
'కొడుకు డబ్బులిస్తే, తండ్రి కండువా వేస్తున్నారు'
సీఎం చంద్రబాబు దుష్టపాలన సాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.
హైదరాబాద్: సీఎం చంద్రబాబు దుష్టపాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ ఫిరాయించినవారిని కాపాడుకోవడానికి శాసనసభను వేదికగా చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అంబటి విలేకరులతో మాట్లాడుతూ... వాగ్దానాల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రజల మన్ననలు పొందలేకపోగా, వ్యతిరేకత మూటగట్టుకున్నారని అన్నారు.
మీడియా సహా అన్ని వ్యవస్థలను చంద్రబాబు, లోకేశ్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖర్చు గురించి టీడీపీ నేతలు ఎవ్వరూ ఆలోచించవద్దని, తానే ఖర్చుచేసి తానే గెలిపిస్తానని చంద్రబాబు చెప్పడంపై అంబటి ప్రశ్నలు సంధించారు. ఎన్నికలు ఖర్చు పది కోట్లైనా, ఇరవై కోట్లైనా చంద్రబాబు ఖర్చు పెడతారంటున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పార్టీ మారిన వారికి కొడుకు డబ్బులిస్తే, తండ్రి కండువా కప్పుతున్నారని ఆరోపించారు. డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామన్న భ్రమలో ఉన్నారని అన్నారు. చంద్రబాబును మిత్రపక్షం బీజేపీ అనుమానిస్తోందని వెల్లడించారు.
చంద్రబాబును వైఎస్ జగన్‌తో పోల్చడం భావ్యంకాదన్నారు. ఓటుకు కోట్లు కేసులో రూ. 50 లక్షలిచ్చి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని గుర్తుచేశారు. సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు అసెంబ్లీలో డివిజన్ ఓటింగ్‌కు ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు. 340 నిబంధన కింద ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీలో అధికార సభ్యులు ఎంత దూషించినా వైఎస్ జగన్ సంయమనంతో ప్రజా సమస్యలను ప్రస్తావించారని అంబటి రాంబాబు తెలిపారు.