
ఇక ఆస్తి పన్నుల మోత!
తెలంగాణలో భారీ స్థాయిలో ఆస్తి పన్నుల వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు పుష్కర కాలం తర్వాత పురపాలక, నగర పాలక సంస్థల్లో ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆస్తి పన్నులు పెరగనున్నాయి.
* మున్సిపాలిటీల్లో పన్నుల పెంపునకు రంగం సిద్ధం
* ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు ప్రతిపాదనలు
* 5 కార్పొరేషన్లు 36 మున్సిపాలిటీల్లో అక్టోబర్ 1 నుంచి
* కొత్తగా ఏర్పడిన 26 పురపాలక సంస్థల్లో ఏప్రిల్ 1 నుంచి..
* నివాస భవనాలపై 12 ఏళ్ల తర్వాత పెరగనున్న పన్నులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ స్థాయిలో ఆస్తి పన్నుల వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు పుష్కర కాలం తర్వాత పురపాలక, నగర పాలక సంస్థల్లో ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆస్తి పన్నులు పెరగనున్నాయి. ఈ మేరకు ఆస్తి పన్నుల పెంపునకు అనుమతి కోరుతూ పురపాలక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలకు పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషి ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు కూడా. ఇక ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదం లభించాల్సి ఉంది. సీఎం అనుమతి రాగానే ఆస్తి పన్నుల సవరణకు పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించనుంది.
మున్సిపల్ చట్టాల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఆస్తి పన్నులను సవరించాల్సి ఉంది. కానీ చివరిసారిగా నివాస భవనాలపై 12 ఏళ్ల కింద, నివాసేతర (నాన్ రెసిడెన్షియల్) భవనాలపై ఏడేళ్ల కిందట ఆస్తి పన్నులను పెంచారు. ఆ తర్వాత మళ్లీ సవరణ జరగలేదు. కానీ ఈ మధ్యకాలంలో అన్ని రకాల వ్యయం కూడా ఎన్నో రెట్లు పెరిగిపోవడంతో... ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి పురపాలక, నగరపాలక సంస్థలు విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి తక్షణమే ఆస్తి పన్నులను పెంచాల్సి ఉందని పురపాలకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
పుష్కర కాలం తర్వాత..
శాస్త్రీయంగా ఆస్తి పన్నుల గణన విధానాన్ని ప్రవేశపెడుతూ... 1990లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అది అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన ఆస్తి పన్నుల తొలి సవరణ 1993 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు రెండో సవరణ 2002 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి గత 12 ఏళ్లుగా నివాసగృహాలపై ఆస్తి పన్నులను సవరించలేదు. అయితే 2007 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడో సవరణను నివాసేతర భవనాలపై మాత్రమే అమలు చేస్తున్నారు. ఈ మధ్య ఒక సారి ఆస్తి పన్నుల పెంపు ప్రయత్నాలు జరిగినా.. మున్సిపల్, సాధారణ ఎన్నికల కారణంగా గత పాలకులు వెనుకడుగు వేశారు.
కొత్తవాటికి ఇంకా ముందే!
రాష్ట్రంలోని మొత్తం 68 పురపాలక సంస్థల్లో... ఆరు నగర పాలక సంస్థలు కాగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి 62 ఉన్నాయి. ఇందులో 23 నగర పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు కలిపి 26 పురపాలక సంస్థలు ఇటీవల కొత్తగా ఏర్పడినవే. ఈ 26 చోట్ల మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా ఆస్తి పన్నుల పెంపునకు మూడు నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కసరత్తు దాదాపు పూర్తికాగా.. ఏప్రిల్ 1 నుంచి పెంపును అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మినహా.. మిగతా ఐదు కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లో అక్టోబర్ 1 నుంచి ఆస్తిపన్ను పెరగనుంది.