దక్షిణాది భాషలపై హిందీ పెత్తనం

Katti Padma Rao Article On South Indian languages - Sakshi

అభిప్రాయం

దక్షిణ భారతదేశంపై హిందీ భాషను రుద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఇది భారత రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ఫెడరిలిజంపై గొడ్డలి వేటు వేయడమే. భారత రాజ్యాంగం దేశీయ భాషల అస్తిత్వానికిచ్చిన స్వేచ్ఛను భగ్నపరచడం తప్ప మరొకటి కాదు. దక్షిణాది భాషలన్నీ అతి ప్రాచీనమైనవి. భారతదేశానికి వలస వచ్చిన అనేక జాతుల భాషలను సంలీనం చేసుకొన్న భాషా జాతులు దక్షిణాది భాషలు. ఇతర దేశీయ దాడులకు ఉత్తర భారతం గురైనంతగా దక్షిణ భారతం గురికాలేదు. అందుకే ఇక్కడ భాషల్లోని మాతృస్వామికత, దేశీయతల పునాది చెక్కు చెదరలేదు. దక్షిణ భారత భాషలు ప్రపంచ భాషా చరిత్రలో అత్యున్నత ప్రాధాన్యం కలిగినవి. నిజానికి తెలుగు, తమిళ, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రవిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధి చెందాయి. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాడు మూల ద్రవిడ భాష నుండి ఈ భాషలు ఒకటొకటిగా స్వతంత్రతను సంతరించుకున్నాయని భాషా చరిత్రకారులు చెప్తున్నారు. ఒకటొకటి స్వతంత్ర భాషగా రూపొందడానికి వెయ్యి యేండ్లు పట్టింది. తెలుగు భాష ప్రభావం ఇప్పటికీ తెలుగు తెగల మీద వుండటాన్ని మనం గుర్తించాలి.

ముఖ్యంగా కోయ భాషలో ఎన్నో తెలుగు పదాలు వున్నాయి. తెలుగులో అతి ప్రాచీన జాతుల్లో సవరలు ఒకరు. వారి పాటలు ఆర్యులకు పూర్వం నాటివి. ఆ సవరుల భాషలో ఎన్నో తెలుగు పదాలు వున్నట్టు గిడుగు శ్రీరామమూర్తిగారు నిరూపించారు. అమిత్‌ షా ప్రకటనలో ఆర్‌.యస్‌.యస్‌. ఎజెండా వుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటూనే అంతా ‘రామ’ మయం చేయాలంటారు.  దక్షిణ భారతదేశంలో సామాజిక సాంస్కృతిక, తాత్విక ఉద్యమాలన్నీ భాషా పునాదిగా పుట్టాయి. ఇప్పటికీ అధిక శాతం మంది నిరక్షరాస్యులుగా వుండి తమ భాషలోనే తమ జీవన క్రమాన్ని నడుపుకొంటున్నారు. చదువుకొనే వారికి, చదువుకోని వారికి ఆయా ప్రాంతీయభాషలే జీవ వాహికలుగా వున్నాయి. దక్షిణాది వారు హిందీకి వ్యతిరేకులు కాదు. కానీ, ఏ భాషనూ ప్రభుత్వం ప్రజ లపై రుద్దకూడదు. వారి వారి ఉత్సాహాన్ని బట్టి భాషను నేర్చుకొంటారు. అప్పుడే భాష వస్తుంది. భాష మెదడు మీద రుద్దితే వచ్చేది కాదు. అది నేర్చుకునే ఔత్సాహికత నుండే వస్తుంది. 

అంబేడ్కర్‌ ఈ సందర్భంగా ఫెడరల్‌ స్ట్రక్చర్‌ మనుగడ ఆయా దేశీయ భాషల్ని రక్షించి అభివృద్ధి చేయడం మీదే ఆధారపడి ఉందని చెప్పారు. భాషా రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా పేర్కొన్నారు. ‘‘సమాఖ్య రాజ్యాంగం విజయవంతంగా పనిచేయడానికి రాష్ట్రాలు ఎక్కువగా సమతుల్యతలో ఉండడం అవసరమని నేను భావిస్తున్నాను. వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉన్నట్లయితే అది అనుమానాల్ని, అసంతృప్తిని కలిగించడమే కాదు, ఫెడరల్‌ వ్యవస్థనే విచ్ఛిన్నం చేయగల శక్తులను సృష్టించడం దేశ ఐక్యతకే ప్రమాదకారి అవుతుంది. భాషల అంశం చాలా లోత్తైంది’’.

నిజానికి కేంద్రం దక్షిణాది భాషల అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇవ్వాల్సి వుంది. కానీ దేశీయ భాషలను సంస్కృతులను ప్రోత్సహించకుండా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది అత్యంత సంకుచిత రాజకీయం. దక్షిణాది భాషలకు కేంద్ర ప్రభుత్వం నుండి సరైన సహకారం లేదు. డా‘‘ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ స్పూర్తికి షా ప్రకటన విరుద్ధం. దక్షిణ భారతీయులు అశోకుణ్ని, ఔరంగజేబుని నియంత్రించిన సమర్థులు. దక్షిణాది సంస్కృతులపై దాడి చేసి నిలిచిన వారు లేరు. ఈ సందర్భంగా దక్షిణ భారత ముఖ్యమంత్రులు, భాషావేత్తలు, ప్రజలు ఏకమై మహత్తర పోరాటాన్ని సాగించడం ద్వారా భారతీయ సమైక్యతను సముజ్వలతను కాపాడుకోవాల్సిన చారి త్రక సందర్భం ఇది. ఇది కేవలం హిందీ పేరుతో జరుగుతున్న పాలక వర్గపు రాజకీయ దాడి. అందుకే సామాజిక భాషా శక్తులే కాక రాజకీయ శక్తులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాల్సిన సందర్భం ఇది. దక్షిణ భారతీయులు పోరాటమే ఊపిరిగా తరతరాలుగా తమ అస్తిత్వాలను చాటుకొంటున్నారు. ఈ పోరాటంలో మనమూ భాగస్వాములు అవుదాం.


డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త సామాజిక తత్వవేత్త,
నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
మొబైల్‌ : 98497 41695

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top