బ్రెగ్జిట్‌ సుడిగుండంలో థెరిసా మే

Theresa May to visit Brussels this week as she defends Brexit deal - Sakshi

ఒప్పంద ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బ్రిటన్‌ పార్టీలు

మంత్రుల రాజీనామాలు.. 21 మంది ఎంపీల ‘అవిశ్వాసం’

బ్రెగ్జిట్‌ పరిణామాలతో బ్రిటిష్‌ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడానికి (బ్రెగ్జిట్‌) సంబంధించిన విధివిధానాలపై  ప్రధానమంత్రి థెరిసా మే ప్రవేశపెట్టిన ఒప్పంద ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదం లభించినప్పటికీ, సొంత పార్టీలో (కన్సర్వేటివ్‌) తిరుగుబాటు తలెత్తింది. పలువురు కేబినెట్‌ సహచరులు ఇప్పటికే రాజీనామా చేశా రు. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ, మిత్రపక్షమైన డెమోక్రటిక్‌ యూనియనిస్ట్‌ పార్టీ దీన్ని తీవ్రంగా విభేదిస్తున్నాయి. చీలిపోయిన పార్టీ దేశానికి దిశానిర్దేశకత్వం చేయలేదని బ్రిటిష్‌ మీడియా విశ్లేషిస్తోంది. క్రిస్మస్‌లోగా థెరిసా పదవి నుంచి తప్పుకోవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి.  

బ్రెగ్జిట్‌ సాధ్యమా?  
నవంబరు 25న జరిగే ఈయూ ప్రత్యేక సమావేశంలో ఈ ఒప్పందంపై యూనియన్‌ నాయకులు సంతకాలు చేసే అవకాశముంది. దాని కంటే ముందు, ఈయూలోని 27 దేశాల్లో 65 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే 20 దేశాలు దీనిపై ఆమోదముద్ర వేయాలి. యూరోపియన్‌ పార్లమెంట్‌ ఆమోదం పొందాలి. ఇవన్నీ డిసెంబరులోగా పూర్తి కావాల్సి వుంది. డిసెంబరులో బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సివుంది.  

నేడు అవిశ్వాసం..?
నిబంధనల ప్రకారం – పార్లమెంట్‌లో 15శాతం మంది (48మంది ఎంపీలు) అవిశ్వాస లేఖలు సమర్పిస్తే ప్రధాని సాధ్యమైనంత త్వరగా సభ విశ్వాసం పొంది తీరాలి. ఇప్పటికి 21 మంది ఎంపీలు అవిశ్వాస లేఖలు సమర్పించినట్టు ప్రకటించారు. అయితే, ఈ సంఖ్య 48కి చేరిందని కొందరు కన్జర్వేటివ్‌ బ్రెగ్జిటీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం థెరిసా విశ్వాస పరీక్ష ముప్పును ఎదుర్కొంటున్నారు.

► నెట్‌సెన్‌ ఇటీవల జరిపిన సర్వే ప్రకారం – తాజాగా 59 శాతం మంది బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్నారు. (2016 జూన్‌ 23న జరిగిన రెఫరెండంలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం, వ్యతిరేకంగా 48.1 శాతం ఓట్లు వచ్చాయి).

► ఈయూలో ఉండటం వల్ల బ్రిటన్‌ నష్టపోతున్నదంటున్నారు బ్రెగ్జిటీర్లు.. రాజకీయ సంకోభాన్ని నివారించాలంటే మరో రెఫరెండానికి వెళ్లాల్సిందేనని, పార్లమెంట్‌ రెఫరెండానికే ఓటు వేస్తుందని కన్సర్వేటివ్‌ పార్టీ ‘పీపుల్స్‌ ఓట్‌’ క్యాంపెయినర్లు భావిస్తున్నారు.    

► బ్రెగ్జిట్‌ ముసాయిదా ఉభయ పక్షాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉందంటున్నారు ఈయూ మధ్యవర్తి మైఖేల్‌ బెర్నర్‌. దీనిపై మరోసారి చర్చలు జరిపేది లేదని జర్మనీ చాన్సరల్‌ ఏంజెలా మెర్కెల్‌ తెలిపారు.

► ఈ ఒప్పందం బెస్ట్‌ డీల్‌.. ఒకవేళ బ్రెగ్జిట్‌ విషయంలో బ్రిటన్‌ వెనక్కి మళ్లినా అందుకు తాము సిద్ధమేనని అంటున్నారు ఈయూ అధ్యక్షుడు డొనాల్ట్‌ టస్క్‌.

బ్రెగ్జిట్‌ ఒప్పందంలోని ముఖ్యాంశాలు

► 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ అధికారికంగా నిష్క్రమిస్తుంది. తర్వాత మొదలయ్యే 21 మాసాల పరివర్తనా కాలంలో.. ఎటువంటి సుంకాలు లేకుండా ఈయూ–యూకే స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు. ఈయూ నిబంధనలను బ్రిటన్‌ అనుసరించాల్సివుంటుంది.   

► ఆర్థిక లావాదేవీల పరిష్కారంలో భాగంగా విడిపోయేటప్పుడు ఈయూకి బ్రిటన్‌ 39 బిలియన్‌ పౌండ్లు (5100 కోట్లు) చెల్లించాలి.

► పౌరుల నివాస హక్కులకు ఈ ఒప్పందం గ్యారెంటీ ఇస్తుంది. ఇప్పుడు వున్న చోటే చదువుకుని, ఉద్యోగాలు చేసే వీలుంటుంది.

► బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్‌ – ఈయూలో భాగంగా వున్న ఐర్లాండ్‌ మధ్య ప్రస్తుతానికి ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరు. రాకపోకలకు ఎలాంటి ఆంక్షలూ వుండవు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top