ఓయూ విద్యార్థుల ముందస్తు అరెస్టులు | OU students' early arrests | Sakshi
Sakshi News home page

ఓయూ విద్యార్థుల ముందస్తు అరెస్టులు

Apr 27 2017 1:32 AM | Updated on Sep 5 2017 9:46 AM

ఉస్మానియా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ముందస్తు చర్యగా పలువురు నిరుద్యోగ జేఏసీ విద్యార్థులతో

- ఉద్యోగాలడిగితే మూకుమ్మడి అరెస్టులా?
- నిరుద్యోగ జేఏసీ సూటి ప్రశ్న  


సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ముందస్తు చర్యగా పలువురు నిరుద్యోగ జేఏసీ విద్యార్థులతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం ఐదుగంటలకే ఉస్మానియా హాస్టళ్ల వద్ద విద్యార్థులను అరెస్టు చేసేందుకు పోలీసులు మోహరించారు. పలువురు విద్యార్థులు అరెస్టులను తప్పించుకొనేందుకు అజ్ఞాతం లోకి వెళ్ళినట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. కొంతమందిని హాస్టల్‌ గదుల్లోనే పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ‘ఇ’హాస్టల్, ‘బి’ హాస్టల్, న్యూ రీసెర్చ్‌ స్కాలర్స్‌ హాస్టల్‌(ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌) నుంచి నిరుద్యోగ జేఏసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని ఉత్సవ ప్రాంగణం నుంచి బయటకు పంపారు. అదేవిధంగా నిరుద్యోగ విద్యార్థి ఉద్యమ నాయకుడు, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేశ్‌ను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాస్‌లు ఇచ్చి అరెస్టులు చేశారు
యూనివర్సిటీ ఉత్సవ ప్రాంగణంలోనికి వస్తున్న విద్యార్థులను, ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌ ‘ఎ’ గ్రౌండ్‌ నుంచి, ‘బి’ గ్యాలరీకి వెళ్తున్న ఓయూ జేఏసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో తెలంగాణ విద్యార్థి సంఘం నాయకుడు దుర్గం భాస్కర్, మాదిగ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, వట్టికూటి రామారావు, నిజ్జన రమేశ్, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రేమ్, టీయూఎస్‌ఎఫ్‌ పుల్లారావు, దరువు మల్లన్న, ఆశప్ప, శ్రవణ్, విజయ్‌కుమార్‌ మాదిగ, గణేశ్‌ తదితరులున్నారు. వీరిని అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు.  మా యూనివర్సిటీ, మా సెలబ్రేషన్స్‌ అని భావించి పాల్గొనేందుకు వస్తుంటే ఉత్సవాల్లో పాల్గొనకుండా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని దుర్గం భాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

భయభ్రాంతులకు గురిచేస్తారా?
ఉద్యోగాలడిగితే మూకుమ్మడిగా అరెస్టులు చేస్తారా అని నిరుద్యోగ జేఏసీ ప్రశ్నించింది. నిరుద్యోగ జేఏసీ గత కొంతకాలంగా చేస్తు న్న డిమాండ్లను పట్టించుకోకుండా, విద్యా ర్థులను ఉన్నపళంగా అరెస్టు చేసి, భయ భ్రాంతులకు గురిచేయడం అన్యాయమని నిజ్జన రమేశ్‌ అన్నారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల ఉద్యోగాల విషయంలో ఏ హామీ లేకుండా, కేవలం అరగంట కోసం పోలీసులతో వర్సిటీని నింపేసి, కార్యక్రమాన్ని హడావుడిగా ముగించుకొన్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికే తమపై 132 కేసులున్నాయని, ఇంకా కేసులు పెట్టి సాధించేదేమీ ఉండదని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement