కంచే చేను మేస్తే...

Madabhushi Sridhar Article On Indian Laws - Sakshi

విశ్లేషణ

సుప్రీంకోర్టు తను నిర్ధా  రించిన న్యాయసూత్రాలు తానే అమలు చేయాలి కదా. పనిచేసేచోట మహిళా ఉద్యోగినులపైన లైంగిక పరమైన వేధింపులు జీవన హక్కు, పనిచేసే హక్కును హరించడమే కాక పీనల్‌ కోడ్‌ నేరాలు కూడా అవుతాయని, అంతర్జాతీయ న్యాయసూత్రాలకు భంగమనీ  ఈ దుష్ప్రవర్తపై ఫిర్యాదు చేయడానికి వెసులు బాట్లు, ఒక కమిటీ ఉండాలని సర్వోన్నత న్యాయ స్థానం విశాఖ వర్సెస్‌ రాజస్తాన్‌ రాష్ట్రం (1997–6 ఎస్పీసీ 241)కేసులో నిర్దేశించింది. 

న్యాయమూర్తిపైనే ఆరోపణను ఎవరు విచారిస్తారనే ప్రశ్నకు జవాబులేదు. న్యాయమూర్తిని దర్యాప్తు చేసే ప్రత్యామ్నాయ వ్యవస్థా లేదు.  మధ్యప్రదేశ్‌  హైకోర్టు న్యాయమూర్తిపైన 2014లో ఒక మహిళాజడ్జిగారు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది. పనిచేస్తున్న హైకోర్టు జడ్జిపైన ఫిర్యాదు రాగానే భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక నిష్పాక్షిక అంతర్గత దర్యాప్తు విధానాన్ని నిర్ధారించి అనుసరించాలని అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ‘ఎక్స్‌’ వర్సెస్‌ మధ్యప్రదేశ్‌ హైకోర్ట్‌  (2015– 4 ఎస్సీసీ 91) కేసులో సుప్రీంకోర్టు సూచించింది. అంతర్గత దర్యాప్తు విధానం (ఇన్‌ హౌస్‌ ప్రొసీజర్‌) ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి.. ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేయాలి. విచారణ ప్రక్రియను, విచారణ ఫలితాన్ని పర్యవేక్షించాలి. కేసు పూర్వాపరాలను బట్టి పక్షపాతం, అభిమానం, వ్యతిరేకతల నుంచి ఫిర్యాదికి రక్షణ కల్పించే విధంగా అంతర్గత విచారణా విధానాలను మార్చుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పులో సూత్రీకరించింది. 2013 లైంగిక వేధింపుల నిరోధ చట్టం (2013 చట్టం) సుప్రీంకోర్టు జడ్జిలకు మినహాయింపు ఇవ్వలేదు. లైంగిక నేరాల విచారణకు సుప్రీంకోర్టు రూపొందించిన (జీఎస్‌ ఐసీసీ) 2013 నియమావళి ప్రకారం ప్రధాన న్యాయమూర్తికే పూర్తి పర్యవేక్షణాధికారాలు ఉన్నాయి. విచారణ కమిటీ సభ్యుల ఎంపిక ఆయనేచేస్తారు, విచారణ ముగిసిన తరువాత సిఫార్సులను ఆయనకే సమర్పిస్తారు. ఆ నిర్ణయాలను తిరస్కరించడమో లేదా ఆమోదించడమో ఆయన విచక్షణకే వదిలేస్తారు. కానీ ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిపైనే ఫిర్యాదు ఉంది. ఈ ఫిర్యాదు ఈ నియమావళి కింద ఇచ్చినది కాదు. కనుక అంతర్గత విచారణా విధానంగానీ, నియమావళి గానీ ఈ కేసులో పనిచేయకపోవచ్చు.  

ఏ విభాగంలోనైనా చిన్న ఉద్యోగి తనపై ఉన్నతాధికారి సాగించిన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే పెద్దల ఆగ్రహానికి గురికావడం సహజం. కనుక ఈ ఫిర్యాదుల విచారణ కమిటీలో సభ్యురాలిగా ఉండడానికి తప్పనిసరిగా ఆ విభాగానికి చెందని, బయట మరో రంగం నుంచి ఒక నిష్పాక్షిక వ్యక్తిని, ఎంపిక చేయాలి. ఆమె లేకుండా జరిపే దర్యాప్తు చెల్లదని కూడా సుప్రీంకోర్టు వారే సెలవిచ్చారు. ఆరోపణకు గురైన అధికారి చెప్పుచేతల్లో పనిచేసే వారితో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తే ఆ దర్యాప్తు చెల్లదని ఎం. రాజేంద్రన్‌ వర్సెస్‌ డైసీరానీ అండ్‌ అదర్స్‌ (2018–3 ఎంఎల్‌జే 84) కేసులో మద్రాస్‌ హైకోర్టు పేర్కొంది. బాధిత మహిళను మరిన్ని వేధింపుల నుంచి రక్షిస్తూ నిందితుడిని బదిలీచేయాలి. ఆరోపణకు గురైన వ్యక్తి న్యాయ మూర్తి అయితే, సాక్షులపై ఆయనకు అధికార పరిధి ఉన్నట్టయితే, ఆయనను ఆ పరిధి నుంచి తప్పించాలని కూడా మధ్యప్రదేశ్‌ జడ్జి కేసులో సుప్రీంకోర్టు వివరించింది. ఇది సుప్రీంకోర్టుకు వర్తించదా? 

భారత ప్రధాన న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసిన మహిళ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు దర్యాప్తులో ఏప్రిల్‌ 26, 29 న హాజరైనారు. కమిటీ సభ్యులు వేసిన ప్రశ్నలు తనను అదరగొట్టాయన్నారు. తన ప్రకటన నమోదు చేసేటప్పుడు తనకు అండగా ఒక లాయర్‌నుగానీ, మిత్రుడినిగానీ అనుమతించలేదని, కమిటీ తనలో ఆందోళన బాధ కలిగిస్తున్నదని ప్రకటించారు. తనపై జరిగిన నేరానికి సాక్షులు ఉన్నారని, కానీ వారంతా సుప్రీంకోర్టు ఉద్యోగులే కనుక వారు నిర్భయంగా సాక్ష్యం చెప్పే అవకాశం లేదన్నారు. తాను మొదటిసారి హాజరైనప్పుడు మహిళా పోలీసులు తనను భయానకంగా, అవమానకరంగా సోదా జరిపారనీ, తన వాంగ్మూలాన్ని నమోదు చేసేటప్పుడు దృశ్యశ్రవణ చిత్రీకరణ కోరినా నిరాకరించారని, రికార్డు చేసిన తన వాంగ్మూ లం ప్రతి అడిగినా ఇవ్వలేదని ఆమె చెప్పారు. న్యాయమూర్తి తనతో మాట్లాడిన రెండు సెల్‌ నంబర్ల వాట్సాప్‌ కాల్‌ ఛాట్‌ వివరాలు, కాల్‌ రికార్డులు తెప్పిస్తే అవి కీలకమైన సాక్ష్యాలు అవుతాయని ఆమె అన్నారు. దర్యాప్తు ఎన్నాళ్లు సాగుతుందో చెప్పలేమని, దీని నివేదిక కూడా రహస్యమని జడ్జి బోబ్డే తనకు చెప్పారని ఆమె అన్నారు. ఇటువంటి దర్యాప్తులో పాల్గొనజాలనని ఆమె బయటకు వెళ్లిపోయారు. అయినా దర్యాప్తు కొనసాగుతున్నది. భారత ప్రధాన న్యాయమూర్తి కూడా హాజరై తన వాదం వినిపించారు. ఒకవేళ ప్రతికూల నివేదిక వస్తే బాధితురాలు ఏ కోర్టుకు అప్పీలుకు వెళ్లాలో?


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top