స్వచ్ఛ భారతానికి ఉమ్మడిగా కృషి

Singapore Prime Minister Lee Hsien Loong Article On Mahatma Gandhi - Sakshi

నేటినుంచి మహాత్ముడి 150వ జయంతి వేడుకలు ప్రారంభం 

పారిశుభ్రతకు జాతీయప్రాధాన్యం ఇచ్చిన మహాత్ముడి మార్గంలోనే సింగపూర్‌ ప్రయాణించి లక్ష్య సాధనలో విజయం సాధించింది. నేడు పరిశుభ్ర వాతావరణం సృష్టించి, ప్రజారోగ్యం కాపాడే దిశగా కృషి చేస్తున్న భారత్‌కు సహకరించడానికి సింగపూర్‌ సిద్ధంగా ఉంది. భారత్‌తో పోల్చితే  సింగపూర్‌ అతి చిన్న దేÔ]lమే అయినా  సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా రెండు దేశాల ప్రయాణాల్లో పోలికలున్నాయి.

2019 నాటికి ‘పరిశుభ్ర భారతదేశం’ అనే లక్ష్య సాధనకు స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ ఉద్యమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. 2019 అక్టోబర్‌ రెండు మహాత్మా గాంధీ 150వ జయంతి కావడంతో అప్పటికి లక్ష్యం సాధించాలని నిర్ణ యించారు. పారి శుద్ధ్యాన్ని జాతీయ ప్రాధాన్యం గల అంశంగా మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ ప్రోత్సహించారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ విషయంలో భారత్‌ గొప్ప పురోగతి సాధించింది. దేశంలోని కోట్లాది ప్రజల కోసం ఎనిమిది కోట్ల 60 లక్షలకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. దాదాపు ఐదు లక్షల (4,70,000) గ్రామాలను ఆరు బయలు మల విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించారు. సింగపూర్‌ కూడా ఇదే మార్గంలో నడిచింది. మాకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ మా ప్రజల కోసం పరిశుభ్ర, పచ్చని వాతావరణం కల్పించడానికి మేమెంతో కష్టపడి పనిచేశాం. తొలి రోజుల్లో అనేక ఇళ్లకు మురుగునీటి సౌకర్యాలు లేవు. మలాన్ని బకెట్లతో సేకరించి బాగా చెడు వాసన వచ్చే లారీల్లో దాన్ని మురుగు శుద్ధి ప్లాంట్లకు రవాణా చేసేవారు.

అయితే, తరచు మానవ వ్యర్థాలను దగ్గరలోని కాలవలు, వాగులు, నదుల్లో పడేసేవారు. దీంతో వీటి జలాలు కలుషితమయ్యేవి. అపరిశుభ్ర జీవన పరిస్థితులు ఎన్నో ప్రజారోగ్య సమస్యలకు కారణమయ్యాయి. తరచు నీటి వల్ల కలిగే వ్యాధులు ప్రబలడానికి దారితీశాయి. ఈ పరిస్థితుల్లో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మా దేశ నిర్మాతలు నిర్ణయించారు. ‘పరిశుద్ధ సింగపూర్‌’ లక్ష్య సాధనకు వారు జాతీయస్థాయి ప్రచారోద్యమం ప్రారంభించారు. మేం ప్రతి ఇంటినీ శుభ్రం చేసుకున్నాం. మా నదులనూ పరిశుభ్రం చేశాం. ఈ క్రమంలో మేం వేలాది మంది ఆక్రమణదారులను ఖాళీచేయించాం. పెరటి పరిశ్రమలను, పందుల పెంపకం దొడ్లను, ఇంకా నదీపరీవాహక  ప్రాంతంలో కాలుష్యానికి కారణమైన ఎన్నింటినో తొలగించాము. ఇంతటి కృషి ఫలితంగా నేడు స్వచ్ఛమైన సింగపూర్‌ నది నగరం గుండా ప్రవహిస్తూ మరీనా రిజర్వాయర్‌లో కలుస్తోంది. ఈ జలాశయమే మా జాతీయ నీటి సరఫరా వ్యవస్థకు ఆధారం. 

వైవిధ్యభరిత భారతం!
సింగపూర్‌తో పోల్చితే ఎంతో వైవిధ్యభరిత దేశం భారత్‌. సింగపూర్‌ నది కంటే గంగా నది దాదాపు వెయ్యి రెట్లు పెద్దది. అయినా, పరశుభ్రత వైపు సాగిన ప్రయాణంలో భారత్, సింగపూర్‌లకు కొన్ని పోలికలున్నాయి. మొదటిది, రెండు దేశాల అనుభవాలు దేశ దార్శనికత, నాయకత్వం ప్రాధాన్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. దివంగత సింగపూర్‌ ప్రధానమంత్రి లీ కాన్‌ యూ, భారత ప్రధాని నరేంద్రమోదీలు ఇరువురూ తమ దేశాలు పరిశుభ్రంగా, ఆకుపచ్చగా ఉండాలన్నది తమ ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. ఈ విషయంలో ప్రజలను సమీకరించి, వారిలో చైతన్యం పెంచడానికి జన చేతన ఉద్యమాలను స్వయంగా నడిపించారు.  ప్రజలతో కలిసి ఈ ఇద్దరు నేతలూ చీపుర్లు చేతపట్టి వీధులు ఊడ్చారు.

లీ తనకు వ్యక్తిగతంగా ప్రేరణ అనీ, మన జీవనశైలిలో మార్పు ద్వారానే దేశంలో మార్పు మొదలవుతుందనే లీ ఆలోచన నుంచి తాను స్ఫూర్తి పొందానని ప్రధాని మోదీ చెప్పారు. ఈ రకంగా చూస్తే, వాస్తవానికి స్వచ్ఛ భారత  ఉద్యమం కేవలం భారతదేశంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం మాత్రమే కాదు, మన ఆలోచన, మన పని, మన జీవన విధానంలో పరివర్తన తెచ్చే లోతైన సంస్కరణగా పరిగణించాలి. ఇక రెండో విషయం, జాతీయస్థాయిలో దీర్ఘకాలిక నిబద్ధత ఉంటేనే ఏ విషయంలోనైనా విజయం సాధించడం వీలవుతుంది. మా మురుగునీరు, నీటిపారుదల వ్యవస్థలను వేరుచేసి సింగపూర్‌ సర్కారు సూవరిజ్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసింది. వర్షపు నీరు కలుషితం కాకుండా నివారించడం, ఈ నీటిని సేకరించి సద్వినియోగం చేసుకోవడమే దీని లక్ష్యం. అదే సమయంలో సింగపూర్‌లో ఒకసారి వాడిన నీటిని మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుభ్రం చేసి మళ్లీ ఉపయోగిస్తున్నారు.

ఈ నీటిని రివర్స్‌ ఆస్మాసిస్‌  పద్ధతి ద్వారా శుద్ధి చేసి మంచి తాగు నీరు ఉత్పత్తి చేస్తున్నారు. ఇది అత్యంత పరిశుభ్రమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన మంచి నీరు. అయితే, ఒకసారి వాడిన నీటిని ఏం చేయాలనే సమస్య తలెత్తింది. దీనికి పరిష్కారం దొరికింది. ఇది నీటి కొరత అనే మరో సమస్యకు పరిష్కారమార్గమైంది.  భారతదేశంలో పారిశ్రామిక సంస్థలు, పాఠశాలలు వంటి వివిధ వర్గాల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఉద్యమ రూపంలో ముందుకు సాగడం ఆశాజనకమైన ఫలితాలనిచ్చింది. 2006 నాటికి ఇండియాలో 50 శాతం పాఠశాలల్లో మాత్రమే పారిశుద్ధ్య సౌకర్యాలుండేవి. అయితే, ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని స్కూళ్లలో మరుగుదొడ్లు వంటి అన్ని రకాల పారిçశుద్ధ్య ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వివరాలను ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌ 2018 సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అనే అంశాలపై విడుదల చేసిన ప్రపంచ బేస్‌లైన్‌ నివేదికలో వెల్లడించింది. 

అంతర్జాతీయ సహకారానికే పెద్ద పీట!
ఇక మూడో అంశం ఏమంటే, సింగపూర్, భారతదేశం రెండూ అంతర్జాతీయ సహకారానికి విలువనిస్తాయి. ఒక సమస్యకు ఒక దేశంలో అమలు చేసే పరిష్కారమార్గం మరో దేశంలో పనిచేయకపోవచ్చు. అయితే, మనం ఇతర దేశాల నుంచి విషయాలు నేర్చుకోవడం, వారి అనుభవాలను తెలుసుకోవడం వల్ల మనమంతా ప్రయోజనం పొందవచ్చు. మహాత్మాగాంధీ ప్రారంభ అంతర్జాతీయ పారిశుద్ధ్య సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు భారతదేశాన్ని నేను అభినందిస్తున్నాను.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య నిపుణులు, ఉద్యమకారులు, నాయకులను ఈ సదస్సు ఒక చోటకు చేర్చింది. వారంతా తమ అనుభవాల గాథలను పంచుకున్నారు. సింగపూర్‌ కూడా ప్రపంచ నగరాల ద్వైవార్షిక శిఖరాగ్రసభ, అంతర్జాతీయ జల వారోత్సవం వంటి అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తోంది. పారిశుద్ధ్యరంగంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలుపై అవగాహన కల్పించడానికి ‘అందరికీ పరిశుభ్రత’ అనే సింగపూర్‌ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి 2013లో ఆమోదించింది. అంటే, నవంబర్‌ 19ని ప్రపంచ టాయ్‌లెట్‌ దినంగా పాటించాలనే సింగపూర్‌ ఆలోచనకు ఐరాస మద్దతు పలికింది. 

భారత్‌తో అనుభవాలను పంచుకోవడం ఆనందదాయకం
భారత్‌తో మరింత మెరుగైన జీవనానికి, దేశవ్యాప్తంగా ప్రగతి సుస్థిరంగా నిలిచే స్మార్ట్‌ నగరాల అభివృద్ధికి తన కృషి కొనసాగిస్తున్నందున సింగపూర్‌ తన అనుభవాలను భారత్‌తో పంచుకోవడం ఆనందదాయక అనుభవంగా భావిస్తోంది. నగర ప్లానింగ్, నీటిసరఫరా, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై వందలాది మంది అధికారులకు శిక్షణ ఇవ్వడానికి భారతదేశ టౌన్, కంట్రీ ప్లానింగ్‌ సంస్థతో కలిసి సింగపూర్‌ పనిచేస్తోంది. తమ నగరాల అభివృద్ధికి కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు సహకరించడానికి, పరిష్కారమార్గాలు సూచించడానికి సింగపూర్‌ సిద్ధంగా ఉంది. స్వచ్ఛ భారత్‌ విషయంలో భారత ప్రజలకు, నరేంద్రమోదీకి శుభాకాంక్షలు. రాబోయే తరాలకు శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం అందించాలన్న ఐరాస లక్ష్యాల సాధనలో రెండు దేశాల మధ్య మరింత సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను.

లీ సియస్‌ లూంగ్‌
సింగపూర్‌ ప్రధాని

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top