ఇదేం ప్రజాస్వామ్యం!?

Ramachandra Murthy Article On Parliament Policy Over Special Category Status - Sakshi

త్రికాలమ్‌

‘ఇక సహించజాలం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. దేవుళ్ళ దగ్గరికే వెడదాం’ ఈ మాటలు అన్నది తెలుగుదేశం వ్యవస్థాపకుడు, నేషనల్‌ ఫ్రంట్‌ అధినేత నందమూరి తారకరామారావు. బోఫోర్స్‌ కుంభకోణంపై కాగ్‌ నివేదిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టినప్పటికీ రాజీనామా చేయడానికి నిరాకరించారు. అందుకు నిరసనగా 12 పార్టీలకు చెందిన 106 మంది లోక్‌సభ సభ్యులు రాజీనామా చేస్తారని ఎన్టీఆర్‌ 1989 జూన్‌ 24న ప్రకటించారు. ఈ రోజుల్లో కాగ్‌ ప్రభుత్వాలను ఉతికి ఆరేసినా ముఖ్యమంత్రులు చలించడం లేదు. పైగా ఇదివరకటి ప్రధానులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేశారా అని దబాయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన అక్రమాలనూ, అవినీతినీ ఎండగడుతూ శనివారం కాగ్‌ వెల్లడించిన నివేదికపైన ఎన్టీఆర్‌ ఏ విధంగా స్పందించేవారో ఊహించుకోవాలంటే 29 సంవత్సరాలు వెనక్కిపోవాలి. బోఫోర్స్‌పైన కాగ్‌ రిపోర్ట్‌ వచ్చిన వెంటనే రాజీవ్‌గాంధీ ప్రధాని పదవి నుంచి వైదొలగాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.

ఆయన నిరాకరించడంతో బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకూ 12 ప్రతిపక్షాల సభ్యులు రాజీనామా చేశారు. అప్పుడు నేషనల్‌ ఫ్రంట్‌లో బీజేపీ ఎంపీలు 88 మందీ, వామపక్ష సంఘటన ఎంపీలు 44 మందీ ఉండేవారు. ఫ్రంట్‌ బలం మొత్తం 148. వందమందికి పైగా ప్రతిపక్ష సభ్యులు మూకుమ్మడి రాజీ నామా చేస్తే దేశం నివ్వెర బోయింది. 73 మంది లోక్‌సభ సభ్యుల బృందం స్వయంగా స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖలు ఇచ్చింది. ‘మహాభారత సంగ్రా మం ఆరంభమైంది. ఇది మాకు దొరికిన చివరి అవకాశం. సద్వినియోగం చేసుకుంటున్నాం’ అంటూ కదనకుతూహలం ప్రదర్శించారు బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజపేయి. ‘1984లో కాంగ్రెస్‌కు లభించిన జనామోదం బోఫోర్స్‌పై కాగ్‌ నివేదికతో అంతమైంది’ అంటూ వ్యాఖ్యానించారు విశ్వనాథ్‌ప్రతాప్‌సింగ్‌.

