అపరిమితాధికారం.. అతి ప్రమాదకరం

Shekhar Gupta Article On Ajit Doval Promotion - Sakshi

జాతిహితం

ఇండియాలో అత్యంత శక్తిమంతమైన భద్రతా వ్యవస్థకు అధిపతిగా అజిత్‌ దోవల్‌ అవతరించారు. అయితే, అధికారాలన్నీ ఆయన చేతిలో కేంద్రీకృతం చేయడంతో దొంతరల రూపంలో ఉన్న మన భద్రతా వ్యవస్థకు కీడే జరుగుతుంది. ఇందిర హయాంలో మాదిరిగా దేశ భద్రత విషయంలోప్రధానికే సర్వాధికారాలు ఇస్తే, కీలకమైన కేంద్ర మంత్రులు రబ్బరు స్టాంపులుగా మారతారు! ఇది కేవలం ఉన్నతాధికార ప్రభుత్వ వ్యవస్థలో ఎవరు పైన, ఎవరు కింద అనే అధికార దొంతరల సమస్య కానే కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ ప్రధాన విషయంలో గట్టి చర్చ అవసరం.

భారత ప్రభుత్వంలోని భద్రతా వ్యవస్థను భూమితో పోల్చవచ్చు. మార్పులకు అనుకూలంగాని పొరలతో కూడిన ఈ వ్యవస్థలో భూమిలో మాదిరిగానే మార్పులు అతి స్వల్పంగా ఉంటాయి. భూమిలోని పొరల మధ్య తీవ్ర రాపిడి ఉంటే కొంప మునుగుతుంది. భారత భద్రతా వ్యవస్థలో హఠాత్తుగా మార్పు తెస్తే అదే పద్ధతిలో ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రధాని నరేం ద్రమోదీ ఓ నోటిఫికేషన్‌ ద్వారా హడావుడిగా ఇంతటి మార్పునకు కారణమయ్యారు. దీంతో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ కుమార్‌ దోవల్‌ నాయకత్వంలోని దేశ భద్రతా విధాన నిర్ణయ గ్రూపు(ఎస్పీజీ) కొత్త రూపు సంతరిం చుకుంది. దీని 18 మంది సభ్యుల్లో ఎప్పటిలాగానే త్రివిధ దళాల(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) అధిప తులు, ఇద్దరు నిఘాసంస్థల(ఐబీ, రా) అధిపతులు, రక్షణ, హోం, ఆర్థిక, అంతరిక్ష శాఖల కార్యదర్శులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్, నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్, రెవెన్యూ కార్యదర్శి, ఇంకా దేశంలోనే అత్యంత సీనియర్‌ సివిల్‌ సర్వెంట్‌ అయిన కేబినెట్‌ కార్యదర్శి కూడా సభ్యులుగా ఉంటారు. కేబినెట్‌ సెక్రెటరీ రాజ్యాం గబద్ధమైన పదవి కాగా, ఎన్‌ఎస్‌ఏకు అలాంటి హోదా లేదు. కొత్త నోటిఫికేషన్‌ ప్రకారం ఎస్పీజీ సమావేశానికి ఏ ఇతర మంత్రిత్వశాఖ కార్యదర్శు లనైనా రమ్మని ఆదేశించే అధికారం ఎన్‌ఎస్‌ఏకు ఉంటుంది. రెండోది, ఎస్పీజీ నిర్ణయాలను కేంద్ర మంత్రిత్వశాఖలు/విభాగాలు అమలు చేయడాన్ని కేబినెట్‌ సెక్రెటరీ సమన్వయం చేస్తారు. మూడోది, ఈ నోటిఫికేషన్‌పై సంతకం చేసింది ప్రధాని కార్యా లయం(పీఎంఓ) లేదా కేబినెట్‌ సెక్రెటేరియట్‌లోని సంబంధిత అధికారి కాదు. జాతీయ భ్రదతా మండలి(ఎన్‌ఎస్‌సీ)లోని జాయింట్‌ సెక్రెటరీ సంత కంతో ఇది విడుదలైంది.

ఎస్పీజీని మొదట 1999 ఏప్రిల్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం తొలుత ఏర్పాటు చేసింది. కాని, తేడా ఏమంటే అప్పుడు ఇది కేబినెట్‌ కార్యదర్శి సారథ్యంలో ఉండడమే. అప్పట్లో ఎన్‌ ఎస్‌ఏ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు దీనికి ప్రత్యేక ఆహ్వానితులు. ఈ సంస్థ(ఎస్పీజీ) కేబినెట్‌ సెక్రెటేరియట్‌ నుంచి పనిచేసేది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం దీని కార్యస్థలాన్ని జాతీయ భద్రతా మండలి సచివాలయానికి (ఎన్‌ఎస్‌సీఎస్‌)కి మార్చారు. దీనికి సారథ్యం వహించాల్సిన కేబినెట్‌ కార్యదర్శి దీని సభ్యునిగా మారడమేగాక, దాని నిర్ణయాలు అమలుచేసే అధికారి అయ్యారు. ఎస్పీజీ కొత్త అధిపతి ఎన్‌ఎస్‌ఏ. ఇది పెద్ద మార్పు. ఈ మార్పులను చూశాక, ‘కేబినెట్‌ క్లర్క్‌’ ఇప్పుడు ‘ఎన్‌ఎస్‌సీఎస్‌ క్లర్క్‌’గా అవరించాడని వ్యాఖ్యానిం చక తప్పదు. ఇలాంటి విచిత్రమైన మార్పుల వల్ల అత్యంత సున్నితమైన రంగంలో అతి తెలివి ప్రదర్శి ంచడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఇది కేవలం ఉన్నతాధికార ప్రభుత్వ వ్యవస్థలో ఎవరు పైన, ఎవరు కింద అనే అధికార దొంతరల సమస్య కానే కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ విషయంలో గట్టి చర్చ అవసరం. కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలు తీసుకునే అధికారం కేబినెట్‌ సెక్రెటేరియట్‌ నుంచి ఎనెస్‌సీఎస్‌కు బదిలీ చేయ డమే ఇక్కడ అత్యంత ప్రధాన మార్పు. కేబినెట్‌ సెక్రె టేరియట్‌లోనే పరిశోధన, విశ్లేషణ విభాగం(ఆర్‌ఏడ బ్ల్యూ–రా) ఉంటుంది. రాకు నిధులకు కూడా అక్కడి నుంచే వస్తాయి. ఎస్పీజీ నిర్ణయాలను కేబినెట్‌ సెక్రె టరీ అమలు చేస్తారు కాబట్టి సాంకేతికంగా చూస్తే పూర్వ స్థితి కొనసాగుతుందనిపిస్తుంది. కాని, అధి కారం ఆయన చేతిలోనో, కేబినెట్‌ చేతిలోనో ఉండదు. భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రధా నికి కీలక సలహాదారు ఎన్‌ఎస్‌ఏ కావడంతో తనకు అప్పగించిన అధికారంపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఆయనకు ఉందని చెప్పవచ్చు. అయితే, ఇలాంటి మార్పునకు కేంద్ర సర్కారులో కీలకమైన ఈ వ్యవస్థ తేలికగా అలవాటు పడుతుందా?
 
