
జనవరి 31లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు జనవరి 31 వరకు గడువు పెంచాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు జనవరి 31 వరకు గడువు పెంచాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. డిసెంబర్ 15 లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని గతంలో హైకోర్టు ఆదేశించిన దరిమిలా, ఆలోగా ఎన్నికలు నిర్వహించలేమని, జనవరి 31 వరకు గడువివ్వాలని టీ సర్కార్ కోరింది.
ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం, నకిలీ ఓటర్ల తొలిగింపు వంటి ప్రక్రియవల్ల ఓటరు జాబితాను ఖరారు చేయడంలో జాప్యం తలెత్తే అవకాశం ఉన్నందున, గడువు పెంచాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం జనవరి 31లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.