ఖతర్నాక్‌ ‘ఖత్‌’ దందా! | drugs supplied to hyderabad from african countries | Sakshi
Sakshi News home page

ఖతర్నాక్‌ ‘ఖత్‌’ దందా!

Feb 14 2017 4:02 AM | Updated on Oct 4 2018 7:01 PM

ఖతర్నాక్‌ ‘ఖత్‌’ దందా! - Sakshi

ఖతర్నాక్‌ ‘ఖత్‌’ దందా!

సోమాలియా నుంచి అక్రమంగా ఖత్‌ ఆకుల్ని తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయుల్ని నగర పోలీసులు గత ఏడాది మే 16న అరెస్టు చేశారు.

- అంతర్జాతీయ ఖత్‌ లీవ్స్‌(మత్తు) రవాణా గుట్టురట్టు
- 180 కేజీలు స్వాధీనం చేసుకున్న కొచ్చి కస్టమ్స్‌
- గతేడాది సిటీలో దొరికిన గ్యాంగ్‌కు మూలాలివే
- కేరళలో బయటపడిన వ్యవహారం


సాక్షి, హైదరాబాద్‌:
సోమాలియా నుంచి అక్రమంగా ఖత్‌ ఆకుల్ని తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయుల్ని నగర పోలీసులు గత ఏడాది మే 16న అరెస్టు చేశారు. ఈ ముఠాకు ఆ మత్తు ఆకులు ఎక్కడ నుంచి? ఎలా వస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ఇలాంటి అనేక సోమాలియా ముఠాలకు ఖత్‌ను సరఫరా చేస్తున్న విధానాన్ని కేరళ కస్టమ్స్‌ అధికారులు గత వారం కనిపెట్టారు. సిటీలో పట్టుబడిన ముఠాకూ  ఇలానే సరఫరా చేసినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బ్రౌన్‌షుగర్, కొకైన్, మొథకొలోన్‌... ఇవన్నీ ఉన్నత వర్గాలకు చెందిన వారి డ్రగ్స్‌.

గంజాయి వంటివి దిగువ, మధ్య తరగతి వారు వినియోగించే మాదకద్రవ్యాలు. ఈ రెండు వర్గాలకు చెందిన వారు, ఎవరూ గుర్తించని ‘మత్తు’ను ఆశ్రయిస్తున్నారు... అదే ఖత్‌. నైజీరియన్లు ఖరీదైన మాదకద్రవ్యాలను విక్రయిస్తుంటే ఖత్‌ అమ్మకాల్ని ఎక్కువగా ఒమన్, సోమాలియా దేశీయులు చేపడుతున్నారు. ఆకులు, కాడల రూపంలో ఉండే ఈ డ్రగ్‌ను నగరంలోని అనేక ప్రాంతాల్లో గుట్టుగా అమ్మేస్తున్నారనే అనుమానాలున్నాయి. ఎక్కువగా విద్యా కేంద్రాలనే టార్గెట్‌గా చేసుకుని ‘వ్యాపారం’ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

పాతిక కేజీలతో చిక్కిన ఇద్దరు
సోమాలియా దేశానికి చెందిన అవైస్‌ మహమూద్‌ జమాక్, ఫదీ మహమూద్‌ జమాక్‌ శరణార్థి (రిఫ్యూజీ) వీసాలపై నగరానికి వచ్చి టోలిచౌకి ప్రాంతంలో నివసించారు. వీరు గుట్టుగా ఖత్‌ ఆకుల వ్యాపారం చేస్తున్నట్లు గత ఏడాది నగర పోలీసులకు సమాచారం అందింది. దీంతో టోలిచౌకి గెలాక్సీ థియేటర్‌ వద్ద వలపన్నిన అధికారులు ఇరువురినీ గుర్తించారు. వీరు పోలీసుల్ని చూపి పారిపోతుండగా... వెంబడించి పట్టుకున్నారు. పాలిథిన్‌ కవర్లులో చుట్టిన 25 కేజీల ఖత్‌ ఆకుల్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ ద్వయం తమకు సోమాలియాకే చెందిన అహ్మద్‌ అనే వ్యక్తి వీటిని పంపిస్తున్నాడని చెప్పారు. సోయాలియాతో పాటు సౌతాఫ్రికాకు చెందిన కొందరు నగరంలో విద్య, వ్యాపారం, విహారం, శరణార్థి ముసుగులో తిష్టవేస్తున్నారు. వీరిలో అక్రమంగా నివసిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి వారు ఒకప్పుడు తమ స్వస్థలం నుంచి వచ్చేప్పుడు రహస్యంగా ఖత్‌ను అక్రమ రవాణా చేసి తీసుకువచ్చే వారు.


రూటు మార్చి దీటుగా రవాణా...
గత ఏడాది మేలో చిక్కిన ద్వయానికి ఖత్‌ ఆకుల్ని సరఫరా చేసిన ముఠా ఈసారి పంథా మార్చింది. కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన కొందరిని దళారులుగా ఏర్పాటు చేసుకుంది. విదేశాల నుంచి పార్శిల్స్‌ రూపంలో పోస్టల్‌ ద్వారానే ఖత్‌ ఆకుల్ని పంపిస్తోందని వెల్లడైంది. నేరుగా సౌతాఫ్రికా దేశాల నుంచి పార్శిల్స్‌ వస్తే ఎవరైనా అనుమానించే ఆస్కారం ఉంటుదనే ఉద్దేశంతో ‘వయా’ రూట్‌ ఎంచుకుంది. కువైట్‌లో కొందరు అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని సౌతాఫ్రికా నుంచి వారికి, అక్కడ నుంచి ఇక్కడకు పంపిస్తోంది. ఇదే పంథాలో ఇటీవల కొచ్చిలోని పోస్టల్‌ శాఖకు కొన్ని పార్శిల్స్‌ వచ్చాయి. వీటిని అనుమానించిన పోస్టల్‌ అధికారులు కస్టమ్స్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన తనిఖీ చేసిన అధికారులు అవి ఖత్‌ ఆకులుగా గుర్తించారు.

