
మోత మూడింతలు!
కొత్త పురపాలికలపై ఆస్తి పన్నుల పిడుగు పడింది. డిమాండ్ నోటీసులు దడపుట్టిస్తున్నాయి.
♦ కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నుకు రెక్కలు
♦ ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన సవరణ లెక్కలు
♦ గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు వార్షిక పన్నులు రూ.72.40 కోట్లు
♦ పురపాలికలుగా హోదా పెరిగిన తర్వాత రూ.201.33 కోట్లకు పెంపు
♦ 32 కొత్త పురపాలికలు, విలీన గ్రామాల ప్రజలపై రూ.129 కోట్ల భారం
♦ తలసరి ఆస్తి పన్ను సగటు రూ.858కు ఎగబాకిన వైనం
సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికలపై ఆస్తి పన్నుల పిడుగు పడింది. డిమాండ్ నోటీసులు దడపుట్టిస్తున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ/మున్సిపాలిటీగా హోదా పెరిగిన తర్వాత ఆస్తి పన్నులూ అమాంతంగా పెరిగి దాదాపు మూడింతలయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 23 నగర పంచాయతీలు, 3 మున్సిపాలిటీలతోపాటు మరో 6 మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఆస్తి పన్నుల సవరణ కొలిక్కి వచ్చింది. 2015 మార్చి 31 నాటికి ఈ మున్సిపాలిటీల్లో ప్రైవేటు ఆస్తులపై రూ.72.40 కోట్ల మేర ఉన్న వార్షిక ఆస్తి పన్నులు.. తాజా సవరణ తర్వాత 2015 నవంబర్ 31 నాటికి రూ.201.33 కోట్లకు ఎగబాకాయి.
ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రజలకు డిమాండ్ నోటీసులు జారీ చేయాల్సి ఉండగా.. సవరణ ప్రక్రియ వల్ల కొత్త పురపాలికల్లో ఈ నోటీసుల జారీ ఆలస్యమైంది. 2015-16 ఆర్థిక సంవత్సర రెండో అర్ధ భాగం ముగింపుకు చేరిపోవడంతో డిమాండ్ నోటీసుల జారీ ముమ్మరం చేశారు. ఒక్కసారిగా పన్నులు మూడు, నాలుగు రెట్లు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ కొత్త పురపాలికల తలసరి వార్షిక ఆస్తి పన్నుల సగటు రూ.858కు పెరిగిపోయింది. ప్రధానంగా నివాస భవనాలతోపాటు దుకాణాలు, ఆస్పత్రులు, పాఠశాలలు తదితర వాణిజ్య సముదాయాలపై భారీగా పన్నులు పెరిగాయి.
వార్షిక అద్దెల విలువ ఆధారంగా లెక్కింపు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 23 నగర పంచాయతీలు, 3 మున్సిపాలిటీలతోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, గద్వాల, నల్లగొండ మున్సిపాలిటీల్లో విలీనమైన వందలాది గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్నుల సవరణ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. గ్రామ పంచాయతీలుగా ఉన్న సమయంలో ఈ ప్రాంతాల్లో ఆస్తి పన్నులు నామమాత్రంగా వసూలు చేసేవారు. మున్సిపాలిటీలుగా హోదా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం ప్రకారం పన్నుల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో అనుమతిచ్చింది. వార్షిక అద్దె విలువల ఆధారంగా ఆ ప్రాంతంలోని ఆస్తులపై పన్నులను లెక్కించారు.
ఇలా పెంచిన పన్నులపై రెండు దఫాలుగా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఎట్టకేలకు ఈ సవరణ ప్రక్రియ ముగిసిపోవడంతో పురపాలికలు పన్ను వసూళ్లపై దృష్టి సారించాయి. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు అశాస్త్రీయ పద్ధతుల్లో పన్నులను విధించేవారని.. పురపాలికలుగా మారిన తర్వాత శాస్త్రీయంగా సవరణ చేయడంతో ఒక్కసారిగా భారీ మొత్తంలో పన్నులు పెరిగిన భావన కలుగుతోందని పురపాలక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పురపాలికలుగా హోదా పెరిగిన తర్వాత 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, స్వచ్ఛ భారత్ తదితర పథకాల కింద వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
విలీనంతో విమాన మోతే!
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, గద్వాల, నల్లగొండ మున్సిపాలిటీల్లో విలీనమైన వందలాది శివారు గ్రామాలపై పన్నుల ప్రభావం తీవ్రంగా పడింది. సవరణకు ముందు రూ.56.14 కోట్లు ఉన్న వార్షిక పన్నులు తాజాగా రూ.129.94 కోట్లకు పెరిగిపోయాయి. అత్యధిక భారం విలీన గ్రామాలపైనే పడింది. సవరణ తర్వాత 32 కొత్త పురపాలికలపై రూ.129 కోట్ల పన్నుల భారం పడగా.. అందులో రూ.73.79 కోట్ల భారం విలీన గ్రామాలపైనే పడడం గమనార్హం.