
ఇక కాంగ్రెస్ వంతు!
తెలంగాణ టీడీపీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పది మందికి గులాబీ కండువాలు కప్పిన టీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై దృష్టి సారించిందా?
♦ గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేతలు
♦ మంతనాలు జరుపుతున్న టీఆర్‌ఎస్ నేతలు
♦ వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి చేరికలు?
♦ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైపు చూస్తున్న హస్తం నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పది మందికి గులాబీ కండువాలు కప్పిన టీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై దృష్టి సారించిందా? ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు అధికార పార్టీలో చేరనున్నారా? జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందటి చేరికల పర్వం మళ్లీ మొదలుకానుందా? టీఆర్‌ఎస్ వర్గాల నుంచి అందుకు అవుననే సమాధానం వస్తోంది! ఆ వర్గాల సమాచారం ప్రకారం.. పలు జిల్లాల్లో కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకులు గులాబీ గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలోనే వీరు పార్టీ మారేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అన్ని ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ఈ చేరికలు తమకు కలిసి వస్తాయని భావిస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు.. కొందరు కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అప్పుడే మొదలైన చేరికలు
వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం, వారి అనుచరులుగా ఉన్న ముఖ్య కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. వరంగల్‌లో టీడీపీ నగర అధ్యక్షుడు గులాబీ కండువా కప్పుకొంటే, ఖమ్మంలో మాజీ ఎమ్మెల్యే సుల్తాన్, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్‌రావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తదితరులు గులాబీ గూటికి చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వంటి స్థానిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి వచ్చారు. టీఆర్‌ఎస్‌లోకి వస్తున్న కాంగ్రెస్ నాయకులు.. తమ ఎమ్మెల్యేలనూ పార్టీ మారాలంటూ ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. చేరికలపై ఒకరిద్దరు టీఆర్‌ఎస్ మంత్రులు స్పందిస్తూ అలాంటిదే లేదని అంటున్నా... హస్తం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అధికార పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఏ జిల్లాల్లో ఎవరు?
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తిరుగులేని రీతిలో బలోపేతం కావాలన్న లక్ష్యంతో ఉన్న టీఆర్‌ఎస్.. కాంగ్రెస్‌లోని పెద్ద తలకాయలపైనే గురి పెట్టిందని అంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ నేతతో ఇద్దరు మంత్రులు టచ్‌లో ఉన్నారని, వారితో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం ఓ మంత్రితో మంతనాలు జరిపినట్లు తెలిసింది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య చేరిక దాదాపు ఖాయమైందని, రెండు రోజుల్లో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటారని వినికిడి.
కాంగ్రెస్ శ్రేణులు దీన్ని ఖండిస్తున్నా.. చేరికకు ముహూర్తం కూడా ఖరారైందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో సైతం ఒక్కో ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత తనయుడి చేరికపై కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు ఒక ఎమ్మెల్యే కూడా పార్టీ మారతారని, ఇదంతా వచ్చే ఎన్నికలకు టీఆర్‌ఎస్‌లో బెర్తు ఖరారు చేసుకోవడానికేనని అంటున్నారు. ప్రధానంగా దక్షిణ తెలంగాణ పరిధిలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీల చేతిలో దాదాపు సగం సీట్లు ఉండడంతో, ఈ జిల్లాల్లో మరింత బలం పెంచుకునే దిశలో టీఆర్‌ఎస్ వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కొన్ని, ఆ తర్వాత మరికొన్ని చేరికలు ఉండవచ్చన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.