వాసన లేకపోవడంతో సేఫ్‌గా...
గత ఏడాది హైదరాబాద్‌లో చిక్కిన ద్వయానికి ఇదే పంథాలో ఖత్‌ లీవ్స్‌ అందినట్లు, దీని వెనుక భారీ మాఫియా ఉన్నట్లు కస్టమ్స్‌ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఖత్‌ ఆకులు, కాడలకు ఉండే వాసన లేని గుణం కారణంగానే తేలిగ్గా అక్రమ రవాణా చేస్తుండచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు హైదరాబాద్‌ సహా వివిధ నగరాల్లో చిక్కడం తప్ప, విమానాశ్రయంలో ఖత్‌ పట్టుబడిన ఉదంతాలు అరుదని పేర్కొంటున్నారు. వీరిని తీసుకువస్తున్న సందర్భంలో విమానాశ్రయంలో కస్టమ్స్‌ సహా ఇతర విభాగాలు ఆపినా, తనిఖీ చేసినా ‘ఆయుర్వేదం’ అంటూ అక్రమ రవాణాదారులు తప్పించుకుంటూ ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటాయి. అయితే ఖత్‌ ఆకులు, కాడలకు ఎలాంటి వాసనా ఉండదు. ఈ కారణంగా అధికారులు అనుమానం వచ్చి తనిఖీ చేయడం, పరిశీలించడం వంటివి చేసినా... ఖత్‌ను మత్తు పదార్థం/మాదకద్రవ్యమని గుర్తించడం కష్టమని, ఈ కారణంగానే నిరాటంకంగా రవాణా, క్రయవిక్రయాలు సాగిపోతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనారోగ్యంతో పాటు నేరప్రవృత్తి...
ఒమన్‌తో పాటు సోమాలియా, ఇథియోపియా తదితర దేశాల్లో పొలాల్లోనే ఖత్‌ను సాగుచేస్తుంటారు. కొన్నేళ్లకు పూర్వం కేవలం అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో మాత్రమే ఖత్‌ దందా జోరుగా సాగేది. ఆయా దేశాల్లో దీన్ని నిషేధించడంతో భారత్‌ సహా మరికొన్ని దేశాలపై కన్నేసిన ఒమన్‌ జాతీయులు అక్కడకు ఈ దందాను విస్తరించారు. తొలినాళ్లల్లో ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి మహానగరాలకే పరిమితమైనా తమ ‘వ్యాపారాన్ని’ నిర్వహించారు. ఆ తరవాతి కాలంలో సిటీలో పెరిగిన డ్రగ్స్‌ వినియోగంతో వారి దందా ఇక్కడకూ విస్తరించింది. ఖత్‌ పరిణామాలు, శరీరం, మనస్సుపై ప్రభావానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. వీటిల్లో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఖత్‌లో ఉండే కేథ్యూనిన్‌ మత్తును కలిగింనప్పటికీ... దీని వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని గుర్తించారు. దీనికంటే ఆందోళనకర అంశం ఏమిటంటే... ఖత్‌ వినియోగించే విద్యార్థులు, మైనర్లలో నేర ప్రవృత్తి పెరుగుతుందని అధ్యయనాల్లో బయటపడింది.

ఖత్‌ అంటే...
బ్రౌన్‌షుగర్, కొకైన్, మొథకొలోన్‌... ఇవన్నీ ఉన్నత వర్గాలకు చెందిన వారి డ్రగ్స్‌. గంజాయి వంటివి దిగువ, మధ్య తరగతి వారు వినియోగించే మాదకద్రవ్యాలు. ఈ రెండు వర్గాలకు చెందిన వారు, ఎవరూ గుర్తించని ‘మత్తు’ను ఆశ్రయిస్తున్నారు... అదే ఖత్‌.

నమిలితే మత్తునిచ్చే కేథ్యూనిన్‌...
ఖత్‌ ఆకు పరిమాణంలో మందారం చెట్టు ఆకు సైజులో ఉంటుంది. దీని ఆకు, కాడల్ని నమిలినప్పుడు కెథ్యూనిన్‌ అనే రసాయన పదార్థం లాలాజలం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వీటిని నమలడం ద్వారా ఎక్కే కిక్కు దాదాపు ఏడు గంటల పాటు శరీరంలో ఉండి పని చేస్తుంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతులకు చెందిన వారు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బ్రౌన్‌షుగర్, కొకైన్‌ వంటి ఖరీదైన మాదకద్రవ్యాలు దొరకనప్పుడు, ఆర్థిక ఇబ్బందుల సందర్భంలోనూ ఖత్‌ను ప్రత్యామ్నాయంగా అనేక మంది వినియోగిస్తున్నారు.

ఖత్‌ను వాడుతున్న వారిలోనూ ఒమన్, కెన్యాలకు చెందిన యువతే ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు చెప్తున్నారు. నగరంలోని కొన్ని విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర విద్యా సంస్థల వద్దా ఈ ఖత్‌ దందా జోరుగా సాగుతోందని పోలీసులే అంగీకరిస్తున్నారు. స్థానిక సిబ్బందికి దీనిపై అవగాహన లేకపోవడం, అన్ని చోట్లా ప్రత్యేక బృందాలు మాటు వేయడం సాధ్యం కాకపోవడంతో ఖత్‌ దందా యథేచ్ఛగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement