రూ.2 వేల నోటు రద్దు చేయొచ్చు | Rs 2 thousand Note can be canceled | Sakshi
Sakshi News home page

రూ.2 వేల నోటు రద్దు చేయొచ్చు

Nov 29 2016 3:11 AM | Updated on Apr 3 2019 5:16 PM

రూ.2 వేల నోటు రద్దు చేయొచ్చు - Sakshi

రూ.2 వేల నోటు రద్దు చేయొచ్చు

రూ.2 వేల నోటు ఉంటుందో లేదో చెప్పలేం. భవిష్యత్తులో దాన్ని కూడా రద్దు చేయవచ్చు.

భవిష్యత్తులో ఆదాయపు పన్ను ఉండకపోవచ్చు: సీఎం కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: ‘‘రూ.2 వేల నోటు ఉంటుందో లేదో చెప్పలేం. భవిష్యత్తులో దాన్ని కూడా రద్దు చేయవచ్చు. కేంద్రం వ్యూహంలో ఇదో భాగం కావచ్చు...’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెండువేల నోటును వాడుకలోకి తీసుకురావటంతో నల్లధనం మరింత పెరుగుతుంది కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. మరో ప్రశ్నకు సమాధానంగా ‘‘భవిష్యత్తులో ఆదాయపు పన్ను ఉండకపోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఒక శాతం మందే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. వారిలో ఉద్యోగులే ఎక్కువ. దానికి బదులు భవిష్యత్తులో జీఎస్‌టీ, బీటీటీ రెండే పన్నులు అమలు చేసే వీలుంది. బ్యాంకు ట్రాన్సాక్షన్ టాక్స్ (బీటీటీ) పన్ను ఒకటే అమలుచేసే అవకాశముంది. దీంతో కేంద్రానికి వచ్చే ఆదాయం ఇప్పుడొచ్చే ఆదాయం కంటే అయిదారు రెట్లు అధికంగా వచ్చే అంచనాలున్నాయి. అప్పుడు రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా పెరిగిపోతుంది.

ప్రస్తుతం కేంద్రం పన్నుల వాటాలో 42 శాతం రాష్ట్రాలకు పంపిణీ అవుతోంది. ప్రతి ఏటా రూ.13 వేల కోట్లు.. నెలనెలా దాదాపు రూ.997 కోట్ల ఆదాయం వస్తుంది. అప్పుడు ఇది అయిదారు రెట్లు పెరిగే అవకాశాలున్నాయి. అందుకే ఈ నిర్ణయంతో భవిష్యత్తు ప్రయోజనాలుంటాయనిపిస్తోంది. ప్రస్తుతానికి నోట్ల రద్దుతో రాష్ట్రంలో అన్ని లావాదేవీలు తగ్గిపోయాయి. అందుకే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గింది. రిజిస్ట్రేషన్లు, వ్యాట్‌పై ప్రభావం పడింది. ఆదాయం ఎంత మేరకు తగ్గుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. వచ్చే నెలలో అంచనా వేసుకునే వీలుంటుంది. తెలంగాణలో మొత్తం రూ.75 వేల కోట్ల మారక ద్రవ్యం చెలామణిలో ఉంది. అందులో 86 శాతం 500, 1000 నోట్లు ఉన్నట్లు అంచనా. ఇవన్నీ రద్దు చేయటంతో లావాదేవీలు స్తంభించి రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడటం ఖాయం. ఇప్పటివరకు రాష్ట్రంలో బ్యాంకు ఖాతాల్లో రూ.32 వేల కోట్లు జమయ్యాయి. రిజర్వు బ్యాంకు నుంచి రూ.12 వేల కోట్లు పంపిణీ అయ్యాయి. ప్రధానంగా చిన్ననోట్ల సమస్య నెలకొంది. రూ.2 వేల నోటు ఉండీ లేని చందమైంది. నుమాయిష్‌గా మారింది. దాన్ని చిల్లరగా మార్చుకునేందుకు ఇబ్బందులున్నారుు. అందుకే చిన్న నోట్లను సరఫరా చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాను’’ అని వివరించారు.

 
జీతాలపై బ్యాంకర్లతో చర్చలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతంలో కొంత నగదు చెల్లించే అంశంపై బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపై మంగళవారం సాయంత్రానికి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement