ద్రౌపదిని తూలనాడటం తగునా?

Lakshmi Parvathi brief article on Draupadi - Sakshi

అభిప్రాయం
కురుక్షేత్ర యుద్ధానికి ద్రౌపదే కారణం అనడం నిరాధారం. దుర్మదాంధుడు దుర్యోధనుడే సూది మొన మోపిన భూమిని కూడా ఇవ్వనని యుద్ధానికి తెరతీశాడు. ద్రౌపదిని నన్నయ  ప్రసన్నమూర్తిగా, పవిత్ర భామినిగా వర్ణించాడు. ఆమె ధర్మాచరణం, కర్తవ్యనిర్వహణం, అతిథి సత్కారం, క్షమాచిత్తం అనితర సాధ్యమన్నాడు. ఆమె పతుల మాటను అతిక్రమించి నట్టు ఎక్కడా లేదు. వ్యాసునికి ఆమె ‘బ్రహ్మవాదిని’, నన్నయ్యకు ‘తపస్విని’. ఆమెను అవమానించటం అంటే వ్యాçసుడిని, శ్రీకృష్ణుడిని, కవిత్రయ భారతాన్ని అవమానించినట్టే.

తరతరాలుగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలో స్త్రీలకు పెద్దపీట వేస్తు న్నామని చెబుతున్నా ఆచరణలో అది అంతగా కనిపించడం లేదు. మొత్తం సంస్కృతి అంతా స్త్రీ శీలం చుట్టే తిరుగుతూ ఒక రకమైన అణచివేతకు గురి చేశారు. ఎన్నో సంస్కరణల తర్వాత ఇప్పుడిప్పుడే స్త్రీలు కొంత ఊపిరి పీల్చుకుని అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నా, ఇప్పటికీ ఆమె పట్ల మగవారికున్న చులకన భావం తగ్గలేదు. తాజాగా గోవాలో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రసంగిస్తూ ద్రౌపది పాత్ర మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయ డమే అందుకు ఉదాహరణ. ద్రౌపది మొదటి స్త్రీవాది అని, ఆమె పంచభర్తృక అని అన్నారు. ఇంతవరకు పెద్ద ఇబ్బందేమీ లేదు. తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లో ద్రౌపది పట్ల ఆయనకు ఎంత వ్యతిరేక భావముందో అర్థమౌ తుంది.

ఆమె అస్సలు భర్తల మాట వినేది కాదని, ఆమే యుద్ధాన్ని ప్రోత్స హించి 18 లక్షల మంది చనిపోవటానికి కారణమైందని, లేకపోతే పాండవులు ఐదు ఊళ్లతోనే సరిపెట్టుకునేవారంటూ... కేవలం ఆమె వల్లనే సర్వనా శనం జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఆయన కూడా పాపం అందరి మొగాళ్లలా  గానే ఆలోచించారు. ఏ తప్పయినా స్త్రీలే చేస్తారు తప్ప పురుషులు కాదని ఆయన భావం. చూడబోతే రాంమాధవ్‌ మహా భారతం సరిగ్గా చదవలేదనిపిస్తోంది. 18 అక్షౌహిణులు అంటే ఆయన దృష్టిలో 18 లక్షలని. పండితులను అడిగి ఆయన ఆ లెక్కను తెలుసుకుంటే బావుంటుంది. ఒక అక్షౌహిణి అంటేనే 20 లక్షలపైగా ఉంటుంది.

