
బీచ్ కారిడార్‌కు కేంద్రం విముఖత
రాష్ట్రంలోని సముద్ర తీరం వెంబడి ఇచ్ఛాపురం నుంచి తడ వరకు 1,010 కిలోమీటర్ల మేర బీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీరం వెంబడి ఇచ్ఛాపురం నుంచి తడ వరకు 1,010 కిలోమీటర్ల మేర బీచ్ కారిడార్ నిర్మాణానికి 'భారత్ - మాల పరియోజన' ప్రాజెక్టు కింద చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం విముఖత చూపిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే బీచ్ కారిడార్‌ను ప్రాధాన్య క్రమంలో చేపట్టాలని నిర్ణయించింది.
ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం వరకు 250 కి.మీ., విశాఖ నుంచి నర్సాపూర్ వరకు 260 కి.మీ., నర్సాపూర్ నుంచి ఒంగోలు దాకా 260 కి.మీ., ఒంగోలు నుంచి తడ వరకు 240 కి.మీ., మేర టెక్నో- ఎకనమిక్ ఫీజబులిటీ అధ్యయనాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించింది. ప్రాధాన్య క్రమంలో తొలుత 282 కి.మీ. బీచ్ కారిడార్ రెండు లైన్లలో నిర్మాణం చేపడతారు. ఇందుకోసం రూ.3,660 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇటీవల ముఖ్యమంత్రి బీచ్ కారిడార్ నిర్మాణంపై సమీక్ష నిర్వహించడంతోపాటు వచ్చే ఏడాది మార్చి కల్లా నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాల్సిందిగా ఆదేశించారు.
తొలి దశలో 174 ఎకరాల భూసేకరణ..
తొలి దశలో భోగాపురం నుంచి భీమిలి దాకా 20 కి.మీ., రహదారి నిర్మాణానికి 174 ఎకరాల భూమి సేకరిస్తారు. భూ సేకరణకు రూ.50 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. విశాఖ నుంచి అడ్డారిపేట వరకు 85 కి.మీ. రహదారి నిర్మాణానికి 506 ఎకరాల కోసం రూ.159 కోట్లు అవుతుందని అంచనా. మచిలీపట్నం నుంచి ఓడరేవు వరకు 110 కి.మీ. రహదారి నిర్మాణానికి, రామయ్యపట్నం నుంచి మయిపాడు వరకు 67 కి.మీ. వరకు రెండు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రెండు చోట్లా భూ సేకరణ అవసరం లేదని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి టెక్నో-ఎకనమిక్ ఫీజబులిటీ అధ్యయనం కూడా పూర్తయిందని అధికారులు తెలిపారు.
బీచ్ కారిడార్‌లో చేపట్టే నిర్మాణాలివీ..
బీచ్ రోడ్డులో 14 మీటర్ల మేర వాణిజ్య కార్యకలాపాల జోన్ ఏర్పాటు
12 మీటర్ల మేర భవిష్యత్ అవసరాలకు విస్తరణ జోన్ ఏర్పాటు
4 మీటర్ల డక్ట్ ఆన్ ల్యాండ్‌వర్డ్ సైడ్
బీచ్ రోడ్డులో రెండు వైపుల2 మీటర్ల మేర సైకిల్ ట్రాక్
సముద్రం వైపు 2 మీటర్ల వాక్ వే ఏర్పాటు
పర్యాటకుల సందర్శనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు