
పంచ‘తంత్రం’!
రోజురోజుకూ తరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఖజానాను భర్తీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ తీవ్ర కసరత్తు చేస్తోంది.
జీహెచ్‌ఎంసీ నిధుల వేట
ఖజానా భర్తీకి భారీ కసరత్తు
ఆస్తి పన్ను, వీఎల్‌టీ,{sేడ్ లెసైన్స్ తదితరాలపై నజర్
ఐదు అంశాల ఆధారంగా ఆర్థిక పరిపుష్టికి యత్నం
రోజురోజుకూ తరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఖజానాను భర్తీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆదాయం పెంచుకునేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వివిధ గ్రాంట్ల కింద కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 492 కోట్లు రాగా, 2015-16లో కేవలం రూ. 48 కోట్లు మాత్రమే అందాయి. దీంతో రూ. 444 కోట్ల మేర ఖజానా లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి రూ. 500 కోట్లు తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలన్నా...ఖజానా పరిపుష్టంగా ఉండాల్సి ఉన్నందున ఆదాయ మార్గాలన్నింటిపై దృష్టి సారించింది. ప్రస్తుతానికి ఐదు అంశాల (ఆస్తిపన్ను, వీఎల్‌టీ, ఓసీ, ట్రేడ్ లెసైన్సుల జారీ, పన్నుల పెంపు)పై ప్రధానంగా కన్నేసింది. - సాక్షి,సిటీబ్యూరో
సిటీబ్యూరో: గ్రేటర్ ఖజానా నిండాలంటే ఎలాంటి మార్గాలను అనుసరించాలనే దానిపై అధికారులు భారీ కసరత్తు చేస్తున్నారు. ప్రజలపై అధిక భారం మోపకుండానే చిత్తశుద్ధితో పనిచేసి పన్నులు రాబట్టాలని భావిస్తున్నారు. ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తిగా నెరవేరితే కొంత ఆర్థిక పరిపుష్టి సాధ్యమవుతుందంటున్నారు. అలాగే ట్రేడ్ లెసైన్సులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, అవసరాన్ని బట్టి పన్నుల పెంపు ద్వారా నిధులు సాధించాలని వ్యూహరచన చేస్తున్నారు.
ఆస్తిపన్ను ..
జీహెచ్‌ఎంసీ ఆదాయమార్గాల్లో ఆస్తిపన్నే ప్రధాన వనరు కావడంతో వివిధ కోణాల్లో ఆలోచనలు చేసి ఆస్తిపన్ను మరింతగా పెంచుకోవచ్చునని అంచనా వేసింది. వాటిల్లో అన్ అసెస్డ్ భవనాలను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడం, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ నివాస కేటగిరీలోనే ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలను గుర్తించి వాణిజ్య కేటగిరీలో చేర్చడం, చెల్లించాల్సిన ఆస్తిపన్ను కంటే లొసుగులతో తక్కువ ఆస్తిపన్ను మాత్రమే చె ల్లిస్తున్న భవనాలను గుర్తించడం వంటివి ఉన్నాయి. ఈ చర్యల ద్వారా రూ.100 నుంచి రూ. 200 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని అంచనా. వీటితోపాటు రెంటల్ వాల్యూ కనుగుణంగా హేతుబద్ధీకరణ జరపడం తదితరమైనవి ఉన్నాయి.
వీఎల్‌టీ ..
వేకెంట్ ల్యాండ్ టాక్స్(వీఎల్‌టీ) విధింపు ద్వారా దాదాపు రూ.30 కోట్ల మేర ఆదాయం రాగలదని అంచనా. ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద జీహెచ్‌ఎంసీకి దాదాపు 57 వేల దరఖాస్తులందాయి. పరిష్కారమైన వాటన్నింటికి వీఎల్‌టీ వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈమేరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలను ఇప్పటికే జోనల్, డిప్యూటీ కమిషనర్ల పరిశీలన కోసం పంపారు. ఎల్‌ఆర్‌ఎస్ అవసరం లేని భూములపై ప్రజలే స్వచ్ఛందంగా ముందుకువచ్చేందుకు వీఎల్‌టీని తగ్గించే ఆలోచన కూడా చేశారు. వీఎల్‌టీ ప్రస్తుతం మార్కెట్ ధరలో 0.5 శాతంగా ఉంది. దీన్ని 0.1 శాతానికి తగ్గించడం ద్వారా ఎక్కువ మంది ముందుకు వస్తారని అంచనా.
