ఇది పేదల రథయాత్ర!

Vardelli Murali Article On English Medium Education In Andhra Pradesh Govt Schools - Sakshi

జనతంత్రం

వాడొచ్చాడు. 
వాడి వెంట ఓ పిడికెడుమంది. చేతుల్లో కత్తులూ, బల్లేలు. పరాయి దేశం నుంచి వచ్చాడు. ఈ దేశంలో రాజుల దగ్గర, ధనవంతుల దగ్గర బోలెడంత నగా, నట్రా పోగుబడి వున్నాయని కథలు కథలుగా విని ఉన్నాడు. అవి దోచుకుందామని ఒక దండును తయారుచేసుకుని బందిపోటు దండయాత్రకు బయల్దేరి వచ్చాడు. 

వాడు చూశాడు. 
ఈ దేశంలో వున్న నదులు, పర్వతాలు, మనుషులూ, ఆ మనుషుల్లో వున్న నిట్టనిలువు చీలిక వాడికి కనిపించాయి. రాజ్యం–అధికారం, విద్య–ఉద్యోగం, సిరి సంపదలన్నీ మనుషుల్లో కొంతమంది భోజ్యమేనని అర్థ మైంది. నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థలో అవకాశాలు– ఆనందాలు పై మూడు మెట్లవే. కింది మెట్లన్నీ శ్రామికులు, సేవకులు. కింది మెట్లంటే పైమెట్లకు తూష్ణీభావం, అసహ్యం. పైమెట్లంటే కింది మెట్లకు భయం, కనిపించని కోపం. ఎట్టి పరిస్థితుల్లోనూ పైమెట్లకు అండగా కిందిమెట్లు నిలబడే అవకాశం లేదని స్పష్టమైంది. 

వాడు గెలిచాడు. 
ఈ దేశం అనాటమీ అర్థమైన తర్వాత వాడి మూతిమీద ‘హాసం’ మొలిచింది. దోచుకోవడం మొదలుపెట్టాడు. నగా–నట్రా, గుళ్లూ–గోపురాలు, వ్యాపారులు– దండనాధులు, మంత్రులు–సామంతులు... అదే వరసలో రాజ్య సింహాసనాలను దోచుకున్నాడు. దొంగలా కాదు. దొరలాగా. దేశం వాడికి దాసోహమయింది. వాడిక్కడే స్థిరపడిపోయాడు. కొన్ని శతాబ్దాల తర్వాత మరొకడు. 

వాడొచ్చాడు. 
వాడి వెంట కొన్ని ఓడలొచ్చాయి. వాటినిండా వస్త్రాలు, వినియోగ వస్తువులు. అమ్ముకోవడానికి వచ్చాడు. అప్పటికే ఆవిరి యంత్రాన్ని కనిపెట్టాడు. అచ్చు యంత్రాన్ని, మరమగ్గాన్ని కనిపెట్టాడు. కుట్టుమిషను తయారుచేశాడు. వెలిగే బల్బును కనుగొన్నాడు. ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. అమ్ముకోవడానికి వాడి మార్కెట్‌ సరిపోలేదు. అందుకే ఇక్కడకు వచ్చాడు. 

వాడు చూశాడు. 
ఢిల్లీ సింహాసనం బలహీనపడుతున్నది. ఎక్కడికక్కడ స్వతంత్ర రాజ్యాలు, పరస్పర యుద్ధాలు. ఇక మన నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థ చెక్కుచెదరకుండా మునుపటిలాగానే ఘనీభవించి కనిపించింది. రాజులు మారినా, రాజ్యాలు మారినా మెజారిటీ ప్రజలైన శ్రామికుల జీవితాల్లో ఏమార్పూ వుండదు కాబట్టి రాజ్యం పట్ల వారి నిర్లిప్త ధోరణి ఏమాత్రం మారలేదు. మారే అవకాశం కూడా లేదని వాడు రూఢీ చేసుకున్నాడు. 

వాడు గెలిచాడు. 
సరుకులతో వచ్చిన ఓడలు రేవుల్లో అలాగే వున్నాయి. మరో విడత మరికొన్ని ఓడలొచ్చాయి. వాటిలో సరుకులకు బదులు తుపాకులొచ్చాయి. ఆ తుపాకీ పవర్‌ను వాడు చూపెట్టాడు. ఆ తర్వాత సరుకులు దిగాయి. సైనికులు దిగారు. అధికారులు దిగారు. పరిపాలించడం మొదలుపెట్టాడు. 
...
వాడికిప్పుడు బోలెడు మాయోపాయాలు. లెక్కలేనన్ని మారువేషాలు. మన పిల్లల ఆట బొమ్మల్లో వాడున్నాడు. ఎగరేసే గాలిపటంలో ఉన్నాడు. చేతికీ, చెవికీ అనుసంధానమైపోయిన మొబైల్‌ ఫోనూ వాడే. మనం పండించిన కూరగాయలు వాడి పొట్లంలో మనింటికి వస్తున్నాయి. మనం పండించిన పత్తితో, మనం తయారుచేసిన బట్టతో మనం కుట్టిన చొక్కా వాడి సంతకంతో మన వంటిపైకి వస్తున్నది. మనం ఉదాసీనంగా ఉంటే క్రమంగా వాడు లోబరుచుకుంటాడు. ఈసారి కత్తులతో, తుపాకులతో కాదు... టెక్నాలజీతో, సైన్స్‌తో, విద్యతో, మేధతో.. ఈ రంగాల్లో మనం వాడికంటే మిన్నగా వుంటే, వాడినే మనం లోబరుచు కుంటాము. మన మార్కెట్‌ విస్తరిస్తుంది. మన ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. 

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన విద్యారంగాన్ని సంస్కరించుకొని, కొత్తగా విస్తరిస్తున్న శాస్త్ర, సాంకేతిక పాఠ్యాంశాల అభ్యసనానికి మన విద్యార్థులను సమాయత్తం చేయడం ద్వారా మాత్రమే అభివద్ధి లక్ష్యాలను మనం అందుకోగలుగుతాము. చరిత్ర మలుపులు తిరిగే కీలక ఘట్టాల్లో మనం చాలాసార్లు ఓడిపోయాము. ఇప్పుడు గెలుద్దాం ప్లీజ్‌. ఇప్పుడు గెలిస్తేనే ఈ డిజిటల్‌ యుగం మన పాదాక్రాంతమవుతుంది. మన జనాభా, మన యువశక్తే మనకు బలం. యువతరానికి, విద్యార్థులకు ఎటువంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు కల్పించినట్లయితేనే ఎక్కువ సంఖ్యలో విజ్ఞాన సైనికులను మనం తయారుచేసుకోగలుగుతాము. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి కొత్త టెక్నాలజీ కోర్సుల్లో పట్టు సాధించాలంటే పాఠశాల స్థాయిలోనే సైన్స్, మ్యాథమేటిక్స్‌ వంటి సబ్జెక్టుల్లో మన పిల్లలందరూ రాటుదేలాలి. మనం ఔనన్నా కాదన్నా కంప్యూటర్‌ భాష ఇంగ్లీష్‌, సైన్స్‌ భాష ఇంగ్లీష్‌, లెక్కల భాషా ఇంగ్లీష్‌. ప్రైవేట్‌ స్కూళ్లలో చదువు ‘కొనగలిగిన’ కొంతమందికి మాత్రమే, వాటి సొంత భాషలో ఆ సబ్జెక్టులను బోధిస్తున్నాము. దాంతో ఆ విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. 