చారిత్రక నిర్ణయాలు 
చరిత్రలో కొన్ని ఘట్టాలు ఎప్పటికీ గుర్తుంటాయి. 1966లో తాష్కెంట్‌లో లాల్‌బహదూర్‌ శాస్త్రి అస్తమించిన అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు కామరాజ్‌ నాడార్‌ మొరార్జీ దేశాయ్‌ని కాదని ఇందిరాగాంధీని ప్రధాని పదవికి పోటీ పెట్టి గెలిపించిన ఘట్టం, మూడేళ్ళ తర్వాత అదే ఇందిరాగాంధీ ప్రధాని పదవిలో నిలదొక్కుకున్నాక తాను ఆటబొమ్మను (కట్‌పుత్లీ) కానని నిరూపించిన విధం ఎన్నటికీ మరపురాదు. కామరాజ్, నిజలింగప్ప, అతుల్యఘోష్, ఎస్‌కె పాటిల్, నీలం సంజీవరెడ్డి వంటి హేమాహేమీలను ఎదిరించి, 1969 రాష్ట్రపతి ఎన్నికలో అంతరాత్మ ప్రబోధం పిలుపుతో పార్టీని నిలువుగా చీల్చి, సీనియర్‌ నాయకుల సిండికేట్‌ను పూర్వపక్షం చేసిన తీరు భారత రాజకీయాలలో అపూర్వ ఘట్టం. 1977లో ఆత్యయిక పరిస్థితిని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించడం కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అధినేతలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు చారిత్రక పరిణామాలకు అని వార్యంగా దారితీస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌ విభజనకు చాలాకాలం తటపటాయించిన సోనియాగాంధీ యూపీఏ–2 ప్రభుత్వం పదవీకాలం ముగుస్తున్న దశలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) రెండుసార్లు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజీనామా అన్నది ఒక అస్త్రం. వైఎస్సార్‌సీపీకి చెందిన అయిదుగురు ఎంపీలు అదే అస్త్రాన్ని ప్రయోగించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించేందుకు పోరాటం కొనసాగిస్తున్నారు. అంతేకాక ఢిల్లీలోనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. తెలుగుదేశం ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలు 25 మందీ వైదొలిగినట్టు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందనీ, ఎన్‌డీఏ ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతుందనీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉద్ఘాటించింది అందుకే. తెలుగుదేశం ఎంపీల చేత రాజీనామా చేయించకపోగా వైఎస్సార్‌సీపీకి చెందిన లోక్‌సభ సభ్యులు మాత్రమే రాజీనామా చేశారేమి, రాజ్యసభ సభ్యులు ఎందుకు చేయలేదంటూ వంకర ప్రశ్నలు వేస్తున్నారు.

ఎన్టీఆర్‌కీ, చంద్రబాబుకీ ఉన్న తేడా అదే. ఎన్టీఆర్‌ ధీరోదాత్తుడు. ఆయనది ప్రత్యక్షయుద్ధం. అప్పుడు కూడా లోక్‌సభ సభ్యులే రాజీనామా చేశారు కానీ రాజ్యసభ సభ్యులు చేయలేదు. రాజ్యసభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. వారు రాజీనామా చేసినా ప్రజలపైన ప్రభావం ఉండదు. లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసి తమ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజల మధ్య ఉంటారు. ఎన్టీఆర్‌ నాయకత్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ సమష్టి నిర్ణయాలతో రాజీవ్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం యుద్ధరంగంలోకి దిగడానికి జడుస్తోంది. ప్రతిపక్షం దిశానిర్దేశం చేస్తే దాన్ని అనుసరించే సద్భావం లేదు. స్వయంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సాహసం లేదు.

అవిశ్వాస తీర్మానాల చరిత్ర 
శుక్రవారం ముగిసిన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని అపకీర్తి తెచ్చాయి. పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఆచార్య జేబీ కృపలానీ ప్రవేశపెట్టారు. నాటి ప్రధాని నెహ్రూ తీర్మానాన్ని స్వాగతించారు. చర్చకు సమగ్రంగా సమాధానం చెప్పారు. తర్వాత 25 మంది వివిధ ప్రభుత్వాలపైన విశ్వాస రాహిత్యం ప్రకటించే తీర్మానాలకు నోటీసులు ఇచ్చారు. అన్ని తీర్మానాలపైనా వివరంగా చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఒక్క లోక్‌సభ సభ్యుడు నోటీసు ఇచ్చినా దాన్ని స్పీకర్‌ ఆమోదించి తీరాలి. తిరస్కరించే అధికారం రాజ్యాంగం స్పీకర్‌కు ఇవ్వలేదు. 1979 జులై 15న జనతా పార్టీ ప్రధాని మొరార్జీ తన ప్రభుత్వంపైన వచ్చిన అవిశ్వాస తీర్మానంపైన చర్చ పూర్తి కాకమునుపే తన పదవికి రాజీనామా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ సందర్భం మినహా అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రధాని రాజీనామా చేయవలసిన వచ్చిన సందర్భం మరొకటి లేదు. బ్రిటన్‌లో డజను మంది ప్రధానులు అవిశ్వాస తీర్మానం నెగ్గిన ఫలితంగా రాజీనామాలు చేశారు.

