గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌

Heart Patch Aid for the Heart - Sakshi

మూల కణాలతో కూడిన హార్ట్‌ప్యాచ్‌ అభివృద్ధిపరిచిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

గుండెపోటుతో కండరాలకు జరిగిన నష్టాన్ని వేగంగా సరిచేసేందుకు బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. ఏదైనా గాయమైతే మనం వాడే బ్యాండ్‌ ఎయిడ్‌ మాదిరిగానే.. మూలకణాలతో నిండిన పట్టీలను గుండెకు అతికిస్తే.. గుండెపోటు వల్ల పాడైన గుండె కణజాలానికి వేగంగా మరమ్మతులు చేయొచ్చని చెబుతున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు గుండెకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవడం వల్ల అక్కడున్న కణజాలం నాశనమవుతుంది. ఫలితంగా గుండె సామర్థ్యం తగ్గుతుంది. తగు మోతాదులో రక్తాన్ని శుద్ధి చేయలేకపోతుంది. ఇది కాస్తా గుండె పనిచేయకుండా పోయేందుకు దారితీయొచ్చు. ఈ నేపథ్యంలో బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ శాస్త్రవేత్తలు ఈ వినూత్నమైన హార్ట్‌ప్యాచ్‌ను ఆవిష్కరించారు.

3 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు ఉండే ఈ హార్ట్‌ప్యాచ్‌లలో ఏకంగా 5 కోట్ల మూలకణాలు ఉంటాయి. ఒకసారి ఈ హార్ట్‌ప్యాచ్‌ను గుండెకు అతికిస్తే చాలు. కాలక్రమంలో ఈ మూలకణాలన్నీ గుండెకండరాలుగా మారిపో తాయి. సక్రమంగా కొట్టుకునేందుకు ఉపయోగపడతాయి. జరిగిన నష్టం ఆధారంగా ఒకటి కంటే ఎక్కువ హార్ట్‌ప్యాచ్‌లను వాడొచ్చని రిచర్డ్‌ జబౌర్‌ తెలిపారు. హార్ట్‌ప్యాచ్‌లో ఉండే రసాయనాలు గుండె కణాలు తమంతట తాము మరమ్మతు చేసుకునేందుకు, పెరిగేందుకు సాయపడతాయని చెప్పారు.

పరిశోధనశాలలో తాము ఈ హార్ట్‌ప్యాచ్‌లను ప్రయోగాత్మకంగా పరీక్షించామని.. మూడు రోజుల్లోనే ఇందులోని మూలకణాలు గుండెమాదిరిగానే కొట్టుకోవడం మొదలవుతుందని.. పూర్తిస్థాయిలో గుండె కణజాలంగా మారేందుకు నెల రోజుల సమయం పడుతుందని రిచర్డ్‌ వివరించారు. జంతువులపై తాము చేసిన ప్రయోగాల్లోనూ ఇవి సక్రమంగా పనిచేసినట్లు తెలిసిందన్నారు. ఇంకో రెండేళ్లలో మనుషులపై కూడా ఈ హార్ట్‌ప్యాచ్‌లను పరీక్షిస్తామని.. ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాత వీటిని విస్తృతంగా వాడుతారని చెబుతున్నారు. మాంచెస్టర్‌లో జరుగుతున్న బ్రిటిష్‌ కార్డియో వాస్కులర్‌ సొసైటీ సదస్సులో ఈ హార్ట్‌ప్యాచ్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top