అరుదైన అద్భుతం ఆవిష‍్కృతం నేడే...

Rare Total Lunar Eclipse Appears On 27th July - Sakshi

శుక్రశనివారాల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అరుదైన ఖగోళ అద్భుతం ఆవిష‍్కృతం కానుంది. 21వ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం (వివిధ దశలు దాటే ప్రక్రియ మొత్తం ఆరుగంటలకు పైగానే) అందరికీ కనువిందు చేయనుంది. భారత కాలమానం ప్రకారం  ఈ సంపూర్ణ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి (27న) 10.44 నిముషాలకు మొదలై శనివారం (28న) తెల్లవారుజామున 4.58 నిముషాలకు ముగియనుంది. శనివారం తెల్లవారుజామున ఒంటిగంట 2 గంటల 43 నిముషాల  మధ్యలో  చంద్రగ్రహణం ఉచ్ఛదశకు చేరిన సందర్భంగా ముదురు ఎరుపులో కనిపిస్తుంది. దీనిని ‘బ్లడ్‌ మూన్‌’గా అభివర్ణిస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణంలో సూర్యుడి ప్రత్యక్ష కిరణాలు భూమి అంచుల నుండి చంద్రుడిపై పడతాయి. అప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ మొత్తం చంద్రగ్రహణ దశనే బ్లడ్‌మూన్‌గా పిలుస్తున్నారు.అయితే మళ్లీ ఇలాంటి సంపూర్ణ  చంద్రగ్రహణం చోటుచేసుకోవాలంటే మరో 105 ఏళ్లు అంటే 2123 జూన్‌ 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి... 

ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికాల్లోని ప్రజలకు ఇది కనువిందు చేయనుంది. ఉత్తర అమెరికా (యూఎస్‌ఏ)ప్రజలకు (వారికి శుక్రవారం పగలు అయినందున) ఇది కనిపించే అవకాశాలు లేవు. ఆయా దేశాల కాలమానాలను బట్టి చందమామ ఎంత స్పష్టంగా కనపడుతుందనేది ఆధారపడి ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియా దేశాల్లో కొంత ఆలస్యంగా శనివారం తెల్లవారుజామున,  మిగతా చోట్ల శుక్రవారం రాత్రి గ్రహణంలో జాబిల్లి  కనిపిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మిగతా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అంటార్కికా అంతటా అన్ని గ్రహణదశలు వీక్షించవచ్చు.

భారత్‌లో...
భారత్‌లో  చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి 10గంటల 44 నిముషాలకు మొదలై అర్థరాత్రి ఒంటిగంటకు సంపూర్ణ గ్రహణ దశ ప్రారంభమవుతుంది. గంటా 43 నిముషాల పాటు కనిపించే ఈ బ్లడ్‌మూన్‌ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వీక్షించవచ్చు. కాలుష‍్య ప్రభావం కారణంగా దేశంలోని కొన్ని మెట్రోనగరాల్లో ఈ గ్రహణం పూర్తిస్థాయిలో కనబడకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇది మరింత స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ గ్రహణం సందర్భంగా భూమి నుంచి కక్ష్యలో జాబిల్లి అత‍్యంత దూరంలో ఉండడం వల్ల మామూలుగా కంటే చిన్నగా కనిపిస్తుంది. సూపర్‌మూన్‌ (చంద్రుడు తన కక్ష్యలో భూమికి అతి సమీపంగా వచ్చినపుడు) సందర్భంగా కంటే కూడా ఇంకా చిన్నదిగా కనిపించడాన్నే ‘మైక్రో మూన్‌’గానూ పిలుస్తారు. భూమి నీడ మధ్యలోంచి చందమామ ఎక్కువ సమయం ప్రయాణిస్తున్న కారణంగానే అధికసమయం చీకటి ఏర్పడి సుదీర్ఘ  గ్రహణం ఏర్పడేందుకు కారణమవుతుంది. 

సంపూర్ణ సూర్యగ్రహణం సందర్బంగా తీసుకునే జాగ్రత్తలకు భిన్నంగా దీనిని వీక్షించేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు, అద్దాలు అవసరం లేదు. అయితే ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటేనే వీక్షికులకు ఈ గ్రహణం స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. అదేరోజు రాత్రి అంగారక గ్రహం (మార్స్‌) కూడా చందమామకు అత్యంత చేరువగా కనిపించడం ఈ సారి మరో ప్రత్యేకత. ఈ గ్రహాన్ని కూడా పరికరాల అవసరం లేకుండా నేరుగా కళ్లతో చూసే  అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.

సెల్ఫీలు దిగొచ్చు...
గ్రహణం చూస్తే ఇది జరుగుతుంది, అతి జరుగుతుందనే అపోహలు, మూఢనమ్మకాలు పక్కనపెట్టి ఈ అరుదైన సందర్భాన్ని పూర్తిస్థాయిలో భారతీయులు ఆనందించాలని ఖగోళ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. ఈ శతాబ్దంలోనే అతి సుదీర్ఘ గ్రహణం సందర్భంగా ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తూ ‘ఎకిలిప్స్‌ ఈటింగ్‌’ హాష్‌ట్యాగ్‌తో సెల్ఫీలు అప్‌లోడ్‌ చేయాలంటూ కోరారు. గ్రహణాలు వీక్షిస్తే ఆరోగ్యపరంగా, ఇతరత్రా నష్టాలు వాటిల్లుతాయనే కొన్ని అపోహలు భారతీయుల్లో ఉండడం దురదృష‍్టకరమని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్‌కు చెందిన నిరుజ్‌ మోహన్‌ రామానుజమ్‌ అన్నారు. గ్రహణమపుడు ఆకాశం అత్యంత సుందరంగా, మనోహరంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని, లేకపోతే ఇలాంటి అరుదైన ఘట్టాలను చూసే అవకాశాన్ని కోల్పోతామన్నారు. ఈ గ్రహణమపుడు కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఫోటోలు దిగి వాటిని పంపించాల్సిందిగా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. పర‍్వతాల వెనక్కు సూర్యుడు మాయమైనపుడు ఎలాంటి భయం లేనపుడు సూర్యుడిని చంద్రుడు దాచిపెడితే ఎందుకు భయపడాలంటూ ప్రశ్నించారు. 

చదవండి:
క్రవారం భూమి అంతం..!!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top