మన ప్రధానులూ రాజీనామా చేసిన సందర్భాలు లేకపోలేదు. వారు తాము ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోయిన కారణంగా వైదొలిగారు. మొరార్జీ తర్వాత వచ్చిన జాట్‌ నాయకుడు చౌధరి చరణ్‌సింగ్‌ 1979 ఆగస్టు 20న లోక్‌సభలో ‘విశ్వాస తీర్మానం’ పైన చర్చ జరగకుండానే పదవి నుంచి వైదొలిగారు. వి.పి. సింగ్‌ 1990 నవంబర్‌ 7న విశ్వాస తీర్మానం నెగ్గని కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ‘విశ్వాస తీర్మానం’ 265–251 ఓట్ల తేడాతో గెలిచింది. వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రెండుసార్లు ‘విశ్వాస తీర్మానం’ ఎదుర్కొన్నది. 1998 మే 28న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని గెలిపించుకోవడానికి సరిపడ మద్దతు సమీకరించలేమని తెలుసుకొని వాజపేయి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో వచ్చిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రతినిధి హెచ్‌డీ దేవెగౌడ 1979 ఏప్రిల్‌ 11న విశ్వాస తీర్మానం వీగిపోయిన కారణంగా గద్దె దిగవలసి వచ్చింది. వాజపేయి ప్రభుత్వానికి ఏఐఏడిఎంకే అధినేత జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో 1999 ఏప్రిల్‌ 17న ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపైన ఓటింగ్‌ జరిగింది. ఒక్క ఓటు తేడాతో (269–270) తీర్మానం వీడిపోయింది. వాజపేయి సర్కార్‌ పడిపోయింది. 

నేషనల్‌ ఫ్రంట్‌ అయినా యునైటెడ్‌ ఫ్రంట్‌ అయినా రేపు ఫెడరల్‌ ఫ్రంట్‌ అయినా ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందే. మద్దతు ఇచ్చిన పార్టీ అదను చూసి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు ఢమాల్‌న పడిపోవలసిందే. అన్ని ప్రభుత్వాలూ పట్టుమని ఏడాది గడవకుండానే కూలి పోయాయి. ఫ్రంట్‌లు ఏర్పడటానికి ముందు జనతా పార్టీ చీలిపోవడంతో మొరార్జీ సర్కార్‌ కూలిపోయింది. తరువాత వచ్చిన చరణ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పడగొట్టింది. నేషనల్‌ ఫ్రంట్‌ ప్రధాని వి.పి. సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీ, కాంగ్రెస్, జనతాపార్టీ (చంద్రశేఖర్‌) కలిసి ఎసరు పెట్టాయి. చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌ ప్రభుత్వాలు కాంగ్రెస్‌ తంత్రం ఫలితంగా కూలిపోయాయి.

స్పీకర్‌ నిస్సహాయత
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశంలోని రెండవ భాగంలోని 22 రోజులూ నిష్ఫలంగా గడిచిపోయాయి. అవిశ్వాస తీర్మానం చేపట్టడానికి అవసరమైన 50 మంది సభ్యుల కంటే ఎక్కువమందే లేచి నిలబడినా స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ సభను వాయిదా వేశారు. స్పీకర్‌కు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను వినియోగించలేదు. పోడియం దగ్గర చేరి నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించిన ఏఐఏడిఎంకె సభ్యులను సస్పెండు చేసి సభ నిర్వహించే అధికారం ఆమెకు ఉన్నది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రధాని తటస్థంగా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ వ్యవహారదక్షుడు. తన గురువు ప్రమోద్‌ మహాజన్‌ వాజపేయి ప్రభుత్వంలో ఇదే శాఖను సమర్థంగా నిర్వహిం చారు. ప్రతిపక్ష నాయకులతో, మిత్రపక్షాల నేతలతో ఎలా మెలగాలో మహాజన్‌ నుంచి అనంతకుమార్‌ నేర్చుకున్నారు.