ద్రౌపది తప్పేమిటి?
ఇక ద్రౌపది యుద్ధాన్ని ప్రోత్సహించి లక్షలాది మందిని చంపించిందనే మాట... కేవలం స్త్రీలపట్ల తేలిక భావంతో అన్నదే. ఈ దేశానికి కావలసింది సీతాదమయంతులు కారు, ద్రౌపదిలా నిలదీసేవారు’ అన్నారు రామ్‌మనో హర్‌ లోహియా. ‘పైకి చూడటానికి మన దేశంలో స్త్రీల స్థానం గొప్పదిగానే కనిపించవచ్చు. కానీ సమాజంలో ఆమె స్థానం ఏమంత పెరిగినట్లు కనిపిం చదు. ఆమె వ్యక్తిత్వాన్ని పురుష సమాజం గౌరవించదు. ఇప్పటికీ ఆమె బందీ గానే ఉన్నది. స్త్రీపురుషులు భుజం భుజం కలిపి సాగినప్పుడే మానవ సంస్కృతి వికసిస్తుంది. దానికి భారత మహిళ చాలా దూరంలో ఉంది’ అన్నారాయన. ఉత్తర భారతంలోని కొన్ని దేవాలయాల్లో రాముడి పక్కన సీతామాత విగ్రహం పెట్టరు. వాళ్ల దృష్టిలో ఆమె దూషిత అట, రాముడి పక్కన ఆమెకు స్థానం లేదట! ఈ విపరీత భావజాలంలోనే హైందవ సంస్కృతి ఇంకా కొట్టుమిట్టాడుతుండటం దురదృష్టకరం. రాంమాధవ్‌ ద్రౌపది మీద చేసిన విమర్శలో అది చాలా స్పష్టంగా అర్థం అవుతున్నది. ఆ విమర్శలో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ఒక్కసారి వ్యాస భారతం, కవిత్రయ భారతం ద్రౌపది పాత్రను ఎలా చిత్రించాయో చూడటం అవసరం.

పెద్దల ఆదేశం మీద ఐదుగురిని పెండ్లాడి కూడా తన వ్యక్తిత్వాన్ని, స్త్రీ విలు వలను కాపాడుకున్న మహిళ ద్రౌపది.  కురుక్షేత్ర యుద్ధం ప్రధానంగా భారతంలోని రాజవంశాలు, వారి సంబంధాలు, వ్యక్తిపరమైన సంఘర్షణల మధ్య నడచిన కథే. బాల్యం నుండి దాయాద ద్వేషంతో రగిలిపోయిన దుర్యోధనుని అహంకారానికి, నీచ వెన్ను పోటు రాజకీయానికి నిదర్శనమే ఈ యుద్ధం. ఏదో విధంగా దాన్ని ఆడవాళ్ల మీదకు తోసేయడం మాని వాస్తవాలు చదవండి– ద్రౌపదేమిటో అర్థమౌ తుంది. ఒక రకంగా చూస్తే ద్రౌపదిని పెండ్లాడే వరకు పాండవులు నిర్భా గ్యులు. చక్రవాకపురంలో బిచ్చమెత్తి బతుకుతున్నవాళ్లు. బలవంతులయినా నిస్సహాయులు, అనాథలు. దాయాదుల కుట్ర నుండి ఎలాగో బయటపడి మారువేషాలతో జీవిస్తున్న వాళ్లు. ద్రౌపదిని వివాహం చేసుకున్నాకే వాళ్ల వీరత్వమేమిటో లోకానికి తెల్సింది. ద్రౌపది పాంచాల దేశపు యువరాణి. తండ్రికి ప్రీతిపాత్రురాలు. అన్ని విద్యలు నేర్చుకున్న ధీశాలి. ఆనాటి బలమైన రాజ్యాల్లో ఒకటయిన పాంచాల దేశం ఆమె కనుసన్నల్లో నడిచింది.

వ్యాసుడు, కవిత్రయం ఏం చెప్పారు?
తనకు ఇష్టం లేకపోయినా వ్యాసుడు, కృష్ణుడు చెప్పిన మీదటే పాండవులు ఐదుగురిని పెళ్లాడవలసి వచ్చింది. చేసిన వాళ్లను, చేసుకున్నవాళ్లను వదిలేసి ఆమెనొక్క దాన్నే నిందించడం ఏం ధర్మం? ఆమెతో పాటు పాండవులకు అంతులేని ఐశ్వర్యం, అండ, పలుకుబడి పెరిగాయి. నిర్భయంగా మారు వేషాల నుండి బయటపడటమే కాకుండా హస్తిన రాజ్యంలో భాగం ఇమ్మని అడిగే ధైర్యం కూడా వచ్చింది. పాంచాలను చూసి భయపడిన దృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యభాగం ఇవ్వక తప్పలేదు. ఆ తదుపరి చేసిన రాజసూయ యాగంతో పాండవులకు అనంతమైన సంపదలు సమకూరటంతో పాటూ అప్రతిహతమైన కీర్తిప్రతిష్టలు పెరిగాయి. చెప్పాలంటే అప్రతిష్టపాలై, అనా మకులై అగాధ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న పాండవులను ఒడ్డుకు చేర్చిన దేవత ద్రౌపది. తన సహనంతో అన్నదమ్ముల మధ్య కలతలు రాకుండా కాపాడుకుంటూ వచ్చిన ధర్మశీల. ధర్మరాజు వ్యసనానికి కౌరవ సభలో అవమానం పాలై కూడా ఆమె తన భర్తల దాస్యం పోగొట్టమని కోరుకుని వాళ్ల రాజ్యాన్ని తిరిగి ఇప్పించిన పతివ్రత.

పురస్కాత్కరణీయం మేనకృతం కార్యముత్తరం / విహ్వలాస్మి కృతానేన కర్షతా బలినా బలాత్‌ / అభివాదం కరోమ్యేషాం కురూణాం కురుసంపది / నమేస్యాద పరాధో యం యదిదం న కృతం మయా ‘‘
అంటూ వ్యాసుడు మూల మహాభారతంలో ద్రౌపది సంస్కారాన్ని ప్రశం సించాడు. దుశ్శాసనుడు తనను బలవంతంగా సభకు లాక్కురాగా భయ విహ్వలంతో ఆమె సభకు నమస్కారం చెయ్యటం మర్చిపోయి, తప్పు తెల్సు కుని కురువృద్ధులందరిని క్షమాపణ అడిగి అభివాదం చేసిందట. దుర్భరమైన వేదనలో కూడా సభావందనం చేసిన గొప్ప సంస్కారవతి అని దీని అర్థం. ఇంతమంది కురువృద్ధులు, గురువృద్ధులున్న సభలో ఒక స్త్రీకి అవమానమా అని ప్రశ్నించి వారిని తలదించుకునేటట్లు చేసింది. ఆమె ప్రశ్న అన్ని తరాల దురహంకారులకు వర్తిస్తుంది. చట్టాలు–ప్రభుత్వాలు, సంస్కరణలు, పోలీసు వ్యవస్థ ఎన్నివున్నా అహంకారంతో మహిళా అధికారులను వేధిస్తున్న తీరు చూస్తేనే ఉన్నాం. భూకబ్జాలకు పాల్పడిన వారిని ప్రశ్నించినందుకు దళిత యువతి బట్టలూడదీసి కొట్టిన పాలకాహంకారాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం.

ఐదు వేల సంవత్సరాల క్రితమే ద్రౌపది ఇటువంటి అవమానాలు ఎదు ర్కొని కూడా చివరి వరకు ధర్మవిజిత లాగానే నిలబడింది తప్ప తన తండ్రిని దుర్యోధనుని మీదకు ఉసిగొల్పలేదు. భర్తలతోపాటు అడవులకు వెళ్లిందే కాని పుట్టింటికి వెళ్లలేదు. పాండవుల మిగతా భార్యలెవ్వరూ ఈ ధర్మాన్ని పాటిం చలేదేం? అరణ్యవాసంలో భర్తలను ఎంతో భక్తిగా సేవించింది. వచ్చిన అతి థులకు తనే స్వయంగా వండి వడ్డించింది. కంద మూలాలు తిన్నది. యజ్ఞాలు చేసింది. చివరకు అజ్ఞాతవాసంలో విరాట్‌ రాజ్యంలో అతని భార్యకు దాసిగా కూడా పనిచేసింది పాంచాల రాకుమారి. ధర్మరాజు అసమ ర్థతను కప్పిపుచ్చి అతని ధర్మనిరతిని పొగిడి పొగిడి చెప్పింది.

ఇక 18 లక్షల సైన్యం ఆమె వల్లనే చనిపోయారనేది ఎంత అవాస్తవమో భారతం చదివితే అర్థమౌతుంది. సంధి ప్రయత్నంలో భాగంగా చివరకు ఐదుగురికి ఐదు ఊళ్లు ఇచ్చిన చాలని యుద్ధం వద్దని ధర్మరాజు శ్రీకృష్ణునికి చెప్పిన సందర్భంలో ఆమె అక్కడే ఉంది. మరి ఎందుకు వద్దని వారించలేదు. ఆమె వద్దంటే శ్రీకృష్ణుడు సంధి కోసం కౌరవసభలో రాయబారాన్ని సాగించే వాడా? అయినా దుర్మదాంధుడు, దురభిమాని అయిన దుర్యోధనుడు ఐదు ఊళ్లు కాదు కదా సూది మొన మోపిన భూమిని కూడా ఇవ్వనని చెప్పి యుద్ధా నికి తెర తీశాడు కదా. ఇందులో ద్రౌపది తప్పేమిటి?
భారతంలో ఆమె పాత్రను ఎంతో హుందాగా, గొప్ప స్త్రీగా వర్ణించారు. ఆమె పుత్రులైన ఉపపాండువులను అశ్వత్థామ అన్యాయంగా చంపినప్పుడు, అంత దుఃఖంలో కూడా అతనికి ప్రాణభిక్ష పెట్టిన క్షమామూర్తి ద్రౌపది. అలాగే కౌరవుల సోదరి దుస్సల భర్తౖయెన సైంధవుడు తనను చెరచడానికి ప్రయత్నించినప్పుడు కూడా అతని ప్రాణాలు కాపాడి బంధుత్వ విలువలను రక్షించింది ద్రౌపది. ఇలా చెప్పుకుంటూ పోతే భారతమంతటా ఆమె గొప్పత నాన్ని కీర్తించడమే కనిపిస్తుంది.

ఈ విమర్శలకు అర్థం వ్యాసుడిని అవమానించడమే!
నన్నయ రచనలో ఆమె ప్రసన్నమూర్తిగా, పవిత్ర భామినిగా, స్వీయ నాయ కిగా, ముగ్ధ వధువుగా దర్శనమిస్తుంది. ఆమెకున్న ధర్మాచరణం, కర్తవ్య నిర్వహణం, అతిథి సత్కారం, క్షమాచిత్తం అనితర సాధ్యమని నన్నయ వర్ణి స్తాడు. ఆయన రచనలో ఆమె ఎన్నడూ పతుల మాటను అతిక్రమించడం కానీ, నిరసన వాక్యాలతో నిందించటం కానీ కనిపించదు. వ్యాసుని దృష్టిలో ‘బ్రహ్మవాదిని’. నన్నయ ఆమెను తపస్వినిగా చూపించాడు. ధీర గంభీర ఉదాత్తత కలిగిన ఆమె ధర్మాచరణం ఇతర స్త్రీలకు ఆదర్శం అని నన్నయ చెప్పిన ద్రౌపదిని ఏ ఆధారంతో ఈ బీజేపీ నాయకులు విమర్శించారో సమాధానం చెప్పాల్సి ఉంది.

ఆమెను అవమానించటం అంటే వ్యాసుల వారిని, శ్రీకృష్ణుడిని, కవి త్రయ భారతాన్ని అవమానం చేసినట్టే అవుతుంది. దయచేసి అరకొర జ్ఞానంతో మహిళల త్యాగాల్ని అవమానించకండి. ఆమె లేకపోతే లోకమే లేదు, సమాజ అభివృద్ధి లేదు. వేదం కూడా హరీయో దేవీ – యుషసహం – యోచమానాసురీయః/ సీయోప్రానాభ్యేతు పశ్చాత్‌ అని చెబుతున్నది. లోకాన్నే వెలిగించే సూర్యుడు ఛాయాదేవిని అనుసరించి నడచినట్లు ఈ ప్రపంచం కూడా స్త్రీలను అనుసరించే నడుస్తున్నది అని అర్థం.

తరుణి ద్రౌపది యిట్లు పాండవ దార్తరాష్ట్రులదైన భీ / కర పరస్పర కోపవేగముగ్రన్న బాచి విపత్తి సా / గర నిమగ్నుల నుద్ధరించె బ్రకాశకీర్తుల ధీరులం / బురుష సింహులనున్‌ నిజేశుల బూనితద్దయు బ్రీతితోన్‌ (భారతం : సభాపర్వం) అన్నీ కోల్పోయి అవమానంతో బాధపడుతున్న పాండవులను ద్రౌపది ఉద్ధరించిన తీరును చెప్పి, ఆ మహాదేవికి నీరాజనమిచ్చాడు నన్నయ. స్త్రీలను గురించి తెల్సుకోండి, స్త్రీ జాతిని అవమానించకండి.

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి
వ్యాసకర్త సాహితీవేత్త, వైఎస్సార్‌సీపీ నాయకురాలు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top