అంతరిక్షంలో ఖనిజాన్వేషణ

Search For Minerals In Universe - Sakshi

సరికొత్త అధ్యాయానికి నాసా శ్రీకారం

మిలియన్ల కిలోమీటర్ల దూరంలో బెన్నూ గ్రహశకలం  

దానిపై శాంపిల్స్‌ సేకరించనున్న ఒసిరిస్‌

‘అవతార్‌’ సినిమాను తలపిస్తోన్న ప్రయోగాలు

వాషింగ్టన్ ‌: మీరు అవతార్‌ సినిమా చూశారా? అందులో, మనుషులు ఖనిజాల కోసం పండోరా అనే గ్రహంపై మైనింగ్‌ చేస్తారు.. గుర్తుందా? వెండితెరపై ఈ సన్నివేశాలు కొత్త ఆలోచనలకు పునాదులు వేశాయి. భూమిపై ఉన్న ఖనిజాలు కొన్నేళ్లలో కనుమరుగవనున్న నేపథ్యంలో మనుషుల అవసరాలు తీర్చేందుకు మనిషి ఎప్పటినుంచో ఇతర గ్రహాల వైపు చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా ఈ ఆలోచనను నిజం చేయబోతోంది. అంతరిక్షంలో ఉన్న విలువైన ఖనిజాలను తవ్వుకుని భూమికి తీసుకురావాలన్న ఆలోచనను మెల్లిగా అమలులో పెడుతోంది. ఇందులో భాగంగా ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇప్పటికే ప్రయోగించింది. త్వరలోనే అది తన పనిని పూర్తి చేయనుంది.

ఏంటి ఈ మిషన్‌?
అంతరిక్ష ఖనిజాన్వేషణలో భాగంగా ‘101955 బెన్నూ’ అనే గ్రహశకలాన్ని అధ్యయనం చేయాలని నాసా భావించింది. ఇందుకోసం ఒసిరిస్‌– రెక్స్‌ OSIRIS& REx (Origins,  Spectral Interpretation,  Resource Identification,  Secu rity,  Regolith Explorer) అనే స్పేస్‌ క్రాఫ్ట్‌ను 2016, సెప్టెంబరు 9న ప్రయోగించింది. ఇది దాదాపు 20 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఈ డిసెంబరులో ఈ గ్రహశకలాన్ని చేరుతుంది. ఏడాదిపాటు దాని చుట్టూ పరిభ్రమిస్తూ దాని ఫొటోలను తీయడం, సర్వే చేయడం పూర్తి చేస్తుంది.

2020 నాటికి గ్రహశకలాన్ని చేరుకుని దాని ఉపరితలాన్ని కొద్దిగా తవ్వి ఆ శాంపిల్స్‌ను తీసుకుంటుంది. 2021 మార్చినాటికి తిరుగుయాత్ర మొదలు పెట్టి, 2023, సెప్టెంబరు 24న భూమిని చేరుతుంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోన్న బెన్నూ గ్రహశకలం ప్రతీ ఆరేళ్లకోసారి భూమికి సమీపంలోకి వస్తుంది. ఈ గ్రహశకలంపై 10 శాతం ఇనుము, నికెల్‌ నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాదాపు 800 మిలియన్‌డాలర్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నాసా చేపట్టింది.

బెన్నూ విశేషాలేంటి?
సౌర వ్యవస్థలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఒక గ్రహశకలం. ఇది ప్రతీ ఆరేళ్ల కోసారి భూమికి సమీపంగా వస్తుంది. దీని పూర్తిపేరు 101955 బెన్నూ’. తొలిసారిగా దీన్ని 1999లో గుర్తించారు. ఇది రాంబస్‌ ఆకారంలో ఉండే సీ–టైప్‌ ఆస్టరాయిడ్‌ లేదా కార్బనేíషియస్‌ ఆస్టరాయిడ్‌. దీని ఉపరితలం ఎక్కువగా కార్బన్‌ సమ్మేళనాలతో నిండి ఉంటుంది. మిగిలిన కొద్దిమొత్తంలో ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల కోసమే నాసా పరిశోధకులు ఇపుడు ఒసిరిస్‌ను ప్రయోగించారు. బెన్నూ ఎత్తు 510 మీటర్లు అంటే మన ఈఫిల్‌ టవర్‌ (324మీటర్లు) కన్నా అధికం.

మానవాళికి ఏం లాభం?
సైంటిస్టుల అంచనాలు నిజమై.. అనుకున్న ప్రకారం ఈ గ్రహశకలంపై ఖనిజాలు ఉన్నాయని తేలితే. అంతులేని ఖనిజ సంపద మానవుల సొంతమవుతుంది. మానవాళి భవిష్యత్తు అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గం దొరికినట్లవుతుంది. ఈ గ్రహశకలంపై ఉన్న ఖనిజాలను పూర్తిగా తవ్వి తేగలిగితే.. ఇపుడున్న మార్కెట్‌ విలువ ప్రకారం..15 క్వింటిలిన్‌ ( దాదాపు లక్షల కోట్ల డాలర్లు) ఉంటుందని అంచనా. భూమిపై ఖనిజాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ ఆస్టరాయిడ్‌ మైనింగ్‌ సాధ్యమైతే
భవిష్యత్తులో మానవాళి మనుగడకు ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఎలా తవ్వుతుంది?
ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కు ఒక రోబోచేయి ఉంటుంది. ఒసిరిస్‌ బెన్నూను చేరగానే ఈ రోబోచేయి టాగ్‌సామ్‌ మెకానిజం (టచ్‌ గో శాంపిల్‌ అక్వైజేషన్‌ మెకానిజం) ద్వారా పనిచేయడం మొదలుపెడుతుంది. తొలుత నైట్రోజన్‌ గ్యాస్‌ను విడుదల చేస్తుంది. రిగోలియత్‌గా పిలిచే దాని ఉపరితలాన్ని 60 – 2000 గ్రాముల వరకు మొత్తం మూడుశాంపిళ్లను సేకరిస్తుంది. అలా సేకరించిన ఆ శాంపిల్స్‌తో ఒసిరిస్‌ తిరిగి భూమికి బయల్దేరుతుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top