కానీ ఆయన ఈ సమావేశాలలో ఉత్సాహంగా కనిపించలేదు. చర్చకు అధికార పక్షం సిద్ధంగా ఉన్నదంటూ ప్రతిరోజూ ప్రకటించడం మినహా ఆయన చేసిన ప్రయత్నం ఏదీలేదు. పీవీ హయాంలో 1995లో పార్లమెంటు శీతాకాల సమావేశాలను బీజేపీ అడ్డుకుంది. సుఖ్‌రామ్‌ టెలికాం కుంభకోణంపైన చర్చించాలని పట్టుబట్టి సమావేశాలు జరిగినన్ని రోజులూ చర్చ సాగనివ్వలేదు. పైగా సభలో చర్చ జరిగే విధంగా చూసే బాధ్యత అధికార పార్టీదేనంటూ వాదించింది. బీజేపీ, కాంగ్రెస్‌ల నెలవులు మారినాయి కానీ వాదనలు మారలేదు. ఇక్కడ ఇలా వాయిదాలు పడుతున్న సమయంలోనే పొరుగున ఉన్న శ్రీలంక ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ జరిగింది. ప్రధాని రణిల్‌ విక్రమసింఘే వెంట్రుకవాసితో గట్టెక్కారు. ఎన్‌డీఏకి తిరుగులేని సంఖ్యాధిక్యం ఉంది. చర్చకు వెనకంజ ఎందుకో అర్థం కాదు. 

అవిశ్వాస తీర్మానంపైన చర్చ జరిగితే ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టమని మోదీ భావించి ఉండాలి. యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతి ఆరోపణలు, పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ గందరగోళం, ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం ప్రయత్నించిందనే అనుమానం, నానాటికీ తీవ్రతరం అవుతున్న వ్యవసాయ సంక్షోభం మోదీ ప్రభుత్వాన్ని కట్టిపడవేశాయి. యుద్ధతంత్రం విస్మరించిన యోధుడిలాగా మోదీ కనిపిస్తున్నారు. అవి శ్వాస తీర్మానాన్ని చర్చకు పెట్టని తొలి లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రామహాజన్‌ చరి త్రలో మిగిలిపోతారు. చర్చ జరిపించడానికి ప్రయత్నించని సభానాయకుడుగా మోదీ అపకీర్తి మూటకట్టుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా విఫలుడైన అనంతకుమార్‌ సంగతి సరేసరి. 

నిస్తేజం, నిర్వికారం
బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరునూ, ప్రతిపక్షం చేసిన హడావిడినీ, అధికారపక్షం నిమ్మకు నీరెత్తినట్టు, దిక్కుతోచనట్టు వ్యవహరించిన పద్ధతి గమనిస్తే కొన్ని సందర్భాలు గుర్తుకు రాకమానవు. మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం 2013లో పార్లమెంటులో 2జీ కుంభకోణం, కామన్వెల్త్‌ అక్రమాలపర్వం, బొగ్గు కుంభకోణం వగైరా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన సన్నివేశం గుర్తుకొస్తున్నది. పీవీ ప్రభుత్వం ద్వితీయార్ధంలో ప్రతిపక్ష బీజేపీ దాడి తట్టుకోలేక విలవిలలాడిన దృశ్యాలు కళ్ళకు కడుతున్నాయి. 1989లో బోఫోర్స్‌ కుంభకోణం తాలూకు ఆరోపణలతో రాజీవ్‌గాంధీ దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడటం కనిపిస్తున్నది. మే నెలలో మోదీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో ప్రవేశిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్‌లోనా, వచ్చే వేసవిలోనా అన్నది ఇంకా తేల్చుకున్నట్టు లేదు. మంత్రులు రాజీ నామా చేసినా, మిత్రపక్షం వైదొలిగినా, పార్లమెంటులో గొడవ జరిగినా, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసి నిరాహారదీక్ష చేస్తున్నా మోదీ మౌనాన్ని ఆశ్రయించడం ప్రజలకు ఆశ్చర్యం, దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ మౌనం వెనుక ఎన్ని సముద్రాల ఘోష ఉన్నదో మరి?

- కె. రామచంద్రమూర్తి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top