చర్చనీయాంశాలు చాలా ఉన్నాయి!
ఈ మార్పు వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలపై చర్చనీయాంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఈ మార్పు కేంద్ర హోం, రక్షణ, ఆర్థిక మంత్రుల అధి కారాన్ని బలహీనపరచదా? వారి అధికారులు, త్రివిధ దళాల అధిపతులు వాస్తవానికి ఎస్పీజీ సమా వేశం నిర్ణయాలను వారికి తెలిపితే, కేబినెట్‌ కార్య దర్శి వాటిని అమలు జరిగేలా చూస్తారు. రెండు, భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఎస్‌)కు ఇక చేయడానికి పనేమి ఉంటుంది? కేబినెట్‌ తరహా పాలనా వ్యవస్థలో ఉమ్మడి బాధ్యత అత్యంత కీలకం. అంటే సీసీఎస్‌ సభ్యులందరికీ ఎలాంటి కీలకాం శంపైనైనా మాట్లాడవచ్చు. వారి మాటకు విలువ ఉంటుంది. అలాగే వారంతా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. వారిలో ప్రధాని మాటకు ఎక్కువ విలువ అని చెప్పాల్సిన పనిలేదు. సీసీఎస్‌లో భిన్నా భిప్రాయం, చర్చ ఎంతో అవసరం, ఆరోగ్యకరం. ప్రధాని అధికార పరిధికి లోబడి పనిచేసే త్రివిధ దళా ధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన భారీ ఎస్పీజీ తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు చర్చగాని, భిన్నాభిప్రాయం చెప్పడంగాని సాధ్యమా? ఏదైనా అంశంపై ప్రధాని అభిప్రాయం అప్పటికే తెలిస్తే– దానిపై వారేం చర్చిస్తారు? అంటే మిగిలిన నాలుగు బడా శాఖల(హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగం) మంత్రులు కేవలం రబ్బరు స్టాంపులుగా మారి పోతారు కదా? మూడోది, ఇది జరిగేది కాదను కోండి. అదేమంటే, రక్షణ బలగాల ఉమ్మడి అధిపతి నియామకం లేదా ఈ అవసరంపై చర్చ ఇక ఈ తాజా మార్పు వల్ల ఉండదు. బలమైన ప్రధాని ఉన్న ప్పుడు నిర్ణయాలు పై నుంచి కిందకే గాని, కింద నుంచి పైకి రావనే అభిప్రాయానికి సర్వామోదం లభిస్తుంది. ఇందిరాగాంధీ హయాంలో ఇదే జరి గింది. అయితే, అధికార కేంద్రీకరణ లాంఛనంగా, వ్యవస్థీకృతంగా ఇప్పుడు జరుగుతోంది. ఇక అడ్డ గోలు నిర్ణయాలకు అడ్డుకట్టవేసే వ్యవస్థ ఉండదు. 

రఫాల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రశ్న?
రఫాల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వివాదంపై సుప్రీంకోర్టు ఏ ప్రశ్న అడిగిందో ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఈ ఒప్పందం విషయంలో నిర్ణీత పద్ధతి అనుసరించారా? లేక ప్రధాని నిర్ణయం తీసుకుని ప్రకటించారా? ప్రధాని సదుద్దేశంతో నిర్ణయించినా దానికి అవసరమైన లాంఛనప్రాయమైన లిఖితపూ ర్వక పని జరిగిందా? ఇన్ని అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఎన్నో దశాబ్దాలుగా మార్పులకు అవకాశం లేకుండా పనిచేస్తున్న ఉన్నతాధికార సర్కారీ వ్యవస్థలు చురుకుగా కదలవు. మార్పు అవసరమే. అంటే, అనేక దొంతరలతో కూడిన రాజ్యాంగబద్ధ వ్యవస్థను ఒక్కసారిగా చిందరవందర చేసి కూలదోయడం భావ్యం కాదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌– ఇలా ‘కులాల మాదిరిగా విడి విడిగా పనిచేసే’ ఉన్నతాధికార వ్యవస్థలను (నిజా నికి నేను ఈ మాట అనలేదు. ఇండియన్‌ పోలిస్‌ సర్వీస్‌–ఐపీఎస్‌ అధికారుల సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన వినతిపత్రంలో ఈ మాట వాడింది) ప్రతిభ ఆధారంగా తిన్నగా, సక్రమంగా పనిచేసేలా చేయాలి. ఇది ఒక్క ఐఏఎస్‌కే కాదు ఏ ముఖ్య సర్వీ సుకైనా వర్తిస్తుంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విచిత్రమైన పద్ధతి కారణంగా అగ్రశ్రేణి ఐపీఎస్‌ అధికారి ఎవరూ ఇక రిటైరయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. వారిలో అత్యధికులకు ప్రభుత్వంలో పదవీ విరమణ చేశాక కూడా పదవులు వస్తాయి. కాగా ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల్లో చాలా మంది రిటైర య్యాక ఇంటి దారిపట్టడమో లేదా కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందడమో జరుగుతుంది.