ఇక్కడ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని ప్రబోధిస్తున్న వారు గమనించవలసిన విషయం ఒకటున్నది.  తెలుగు పేరుతో మనం సైన్స్, మ్యాథమెటిక్స్‌ వంటి సబ్జెక్టుల్లో వాడుతున్న పదాలు నిజంగా తెలుగేనా? అటు తెలుగూ కాని, ఇటు సంస్కృతమూ కాని ఒకరకమైన కృతక భాష ఈ పాఠ్యాంశాల నిండా పరుచుకుని వుంటున్నది. soil erosion అనే ఇంగ్లీష్‌ మాటను మన తెలుగు పాఠ్యపుస్తకంలో ‘మృత్తికా క్రమక్షయం’ అని చదువుకోవాలి. ఇది అమ్మ మాట్లాడే తెలుగేనా, అయ్య మాట్లాడే తెలుగేనా? స్నేహితులూ, సమాజం మాట్లాడే తెలుగేనా? infrared raysను ‘పరారుణ కిరణాలు’ అని చదువుకోవాలి. అలా చదువుతున్న ప్పుడు పాఠశాల స్థాయి విద్యార్థికి కిరణాలు పరారయ్యా యని అర్థమైతే తప్పెవరిది? గణితశాస్త్రంలోMode అనే కాన్సెప్ట్‌ను తెలుగులో ‘బహుళకము’ అని చదవాలి. పొరపాటున భల్లూకము అని గుర్తుపెట్టుకుని దాని అర్థాన్ని డిక్షనరీలో వెతికినప్పుడు ఆ విద్యార్థి పరిస్థితి ఎలా వుంటుంది. అపెండిక్స్‌ అంటే ‘ఉండూకము’ అట. (టెన్త్‌ క్లాస్, జీవశాస్త్రం). మనకు మండూకము తెలుసు. ఈ ఉండూకము ఎక్కడిదో! ఇటువంటి అనేక వింత అనువాదాలు తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఉంటాయి. ఈ పదాలను గుర్తుపెట్టుకోవడం ఇంగ్లీష్‌ పదాలను గుర్తుపెట్టుకోవడం కంటే కష్టమని చెప్పడానికే వీటి ప్రస్తావన తప్ప ఎగతాళి కాదు. పైథాగరస్‌ సిద్ధాంతాన్ని గానీ, ఆర్కిమెడిస్‌ సూత్రాన్ని గానీ తెలుగులో చదువుకునే విద్యార్థి చాలా సహజంగా దాన్ని బట్టీకొట్టడానికే ప్రయతి్నస్తాడు తప్ప కాన్సెప్ట్‌ మీద శ్రద్ధపెట్టడం ఆ వయసులో కష్టం. ఇన్ని ఇబ్బందులను అధిగమిస్తూ తెలుగు మీడియంలో చదివి రాణించిన విద్యార్థులందరికీ, వారి రెట్టింపు కష్టానికీ జేజేలు. సైన్స్, మ్యాథ్స్‌ పాఠ్యాంశాల్లోని సూత్రాలనూ, పదాలను మనం కృతక భాషలో నేర్పుతున్నాము తప్ప మాతృభాషలో కాదని భాషాభిమానులు గ్రహించాలి. 

మాతృభాషలో విద్యాబోధన జరగకపోతే ఆ భాష అంతరించిపోతుందని చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారం లేదు. హైదరాబాద్‌ రాజ్యాన్ని నాలుగు దశాబ్దాలపాటు కుతుబ్‌షాహీలు, అసఫ్‌ జాహీలు పాలించారు. ఆ కాలంలో ఉర్దూ బోధనా భాష. అసఫ్‌జాహీల కాలంలోనైతే తెలుగు పూర్తిగా నిరాదరణకు గురైంది. ఈ నేపథ్యంలో ముడుంబా వేంకట రాఘవాచార్యులు తన రచనలో ఒకచోట నిజాం రాజ్యములో ఆంధ్ర కవులు పూజ్యము అని రాశారట. అందుకు నొచ్చుకున్న సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవులు, వారి తెలుగు కవితలు గోలకొండ పత్రికలో ప్రచురించి ఆత్మాభిమాన ప్రకటన చేశారు. తెలుగు సాహిత్యంలో అగ్నిధారలు కురిపించి, రుద్రవీణలు పలికించిన దాశరథి కృష్ణమాచార్యులు ఉర్దూ మీడియంలో చదువుకున్నవాడే. చిల్లర దేవుళ్లు నవలతోపాటు నాలుగు వేదాలకు భాష్యం చెప్పిన ఆయన సోదరుడు దాశరథి రంగాచార్య చదివింది కూడా ఉర్దూలోనే. తెలుగు సినీ సంగీతానికి రసరమ్య గీతాలను కూర్చి, విశ్వంభర, కర్పూర వసంతరాయలు వంటి శ్రేష్ఠ కావ్యాలను రచించి తెలుగువారికి జ్ఞానపీఠాన్ని అందించిన డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి కూడా ఉర్దూ మీడియంలోనే చదివారు. పధ్నాలుగు భాషల్లో ప్రావీణ్యం సాధించి విశ్వనాథ వారి వేయిపడగలు నవలను హిందీలోకి అనువదించిన పి.వి. నరసింహారావు ఉర్దూ విద్యార్థే. ఇలా చేంతాడంత జాబితాకు సరిపోయే వివరాలున్నాయి. కనుక ఇంగ్లీష్‌ మీడియం బోధన వలన తెలుగు భాష అంతరించిపోతుందనే అభిప్రాయం సరైనది కాదు.  

