పత్రికల్లో ఫేస్‌బుక్‌ క్షమాపణ ప్రకటనలు

Mark Zuckerberg apologizes for Cambridge Analytica incident - Sakshi

సమాచార భద్రత మా బాధ్యత

దాన్ని నెరవేర్చకపోతే ఈ స్థానానికి అనర్హులం: జుకర్‌బర్గ్‌

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లూ.. యాప్‌లకు పర్మిషన్లతో జాగ్రత్త: నిపుణులు  

లండన్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవ్వడంపై ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు,  మార్క్‌ జుకర్‌బర్గ్‌ బ్రిటన్, అమెరికాలోని ప్రముఖ పత్రికల్లో ప్రకటనల రూపంలో క్షమాపణలు కోరారు. ‘మీ సమాచారాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది. అది చేయలేకపోతే ఈ స్థానానికి మేం అనర్హులం’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా పనిచేసే ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ కోసం రూపొందించిన క్విజ్‌ యాప్‌తో డాటా దుర్వినియోగం అయ్యిందన్నారు. ‘ఇది నమ్మక ద్రోహమే. కానీ మేం ఇప్పుడు ఇంతకుమించి ఏం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం’ అని అన్నారు. భారత్, అమెరికా సహా అనేక దేశాల్లో ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేసేందుకు 5 కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల డాటాను కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేయడం తెలిసిందే.

యాప్‌లతో జాగ్రత్త
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలకు అనవసరంగా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకునే యాప్‌లతోనూ సమాచారం దుర్వినియోగం అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్లలోని థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌లు వాటికి అవసరం లేని సమాచారానికి యాక్సెస్‌ కోరుతున్నాయనీ, యాప్‌లకు పర్మిషన్లు ఇచ్చే ముందు వినియోగదారులు ఆలోచించుకోవాలన్నారు. ‘ఉదాహరణకు ఓ గేమింగ్‌ యాప్‌కు ఫోన్‌లోని కాంటాక్టులు, మెసేజ్‌లతో పనుండదు.

కానీ ఆ యాప్‌ వినియోగదారుల ఫోన్‌లో పనిచేయాలంటే మెసేజ్‌లు, కాంటాక్ట్‌లకూ యాక్సెస్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యాప్‌ సైబర్‌ నేరగాళ్లు అభివృద్ధి చేసిందయితే, లేదా ఆ యాప్‌ సర్వర్లను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవ్వొచ్చు’ అని నెట్‌వర్క్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలో ఉన్నతాధికారి అల్తాఫ్‌ చెప్పారు. ఈ పర్మిషన్లు ఇస్తే బ్యాంకింగ్‌ లావాదేవీల సమయంలో ఫోన్‌లకు వచ్చే ఓటీపీలు వారికి తెలుస్తాయి.

ఫోన్‌లోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఫైళ్లు, ఇతర సమస్త సమాచారానికి అనేక యాప్‌లు పర్మిషన్లు కోరుతుంటాయి. ఈ సమాచారం అంతా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయని ప్రముఖ యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ కాస్పర్‌స్కీ ల్యాబ్‌ దక్షిణాసియా జీఎం భయానీ చెప్పారు. ఇలాంటి వాటిని నిరోధించాలంటే ప్రభుత్వం సైబర్‌ చట్టాలను కఠినతరం చేయడంతోపాటు యాప్‌లలోని తప్పులను ఎత్తిచూపితే వినియోగదారులకు రివార్డులు ఇచ్చే పథకాలను తేవాలన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top