పెరిగిన మున్సిపల్‌ ఆస్తి పన్ను వసూళ్లు

Increased municipal property tax collections - Sakshi

ఈ ఏడాది రూ.1,998 కోట్లు వసూలు

గడువునాటికి రూ.2 వేల కోట్లు దాటుతుందని అంచనా

మొత్తం డిమాండ్‌లో వసూలైంది 53.10 శాతం

గత ఆర్థిక సంవత్సరానికంటే 41.5 శాతం ఎక్కువ

నీటి పన్ను వసూళ్లు రూ.228.78 కోట్లు

సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపల్‌ శాఖ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి సాధించింది. గత ఏడాదికంటే ఈసారి 41.50 శాతం అధికంగా పన్నులు వసూలు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం సాయంత్రానికి సుమారు రూ.1,998 కోట్లు వసూలు చేసింది. మొత్తం పన్నుల డిమాండ్‌ రూ.3,763.44 కోట్లు కాగా, అందులో ఇప్పటివరకు 53.10 శాతం వసూలైంది.

గత ఆర్థిక సవంత్సరంలో మార్చి 31 నాటికి వసూలైంది రూ.1,414 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.1,651.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.49.54 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి 12.73 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తుల నుంచి రూ.48.99 కోట్లు, ఖాళీ స్థలాల నుంచి రూ.235.74 కోట్లు వసూలైంది. మార్చి 31 లోగా పన్ను చెల్లించినవారికి బకాయిలపై 5 శాతం రాయితీ కల్పించడంతో రెండు వారాల్లో ఆస్తి పన్ను చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి.

వడ్డీ మాఫీ కింద పన్ను చెల్లింపుదారులు మొత్తం రూ.178.91 కోట్లు మినహాయింపు పొందినట్టు సీడీఎంఏ అధికారులు తెలిపారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి బకాయి చెల్లింపులు కూడా పెరిగాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులతోపాటు ప్రభుత్వ సంస్థలు కూడా బకాయిల చెల్లింపునకు ముందుకు రావడం విశేషం. నిర్ణీత పన్ను చెల్లింపు గడువునాటికి మొత్తం వసూళ్లు రూ.2 వేల కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. మున్సిపల్‌ నీటి పన్ను డిమాండ్‌ రూ.632.63 కోట్లు ఉండగా, రూ.228.78 కోట్లు వసూలైంది.

ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5% రిబేటు
పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుదారులకు మొత్తం పన్నులో 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌ 30వ తేదీలోగా చెల్లించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు.

ఆన్‌లైన్‌ విధానంలో పన్ను చెల్లించే వారి కోసం మొత్తం పన్నులో ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపును మినహాయించేలా ఈ–మున్సిపల్‌ ఈఆర్‌పీ అప్లికేషన్‌లో మార్పులు చేయనున్నారు. అందుకోసం ఏప్రిల్‌ 1 నుంచి మూడు రోజులపాటు వెబ్‌సైట్‌ నిలిపివేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top