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధనను కచ్చితంగా వ్యతిరేకించనూ లేక, స్వాగతించడానికి మన సొప్పక కొందరు నాయకులు మూలుగుతూ ముక్కుతున్న మూలశంక ఏమిటంటే ఎకాఎకిన ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చేస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలు చెప్పగలరా? అని. ఎకాఎకిన మార్చడం లేదు. తొమ్మిది నెలల ముందుగానే విధాన ప్రకటన వెలువడింది. సన్నద్ధతకు సంబంధించిన విధివిధానాలు రూపొందుతు న్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అందుబాటులో వున్న లెక్కల ప్రకారం 3,26,927 మంది ఉపాధ్యాయులు  పాఠాలు చెబుతున్నారు. వీరిలో 2,07,713 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు. 1,19,666 మంది ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్నారు. ఈ మొత్తం సంఖ్యలో బీ.ఎడ్‌ లేదా తత్సమాన డిగ్రీ, ఎమ్‌ఎడ్‌ లేదా తత్సమాన డిగ్రీ ఉన్నవాళ్లు దాదాపుగా రెండు లక్షలు. డీఎడ్‌ కోర్సు చేసినవారు సుమారు 55 వేలమంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వారందరికీ ఈ అర్హతల్లో ఏదో ఒకటి ఉంది. కానీ, ప్రయివేట్‌ టీచర్లలో 50 వేలమందికి మాత్రమే ఎడ్యుకేషన్‌ శిక్షణకు సంబంధించిన అర్హత ఉన్నది. వారు కూడా డీఎస్‌సీలో ఎంపిక కాకపోవడం వల్లనో, నగరాల్లో ఉండాలన్న కోరిక వల్లనో ఉన్నవారు మాత్రమే. ఈ గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశా లల్లో పనిచేస్తున్న టీచర్లందరూ కూడా సుశిక్షితులైనవారే. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ– విద్యార్థి నిష్పత్తి 1:21గా ఉంటే, ప్రయివేట్‌లో అది 1:29గా వున్నది. అందువల్ల ప్రభుత్వ టీచర్ల బోధనా ప్రమాణాల పట్ల ఎటువంటి బెంగా అవసరం లేదు. 

ఈ సందర్భంలో ముందుకొచ్చిన అత్యంత కీలకమైన అంశం సామాజిక న్యాయం. రాష్ట్రంలోని పేద ప్రజలకు మిత్రుడెవరో, శత్రువెవరో ఈ ఎపిసోడ్‌ తేటతెల్లం చేసింది. హైస్కూల్‌ స్థాయిలోనే ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకున్న విద్యార్థులకు ఉన్నతమైన అవకాశాలు లభిస్తున్నాయని జీవితానుభవం ద్వారా గ్రహించిన అనేక మంది పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తలకు మించిన భారమైనా తాము కొవ్వొత్తుల్లా కరిగిపోతూ బిడ్డలకోసం వెలుగునిచ్చే ప్రయత్నంలో ప్రయివేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. అలాంటి లక్షలాది మంది తల్లిదండ్రులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంగ్లీష్‌ బోధనపై తీసుకున్న నిర్ణయం గొప్ప ఊరటనిచ్చింది. ప్రయివేట్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ బోధనకు అభ్యంతరం చెప్పని ప్రతిపక్ష నేతలు, మీడియా అధిపతులూ, వగైరాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ అనేసరికి శివాలెత్తడంపై ప్రజలకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. పేద పిల్లలంతా ఇంగ్లీష్‌ చదువులు చదివి పైస్థాయికి వెళ్లిపోతే తమకు సేవలు చేసేందుకు నౌకర్లు, చాకర్లు దొరకరని పెత్తందార్లు భయపడుతున్నారని పేదప్రజలు అనుమానిస్తున్నారు. వారిలో ఇప్పుడు నవచైతన్యం వెల్లివిరుస్తున్నది. పేద బిడ్డలకు మంచి చదువులను అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నించినా జగన్నాథ రథచక్రాలకు ఎదురువెళ్లె దుస్సాహసం చేసినట్టే. అలా చేసినవారు రథచక్రపుటిరుసులలో పడి నలగక తప్పదు.

వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top