ట్రేడ్ లెసైన్సులు..
జీహెచ్‌ఎంసీ నుంచి వ్యాపారాలకు అనుమతులు తీసుకున్నవారు దాదాపు 1.48 లక్షమంది ఉండగా, ట్రేడ్ లెసైన్సు జాబితాలో మాత్రం 43 వేలమంది మాత్రమే ఉన్నారు. అంటే లక్షమందికి పైగా ట్రేడ్ లెసైన్సు ఫీజు కట్టడం లేరు. వీరందరినీ ట్రేడ్ లెసైన్సు పరిధిలోకి తేవడం ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా. దీంతోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రేడ్‌లెసైన్సు ఫీజుల విధానాన్ని కూడా మార్చే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం నాలుగు కేటగిరీల్లో ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. సోమేశ్‌కుమార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ట్రేడ్‌లెసైన్సు విధింపు సులభంగా ఉంటుందని దీన్ని అమల్లోకి తెచ్చారు. షాపుల మందు ఉండే రోడ్ల వెడల్పును బట్టి 20 అడుగుల లోపు వరకు, 30 అడుగుల రోడ్ల వరకు, 30 అడుగులకు మించిన రోడ్లకు మూడు కేటగిరీల్లో, స్టార్ హోటళ్లు, కార్పొరేట్ ఆస్పత్రుల వంటివాటికి మరో కేటగిరీలో ట్రేడ్‌లెసైన్సుల ఫీజులు విధించారు. దీనివల్ల గతంలో కంటే ఆదాయం ఎన్నోరెట్లు తగ్గినట్లు గుర్తించారు. దీంతో ఈ విధానాన్ని కూడా తిరిగి మార్చే యోచనలో ఉన్నారు. తద్వారా దాదాపు రూ. 100 కోట్ల మేర అదనంగా ఆదాయం రాగలదని అంచనా.
ఓసీ ఆధారంగా..
ప్రస్తుతం భవననిర్మాణ అనుమతులు ఆన్‌లైన్ ద్వారా ఇస్తుండటంతో అనుమతి పొందగానే తెలుస్తుంది. దీంతో ఏదైనా కొత్త భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీ కాగానే, దాన్ని ఆస్తిపన్ను జాబితాలో చేర్చి పన్ను వసూలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కొత్త భవనాల నిర్మాణం పూర్తవుతున్నా, ఆమేరకు ఆస్తిపన్ను మాత్రం పెరగడం లేదు. ఏళ్ల తరబడి చాలామంది ఆస్తిపన్నును చెల్లించకపోవడంతో ఆమేరకు జీహెచ్‌ఎంసీ ఖజానాకు లోటు ఏర్పడుతోంది. ఓసీల ఆధారంగా దీన్ని భర్తీచేయవచ్చునని భావిస్తున్నారు.
పన్నుపోటు..
పై మార్గాలతో పాటు అంతిమంగా ఆస్తిపన్ను తదితరాల పెంపునకూ రంగం సిద్ధం చేస్తున్నారు. నగరంలో 2002 తర్వాత ఇంతవరకు నివాసగృహాలపై ఆస్తిపన్ను పెంచలేదు. వాణిజ్య భవనాలకు సైతం 2008 తర్వాత పెంచలేదు. ఈ రెండింటిపైనా ఆస్తిపన్ను పెంచేందుకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్యకలాపాలపై సోమవారం మునిసిల్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే వర్క్‌షాప్‌లో వీటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.