్షిణాసియాలో కరోనా కేసుల శాతం 1.2 శాతం మాత్రమే. ఇక మృతుల సంఖ్య 0.5 శాతానికన్నా తక్కువ. దక్షిణాసియాలోని మొత్తం 28,446 కేసుల్లో భారత్‌లో 17,265, పాకిస్థాన్‌లో 8,418, బంగ్లాదేశ్‌లో 2,456, శ్రీలంకలో 271, నేపాల్‌లో 31, భూటాన్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. 
(చదవండి: 80 శాతం రోగుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు)

అలాగే మృతుల సంఖ్యలో భారత్‌లో 543 మంది, పాకిస్థాన్‌లో 176, బంగ్లాదేశ్‌లో 91, శ్రీలంకలో ఏడుగురు మరణించగా, నేపాల్, భూటాన్‌లో ఒక్కరు కూడా మరణించలేదు. నిర్ధారిత కరోనా కేసుల్లో మృతుల సంఖ్య దక్షిణాసియాలో సరాసరి 2.87 శాతంకాగా, అమెరికాలో 5,34 శాతం, బ్రిటన్‌లో 13,38 శాతం. ప్రపంచ సరాసరి శాతం 6.87 శాతం. ఈ విషయంలో బంగ్లాదేశ్‌ 3.71 శాతంతో ముందుండగా, 3.15 శాతంతో భారత్‌ స్థానంలో ఉంది. 2.09 శాతంతో పాకిస్థాన్‌ చివరి స్థానంలో ఉంది. 

దక్షిణాసియాలో ఎంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఎంత మందికి కరోనా వైరస్‌ ఉన్నట్లు తేలిందనే విషయంలోనూ దక్షిణాసియా రికార్డు బాగానే ఉంది. అందుకనే తాము నిర్వహిస్తున్న కరోనా పరీక్షల సంఖ్య సముచితంగా ఉందంటూ భారత్‌ వాదిస్తోంది. భారత్‌లో పరీక్షలు జరిపిన వారిలో నిర్ధారిత కేసులు 25.9 శాతం కాగా, పాకిస్థాన్‌లో 13.2 శాతం, బంగ్లాదేశ్‌లో 11.6 శాతం ఉంది. ఈ విషయంలో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ దక్షిణ కొరియాలో 52.4 శాతం కాగా, అమెరికాలో 5,3, బ్రిటన్‌లో 3.3 శాతం ఉంది. 

తక్కువగా ఉండడానికి కారణాలేమిటీ?
దక్షిణాసియాలో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉండడానికి పలు సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. టీబీ కోసం బెసిల్లస్‌ కాల్మెట్టీ గెరిన్‌ వ్యాక్సిన్‌ (బీసీజీ) కారణమని చెబుతున్నారు. దక్షిణాసియాలోని అన్ని దేశాలు వ్యాక్సిన్‌ను వాడుతున్నాయి. ఉష్టమండల ప్రాంతమవడంతో వేడి ఎక్కువగా ఉండడం వల్ల కరోనా మనుగడ సాగించలేక పోతోందన్నది మరో సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలను నమ్మడానికి సరైన కారణాలు కనిపించడం లేదని వెల్లూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ మాజీ ప్రిన్సిపాల్, ఎపిడిమిమాలజిస్ట్‌ జయప్రకాష్‌ ములియిల్‌ అన్నారు. ఓ ఆశను పట్టుకొని చర్యలు తీసుకోలేమని చెప్పారు. 

‘ఆ సిద్ధాంతాలు నిజమైనా వాటిని పరిగణలోకి తీసుకోలేం. మనం లాటరీ గెలిస్తే మంచిదే. అలా అని లాటరీ టిక్కెట్లను కొనేందుకు సగం జీతం ఖర్చు పెట్టడం వధా అవుతుంది’ అని ప్రముఖ వైరాలజిస్ట్‌ జాకబ్‌ జాన్‌ తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి భారత ప్రభుత్వం వద్ద సరైన డేటా లేదని, దేశంలో ఎంత మంది చనిపోయారో, వారు ఏ కారణంతో చనిపోయారో స్పష్టంగా తెలియజేసే గణాంకాలు లేవని జయప్రకాష్‌ తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంఖ్య కూడా తక్కువగా ఉందని అన్నారు. 
(చదవండి: కోవిడ్‌-19 : ఆ మందు ప్రభావంపై షాకింగ్‌ సర్వే..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top