4,200 స్కూళ్ల విలీనం!

4,200 schools merging! - Sakshi

     మరో 460 పాఠశాలల తరలింపు

     బోధనను మెరుగుపర్చే దిశగా విద్యాశాఖ లక్ష్యాలు

     కిండర్‌ గార్టెన్‌ పాఠశాలలుగా అంగన్‌వాడీ కేంద్రాలు

     ఇంటర్‌ వరకు మధ్యాహ్న భోజనం

     పాఠశాలల్లో తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు

     తమ లక్ష్యాలతో నివేదికలు అందించిన పలు విభాగాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2024 నాటికి 90 శాతం అక్షరాస్యతను సాధించాలని విద్యా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పాఠశాలలను హేతుబద్ధీకరించి, మెరుగైన విద్య అందేలా చూడాలని నిర్ణయించింది. విద్యార్థులు లేని, కొత్తగా విద్యార్థుల చేరికలు లేని 460 ప్రభుత్వ స్కూళ్లను మరో చోటికి తరలించాలని, ఇరవై మంది కంటే తక్కువున్న 4,200 స్కూళ్లను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అంగన్‌వాడీ కేంద్రాలన్నింటినీ కిండర్‌గార్టెన్‌ స్కూళ్లుగా మార్చాలని, ఇంటర్మీడియట్‌ వరకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. విద్యా శాఖలోనే కాదు అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆచరణలో సాధించి చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోంది.

శాఖల వారీగా నిర్దిష్టమైన లక్ష్యాలను చాటిచెప్పేలా ఈ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ‘విజన్‌ డాక్యుమెం ట్‌–2024’గా వ్యవహరిస్తున్న ఈ నివేదికను తెలుగులో ‘తెలంగాణ ఆచరణాత్మక నివేదిక’ గా పేర్కొంటోంది. సంక్రాంతికల్లా తుది నివేదికను సిద్ధం చేసేలా కసరత్తు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన ఆలోచనలకు అనుగుణంగా ఈ డాక్యు మెంట్‌ రూపకల్పన బాధ్యతను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మకు అప్పగిం చారు. దీంతో నివేదిక తయారీకి అవసరమైన సమాచారం కోసం రాజీవ్‌శర్మ ఇటీవల అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిం చారు. శాఖలవారీగా లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, అమలు దిశగా చేప ట్టాల్సిన కార్యాచరణపై డిసెంబర్‌ మూడో వారంలోగా నివేదికలు అందజేయాలని కోరారు. ఈ మేరకు 2024 లక్ష్యంగా పలు శాఖలు నివేదికలను అందించాయి. విద్య, వైద్యం, నీటిపారుదల, మున్సిపల్, మహిళా సంక్షేమ శాఖల నివేదికల్లోని పలు కీలక అంశాలివీ..

విద్యాశాఖలో భారీ లక్ష్యాలు
ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 66.46 శాతం అక్షరాస్యత నమోదైంది. 2024లోగా 90 శాతం అక్షరాస్యత సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. స్కూళ్లలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పాటించా లని.. అందుకోసం పాఠశాలలను క్రమ బద్ధీకరించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అసలు విద్యార్థులు లేని, చేరికలు లేని పాఠశాలలు 460 వరకు ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలున్నాయి. వాటిని క్రమంగా ఇప్పుడున్న చోటు నుంచి అవసరమున్న మరో చోటికి తరలించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు ఇరవై మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేస్తామని నివేదికలో వెల్లడించింది. ఇక 2024లోగా అంగన్‌వాడీ కేంద్రాలన్నింటినీ కిండర్‌గార్టెన్‌ స్కూళ్లుగా మార్చాలని ప్రతిపాదించింది. తెలుగు భాషకు ప్రాధాన్యమిచ్చే లక్ష్యాల్లో భాగంగా.. అన్ని పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలుగులోనే లేఖలు పంపాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఇంటర్‌ వరకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సూచించింది. పాలిటెక్నిక్‌ విద్యలో మార్పులు చేపట్టాలని, ఐటీఐలలో క్యాంపస్‌ సెలక్షన్లు జరిగేలా బలోపేతం చేయాలని ప్రతిపాదించింది. కెరీర్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, డిమాండ్‌ లేని కొన్ని కోర్సులను పూర్తిగా ఎత్తివేయాలని విద్యాశాఖ లక్ష్యాల్లో నిర్దేశించుకుంది.

