తీయని బాధ.. మందులకు వ్యథ!

Treatment of patients with diabetes has get difficult - Sakshi

మధుమేహం రోగులకు ‘ఇన్సులిన్‌’భారం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ రోగులకు లేని సరఫరా

మార్కెట్‌లో నెలకు రూ.500 నుంచి రూ.3 వేలు

జనగామ జిల్లా మల్కాపూర్‌కు చెందిన బాలికకు ఏడేళ్ల వయసులోనే మధుమేహం వచ్చింది. బాలిక తల్లి కూలీ డబ్బులతోనే వైద్యం చేయించేది. పదేళ్లుగా మధుమేహానికి మందులు వాడుతోంది. ఇటీవల తల్లి మరణించడంతో ఆ బాలిక పరిస్థితి దయనీయంగా మారింది. కూలీకి సైతం వెళ్లలేని పరిస్థితి.

పని చేస్తూ చిన్న గాయమైనా మధుమేహంతో మానదు. అలాగని పని చేయకుంటే ఇళ్లు గడవదు. పలుమార్లు విన్నవించుకున్న తర్వాత వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి (ఎంజీఎం) అధికారులు ప్రత్యేక పరిస్థితుల కింద ఈమెకు ఇన్సులిన్‌ మందులు ఉచితంగా ఇస్తున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం మంది పేద మధుమేహ రోగులు మందులు అందక అవస్థలు పడుతున్నారు. భరించలేని ఖర్చులతో ప్రమాదకర అనారోగ్య పరిస్థితులను ఎదుక్కొంటున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: మధుమేహం (డయాబెటిస్‌).. గతంలో కొందరికే పరిమితయ్యే ఈ వ్యాధి ఇప్పుడు అందరికీ వస్తోంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధులనూ బాధిస్తోంది. పేద రైతులు, కూలీ పనులు చేసుకునే మధుమేహ బాధితులకు చికిత్స భారమవు తోంది. 

టైప్‌–2 మధుమేహ బాధితులకు కొంత వరకు ఇబ్బంది లేకున్నా.. టైప్‌–1 రోగులు మందులు కొనుగోలు చేయలేని స్థితి ఉంటోంది. రక్తంలోని చక్కర స్థాయిని బట్టి నెలకు రూ.500 నుంచి రూ.3 వేల వర కు మందులకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పేదవారు మందుల కోసం ఇంత మొత్తం వెచ్చించలేకపోతున్నారు. ఫలితంగా రోగుల రక్తంలో చక్కర స్థాయిలో తేడాలు వచ్చి పరిస్థితి మరణాలకు దారితీస్తోంది.

ఇన్సులిన్‌ భారం
మధుమేహం రెండు రకాలు. టైప్‌–1 మధుమేహ బాధితులకు ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ అవసరం ఉంటుంది. టైప్‌–2 మధుమేహ రోగులకు సాధారణ మాత్రలతో రక్తంలోని చక్కర స్థాయి నియంత్రణలోకి వస్తుంది. మాత్రల వినియోగంతో వ్యాధి తగ్గని వారు ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తీసుకోవాలి. మధుమేహ రోగుల్లో ఎక్కువ మంది సాధారణ స్థితిలోనే ఉంటారు. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం ఇన్‌పేషెంట్లకు మాత్రమే ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి వైద్యం చేసుకుని ఇంటికి వెళ్లే వారికి ఇచ్చే డిశ్చార్జీ రిపోర్టుతోపాటు ఇన్సులిన్‌ ఇంజక్షన్లను వైద్యులు రాసి ఇస్తున్నారు. హుమన్‌ సేలబుల్‌ ఇన్సులిన్, హుమన్‌ మిక్స్‌టాడ్, హుమలాగ్‌ లాంగ్‌ యాక్టింగ్, ఇన్సులిన్‌ డెగ్యూడెక్, హుమలాగ్, భాసిక్‌ ఇన్సులిన్‌ అస్పార్ట్‌ (అనలాగ్‌) ఇంజక్షన్ల తో రోగులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా ఇచ్చే ఈ ఇంజక్షన్ల ధర ప్రైవేటు దుకాణాల్లో సగటున రూ.500 నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతోంది. ఇది పేదలకు భరించలేని భారంగా మారుతోంది. 

ఉద్యోగులకూ నిలిపివేత
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవలు విషయంలో గతంలో ఓపీ రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఉచితంగా ఇచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఈహెచ్‌ఎస్‌/జీహెచ్‌ఎస్‌ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇన్సులిన్‌ ఇంజక్షన్లను ఓపీ రోగులకు ఇవ్వడా న్ని నిలిపివేసింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు.

ఇన్సులిన్‌ ఇంజక్షన్లు సాధారణంగా ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితి ఉండదని, మధుమేహ బాధితులు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించుకుని ఇంజక్షన్లు వినియోగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా వైద్య శాఖ ఓపీ రోగులకు ఇంజక్షన్లు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అవసరాలను పరిశీలిస్తాం
మధుమేహ రోగులకు ఓపీలో ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇచ్చే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. వైద్యుల పర్యవేక్షణలో కాకుండా ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ ఇస్తే సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటివి జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఓపీ రోగులకు ఇంజక్షన్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. – కె.రమేశ్‌రెడ్డి, వైద్య విద్య సంచాలకుడు

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top