సాహసమే శ్వాసగా...

Omar Mohammad is an unknown adventurer. - Sakshi

ఐఎస్‌ పాశవికతను ప్రపంచానికి చూపిన ఒమర్‌ మొహమ్మద్‌

ఐఎస్‌ సామ్రాజ్యం మోసుల్‌లోనే ఉంటూ బ్లాగ్‌ నిర్వహించిన వైనం

మోసుల్‌(ఇరాక్‌): ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ దురాగతాలను, దారుణాలను ఇన్నాళ్లూ ప్రపంచానికి చూపిందెవరు? ఐఎస్‌ అధీనంలోని మోసుల్‌లోనే ఉంటూ.. ఉగ్ర రాక్షసులకు ఎలాంటి అనుమానం రాకుండా.. అక్కడే సంచరిస్తూ, వారి ఆహార్య, ఆచార, సాంప్రదాయాలనే పాటిస్తూ, వారి రాక్షస కృత్యాలను మానవాళికి వివరించిందెవరు? తలలు నరకిన, రాళ్లతో కొట్టి చంపిన ఐఎస్‌ భయానక పాశవికతను ‘మోసుల్‌ ఐ’ పేరుతో మన కళ్లకు కట్టిందెవరు?.. ప్రాణాలు పణంగా పెట్టి ఈ సాహసాలను చేసింది తానేనని ఓ అజ్ఞాత వీరుడు తాజాగా ప్రపంచం ముందుకు వచ్చాడు.

చరిత్రకారుడు, పరిశోధకుడు, బ్లాగర్‌ అయిన ఒమర్‌ మొహమ్మద్‌(31)నే ఆ అజ్ఞాత సాహసికుడు. గత మూడేళ్లుగా మోసుల్‌లో ఉంటూ, పగలంతా స్థానికుడిలా సంచరిస్తూ, ఐఎస్‌ దారుణాలను గమనిస్తూ.. రాత్రి అయ్యాక మోసుల్‌ ఐ పేరుతో వాటిని ప్రపంచానికి చూపేవాడు. ‘ఇకపై ఎంత మాత్రం అజ్ఞాతంగా, రహస్యంగా ఉండలేను. నేను ఐఎస్‌ను జయించాను. నన్ను ఇప్పుడు మీరు చూడొచ్చు. నా గురించి తెలుసు కోవచ్చు’ అని ఒమర్‌ ఓ వార్తాసంస్థతో వ్యాఖ్యానించారు.

‘ఐఎస్‌తో పోరులో చనిపోయిన నా సోదరుడి జ్ఞాపకార్థం, వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మ కోసం నేను బాహ్య ప్రపంచంలోకి రావాలనుకుంటున్నాను’ అని స్పష్టం చేశారు. ఇస్లామిక్‌ స్టేట్‌ మోసుల్‌ ఆక్రమించిన తొలి రోజల్లో.. మొదట ఐఎస్‌ గ్రూప్‌ గురించి తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే, అలా బహిరంగంగా పోస్ట్‌లు చేయడం ప్రాణాంతకమని అర్థమయ్యాక ‘మోసుల్‌ ఐ’ పేరుతో 2014 జూన్‌ 18 నుంచి ఒక బ్లాగ్‌ను రహస్యంగా నిర్వహించడం ప్రారంభించారు. ఆ తరువాత మోసుల్‌ ఐ నే ఐఎస్‌ దురాగతాలను ప్రపంచానికి వెల్లడించే వేదికగా మారింది. ఐఎస్‌ ఫైటర్లు, కమాండర్లు, వారి పూర్తి వివరాలను తన బ్లాగుల్లో తెలిపేవారు. ఒక డాక్టరు అలాగే, ఇస్లామిక్‌ స్టేట్‌ నిఘా విభాగంలో విధుల్లో ఉన్న ఒక బాల్య మిత్రుడి ద్వారా ఐఎస్‌ సమాచారాన్ని సేకరించేవాడినని ఒమర్‌ వెల్లడించారు.

Back to Top