అదనంగా  25 లక్షల ఎకరాలకు నీరు
రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరిస్తామని సీఎం కేసీఆర్‌ పలుమార్లు ప్రకటిం చారు. అడ్డంకులన్నీ తొలగిపోవటం, ఆశించిన స్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకోవటంతో.. 2024 నాటికి మరో 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు కూడా సాగునీటిని అందిం చేలా ఆ శాఖ కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని.. 954 టీఎంసీల గోదావరి నీటిని వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. నీటి సద్వినియో గానికి నీటిపారు దల శాఖను, వ్యవసాయ శాఖతో అనుసంధానం చేయాలని నివేదికలో ప్రతిపాదించింది.

పట్టణాల రూపు మార్చాలి
2024 కల్లా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని మున్సి పల్, పట్టణాభివృద్ధి శాఖ లక్ష్యంగా ఎంచు కుంది. హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా మార్చుతామని నివేదికలో పేర్కొం ది. విశ్వనగర అభివృద్ధిదిశగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళికను అమలు చేసి.. అధునాతన రోడ్లు నిర్మించాలని పొందు పరిచింది. బీసీల సమగ్ర అభివృద్ధికి బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని సంక్షేమ విభా గాలు  భవిష్యత్‌ ప్రణాళికలో పేర్కొన్నాయి. 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.5 లక్షల కోట్లకు చేరుతుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. ఆదాయవృద్ధి ఆధారంగా అంచనాలను  నివేదికలో పొందుపరచనుంది.

ప్రజల చెంతకు వైద్యం..
2024 నాటికి మొబైల్‌ హెల్త్‌ పేరుతో ప్రజల చెంతకే వైద్యారోగ్య సేవ లను విస్తరించాలని, గర్భిణులు, శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఐసీయూలు, ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచటం, జెనరిక్‌ మందులను ప్రోత్సహించే దిశగా భవిష్యత్తు ప్రణాళికలను పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 2024 నాటికి అన్నిరకాల పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తామని పేర్కొంది.

ఒక్క విద్యార్థీ లేని బడులు
మహబూబ్‌నగర్‌ జిల్లా: ఎంపీపీఎస్‌ పాలెం; ఎంపీపీఎస్‌ మాతం తండా; ఎంపీపీఎస్‌ కేస్లీ తండా; ఎంపీపీఎస్‌ ఎర్రవల్లి; ఎంపీపీఎస్‌ తూర్పుతండా; ఎంపీపీఎస్‌ నెమలిగుట్ట; ఎంపీపీఎస్‌ తెల్కపల్లి; ఎంపీపీఎస్‌ మున్య తండా; ఎంపీపీఎస్‌ కంసానిపల్లి
భద్రాద్రి జిల్లా: ఎంపీపీఎస్‌ గంగాబిషన్‌ బస్తీ, కొత్తగూడెం; ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మాదిగప్రోలు
మహబూబాబాద్‌ జిల్లా: పీఎస్‌ వెంకయ్య తండా; పీఎస్‌ చిన్నకిష్టాపురం
యాదాద్రి జిల్లా: జెడ్పీహెచ్‌ఎస్‌ రహీం ఖాన్‌పేట; జెడ్పీహెచ్‌ఎస్‌ ఉట్నూరు
జనగామ జిల్లా: పీఎస్‌ జానకీపురం; పీఎస్‌ దుబ్బతండా
వరంగల్‌ అర్బన్‌ జిల్లా: యూపీఎస్‌ పోలీసుగ్రౌండ్స్‌; పీఎస్‌ పలివేల్పుల 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top