కోనేరే లేదు.. తెప్పోత్సవమట!

Funds robbery in the temples - Sakshi

హైదరాబాద్‌లో పలు ఆలయాల్లో నిధులు స్వాహా

సాక్షి, హైదరాబాద్‌: దేవాలయాల్లో తెప్పోత్సవానికి చాలా ప్రాధాన్యముంటుంది. కోవెల సమీపంలోని నదిలోనో, సరస్సులోనో, కాదంటే చెరువులోనో, అదీ లేకుంటే పుష్క రిణిలోనో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూ ర్తులను తెప్పలో ఉంచి సంప్రదాయబద్ధంగా ఊరేగించడమే తెప్పోత్సవం. కానీ... ఆలయం వద్ద కనీసం నీళ్ల మడుగు కూడా లేకుంటే? అయినా తెప్పోత్సవం సాధ్య మా? దీన్ని కూడా సుసాధ్యం చేస్తున్నారు మన దేవాదాయ అధికారులు! ఆ పేరుతో లక్షల్లో ఖర్చు చేసినట్టు చూపి దర్జాగా బిల్లులు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు!! 

అది సికింద్రాబాద్‌లోని ప్రధాన దేవాలయం. చుట్టూ ఎటు చూసినా భవనాలే తప్ప ఎక్కడా కనీసం చెరువు కూడా ఉండదు. కానీ అక్కడ వేడుకగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నారట. పైగా అందుకు రూ.లక్షల్లో ఖర్చయిందంటూ లెక్కలు చూపి మరీ డబ్బులు డ్రా చేస్తున్నారు. పోనీ ఆలయం చుట్టూ వీధుల్లోనే పల్లకీ సేవ తరహాలో సాదాసీదాగా నిర్వహిస్తున్నారా అంటే అదీ లేదు. ఒక్క సేవకు రూ.15 లక్షలు అయ్యాయంటూ చిట్టాపద్దులు రాశారు! ఇంత చేస్తున్నా కనీసం ఆడిట్‌ అధికారులు అభ్యంతర పెట్టడం లేదు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులూ ప్రశ్నించడం లేదు. నిధుల అక్రమాలకు సంబంధించి దాఖలైన కేసులో ఇటీవల అధికారులు కోర్టుకు సమర్పించిన చిట్టాపద్దుల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ తప్పుడు లెక్కల వ్యవహారంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కొందరు ఇటీవల సీఎం కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు.  

ఆడిట్‌ లేక ఆగమాగం... 
దేవుడికి భక్తులు సమర్పించే సొమ్మును స్వాహా చేసేందుకు ఆలయాల కార్యనిర్వహణాధికారులు తోచిన పేర్లతో లెక్కలు రాసి ఎడాపెడా ‘ఖర్చులు’ చూపిస్తున్నారు. రాజధానిలో ఆదాయం బాగున్న చాలా దేవాలయాల్లో ఇదే తంతు! స్వామి, అమ్మవార్లకు నానా రకాల సేవల పేరుతో ఆలయ బొక్కసానికి యథాశక్తి కన్నం వేస్తున్నారు. దేవాదాయ శాఖకు సొంతంగా ఆడిట్‌ విభాగం లేకపోవటం, ప్రభుత్వ ఆడిట్‌ శాఖ తూతూ మంత్రం తనిఖీలతో సరిపెడుతుండటంతో వారు ఆడింది ఆటగా సాగుతోంది. 

బంగారు నగల్లోనూ గోల్‌మాల్‌! 
దేవుడికి భక్తులు సమర్పించే నగలు, బంగారు ముక్కలను బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తారు. ఏటా వాటి లెక్కలు రాస్తుండాలి. కానీ రాజధానిలోని ఆ దేవాలయంలో బంగారం లెక్కల్లోనూ గోల్‌మాల్‌ జరుగుతోంది. వాటి వివరాలను సరిగా నమోదు చేయక చాలావరకు గల్లంతవుతున్నాయని చెబుతున్నారు.

ఎన్నెన్ని సిత్రాలో...!
- తెప్పోత్సవం పేరుతో భారీగా నిధులు స్వాహా చేసిన దేవాలయంలో ఆడిట్‌ పేరిట కూడా భారీగా ఖర్చు చూపడం విశేషం. సాధారణంగా రూ.25 వేల నుంచి రూ.30 వేలుండే ఆడిట్‌ ఖర్చు కాస్తా ఓ అధికారి బదిలీపై రాగానే ఏకంగా రూ.2 లక్షలకు చేరింది. 
- ఘనంగా ఉత్సవాలు జరిపే ఆలయాల్లో సదరు ఖర్చు ఆధారంగా ఉన్నతాధికారులు ఏటా బడ్జెట్‌ మంజూరు చేస్తుంటారు. కొందరు ఇక్కడే అధికారులు చక్రం తిప్పుతున్నారు. బడ్జెట్‌ను అమాంతం పెంచి, వచ్చిన నిధులు చాలావరకు ఖర్చయినట్టు బిల్లులు పెడుతున్నారు. భక్తులకు పంచే ప్రసాదాలకు, స్వామివారి నిత్య నివేదన తదితరాలకు ఏటా ఏకంగా రూ. 40 లక్షల వరకు ఖర్చు చూపుతూ వీలైనంత నొక్కేస్తున్నారు.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top