ఇక్కడ సత్వరమైన –నిర్దిష్టమైనది కాని– ఏర్పాటు ఉంది: రా మాజీ అధినేత రాజిందర్‌ ఖన్నా ఇప్పుడు డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు అయ్యారు. అతనికంటే ముందు ఆ స్థానంలో ఉన్న అలోక్‌ జోషిని ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఎన్‌టిఆర్‌ఓ చైర్మన్‌ని చేసేశారు. 65 ఏళ్లు సమీపించిన తర్వాత అయన్ని సాగనంపారు. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ స్పెషల్‌ డైరెక్టర్‌ సతీష్‌ ఝాని నియమించారు. ఈయనను పదవీవిరమణ తర్వాత మొదట్లో ఎన్‌టిఆర్‌ఓ సలహాదారుగా నియమించారు. ఇప్పుడు ఈయనకు ప్రమోషన్‌ వచ్చింది. ఐబీ మాజీ అధినేత దినేశ్వర్‌ శర్మ జమ్మూ కశ్మీర్‌ వ్యవహారాల ప్రతినిధిని చేశారు. ఐబీ నుంచి రిటైరైన ఆర్‌.ఎన్‌.రవి నాగా వ్యవహారాల ప్రతినిధిగా ఉంటున్నారు. ఇప్పుడు తను డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా కూడా ఉంటున్నారు. రా మాజీ అధికారి అమితాబ్‌ మాథుర్‌ని టిబెటన్‌ వ్యవహారాల సలహాదారును చేశారు. రా సంస్థలో నంబర్‌ టూ స్థానంలో కూడా ఉన్న మాథుర్‌ మొదట ఎన్‌ఎస్సిఎస్‌లో ఇప్పుడు ఎన్‌ఎస్‌ఏబీ (జాతీయ భద్రతా సలహా మండలి)లో ఉంటున్నారు. వీరితో పాటు, కర్నాల్‌ సింగ్‌ని రిటైర్మెంట్‌ అనంతరం ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. మాజీ ఎన్‌ఐఏ అధిపతి అయిన శరద్‌ కుమార్‌ రైటైరయ్యాక ప్రస్తుతం విజిలెన్స్‌ కమిషర్‌గా ఉన్నారు. వీళ్లంతా రిటైరైన ఐఏఎస్‌ అధికారులే. ఎన్‌ఎస్‌సీఎస్‌ బడ్జెట్‌ 2016–17లో రూ.81 కోట్ల నుంచి 2018–19 నాటికి రూ. 333 కోట్లకు పెరిగింది. లెంట్రల్‌ లుటీన్స్‌లో ఎన్‌ఎస్‌సీఎస్‌ కొలువైనచోట ఉన్న సర్దార్‌ పటేల్‌ భవన్‌ దాదాపుగా ఖాళీ అయిపోయింది. అక్కడ ఒక కొత్త సామ్రాజ్యం నిర్మితమైంది.

ఈ అంశంపై ఈ వారం మొదట్లో నేను చేసిన సాధారణ ట్వీట్‌పై తీవ్రంగా స్పందించారు. ఆ స్పందన ప్రభుత్వ సమర్థకులు, దోవల్‌ అభిమానుల నుంచి కాకుండా ఐపీఏస్‌ అసోసియేషన్‌ సభ్యుల నుంచి రావడం సరదా కలిగించింది. మాజీ కాని స్టేబుల్స్‌ హోమ్‌ మంత్రిగా (సుశీల్‌కుమార్‌ షిండే), ఉపరాష్ట్రపతిగా (బైరన్‌ సింగ్‌ షెఖావత్‌) అవుతున్న ఈ దేశంలో ఒక రిటైరైన ఐపీఎస్‌ అధికారి అతి శక్తిమంతుడైన భద్రతా జారు కావడంలో సమస్య ఉంటుందని చెప్పగలనా? అయితే ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే 1.34 బిలియన్లమంది ప్రజలున్న, అణ్వాయుధ సమేతమైన దేశంలో అత్యంత శక్తిమం తుడు కావచ్చునా అనేది మంచిప్రశ్నగా ఉంటుంది.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top