చక్రబంధంలో చంద్రబాబు

K Ramachandra Murthy Write Article on CM Chandrababu - Sakshi

త్రికాలమ్‌

నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ) నుంచి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అత్యంత లాఘవంగా వైదొలిగిన తీరు బీజేపీ అగ్రనేతలకు ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. తెలుగువారికి, ముఖ్యంగా నారా చంద్రబాబునాయుడి రాజకీయాలను నలభై సంవత్సరాలుగా గమనిస్తున్నవారికి, ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. రాజకీయాలలో విజయాలు సాధించేందుకే నాయకులందరూ శ్రమిస్తారు. పోటీ రాజకీయంలో, అదను చూసి ప్రత్యర్థిని దెబ్బ తీయడంలో, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలూ, వ్యూహాలూ, నిర్ణయాలూ మార్చుకొని వేగంగా పావులు కదపడంలో ఆరితేరినవారు కొందరే ఉంటారు.

వారిలో అగ్రగణ్యుడు చంద్రబాబు. అవకాశవాదం, తెగింపు, స్వోత్కర్ష, అసత్యాలను పదేపదే వల్లించడం, తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకొని విజయం సాధిం చడం టీడీపీ అధినేతలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు. ఈ క్రీడలో రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ స్థానం లేదు. 

నలభై ఏళ్ళ కిందట కాంగ్రెస్‌ (ఐ) టిక్కెట్టు ఇప్పించిన రాజగోపాలనాయుడూ, అమరనాథరెడ్డి దగ్గరి నుంచీ, పిల్లనిచ్చిన ఎన్‌టి రామారావు, అంజయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించడానికి తోడ్పడిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి, 1999లో కార్గిల్‌ యుద్ధానంతర సానుకూల పవనాల ఫలితంగా ఎన్నికలలో గెలిచేందుకు సహకరించిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి–లాల్‌కృష్ణ అడ్వాణీ ద్వయం, 2014లో టీడీపీ విజయానికి స్వీయ ప్రాబల్యంతో సాయపడిన నరేంద్ర మోదీ అందరూ చంద్రబాబు దృష్టిలో తిరస్కృతులే. 

అవసరం ఉన్నం తవరకూ ఉపయోగించుకున్నారు. అక్కర తీరిన తర్వాత తెగతెంపులు చేసుకున్నారు. ఇందులో సెంటిమెంటుకు తావు లేదు. అవకాశవాద రాజకీయాలలో ఇది అనివార్యం. నిష్కర్షగా ఉండాలి. గెలుపు కోసం ఏమి చేయడం అవసరమో అదే చేయాలి. చంద్రబాబులో కనిపిస్తున్న కొన్ని లక్షణాలు నరేంద్ర మోదీలో సైతం కనిపిస్తాయి. మార్గం కంటే లక్ష్య సాధన ప్రధానం.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రత్యేక హోదా ప్రభంజనం వీస్తోంది. ఈ పెనుగాలులను సృష్టించిన వ్యక్తి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రత్యేక హోదా కావాలంటూ జగన్‌మోహన్‌రెడ్డి నిరసన ప్రకటించినప్పుడూ, నిరశన దీక్ష చేపట్టినప్పుడు, యువభేరి సమావేశాలలో ప్రసంగాలు చేసినప్పుడూ, పాదయాత్రలో జరిగిన సభలకు హాజరైన జనసందోహాలను ఉద్దేశించి ఉపన్యసించినప్పుడూ ప్రజలలో చైతన్యం రగిలింది. జగన్‌మోహన్‌రెడ్డి, వామపక్ష నాయకులూ, ఉద్యమసంస్థల నేతలూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న సమయంలో చంద్రబాబు మోదీ భజన చేస్తున్నారు. 

ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటూ ప్రకటించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని ఆకాశానికి ఎత్తి పొగడ్తల్లో ముంచెత్తారు. దాన్ని సుసాధ్యం చేసిన నాటి కేంద్రమంత్రి, నేటి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడికి సన్మానం చేశారు. తాను ఏమి చేసినా ప్రజలను ఒప్పించగలననే ఆత్మవిశ్వాసంతో బాబు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. మీడియా, సామాజిక శక్తులూ, పార్టీ సహచరులూ, కార్యకర్తల ప్రచారం ద్వారా ప్రజలను నమ్మించే శక్తియుక్తులు (మార్కెటింగ్‌ స్కిల్స్‌) తనకు దండిగా ఉన్నాయని ఆయన 1995 ఆగస్టులోనే నిరూపించారు. అయితే, రాజకీయాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు. అన్ని శక్తులూ అన్ని వేళలా పనిచేయవు. ప్రత్యర్థులు మారుతుంటారు. వ్యూహాలు మారుతుంటాయి. 

క్షేత్ర వాస్తవికతను చప్పున గ్రహించి అందుకు తగిన చర్యలు వేగంగా తీసుకునే శక్తి వయసు పెరిగిన కొద్దీ ఎంతోకొంత మందగిస్తుంది. ఎన్‌టిఆర్‌ను గద్దె దించి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకీ, ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు పనిచేసిన వ్యక్తికీ తేడా ఉంది. 34 ఏళ్ళ క్రితం టీడీపీ శాసనసభ్యుల శిబిరాలు నిర్వహించి నాదెండ్ల భాస్కరరావు ఆట కట్టించిన బాబుకూ, 23 సంవత్సరాల కిందట అత్యంత ఉత్కంఠ భరితమైన రాజకీయ విన్యాసాలతో ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన గుండెలు తీసిన బంటుకీ, 2014 నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తికీ అంతరం ఉంది. కడచిన ఆరుమాసాలుగా బాబు వ్యవహరి స్తున్న తీరు ఆయనను ఎరిగిన అనేకమందికి విస్తుకొల్పుతున్నది. ఇదివరకటి వేగం లేదు. ఏకాగ్ర చిత్తం లేదు. సమయస్ఫూర్తి లేదు. కుశాగ్రబుద్ధి లేదు. రణకౌశలం లేదు. విల్లు సంధించే సమయంలో చేయి వణుకుతోంది. బాణం గురి తప్పుతోంది. 

ఏమున్నది గర్వకారణం?
అయిదేళ్ళలో సాధించిన ఘనకార్యాలను చూపి మరో అయిదేళ్ళు తన పార్టీని ఎన్నుకోమని ప్రజలను కోరాలని అందరి కంటే ఎక్కువగా బాబుకు తెలుసు. కానీ గత నాలుగేళ్ళలో సాధించింది ఒక్కటీ లేదు. రాజధాని నిర్మాణం ఇంకా డిజైన్ల దశ దాటలేదు. పోలవరం స్వప్న సాకారం కాలేదు. రైల్వే జోన్‌ దరిదాపులలో లేదు. కడపలో స్టీలు ఫ్యాక్టరీ లేదు. పట్టిసీమ వంటి వ్యర్థమైన ప్రాజెక్టులూ, తాత్కాలిక శాసనసభా ప్రాంగణం, సచివాలయం మినహా ఏమున్నది? ప్రత్యేక విమానంలో ఎన్ని దేశాలు పర్యటించి వచ్చినా, ఎన్ని సదస్సులు నిర్వహించినా, ఎంత హడావిడి చేసినా ఏమిటి ప్రయోజనం? ఎన్ని పరిశ్రమలు ప్రారంభమైనాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నది ముఖ్యం. 

మన అభివృద్ధి రేటు 12 శాతం అని ఊదరకొట్టినా, వ్యాపారం చేయడంలో సౌలభ్యం కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉన్నదంటూ పదేపదే చెప్పుకున్నా, ఇతరులతో చెప్పించినా ప్రజలకు అర్థం కాదు. స్వానుభవం మాత్రమే వారికి అర్థం అవుతుంది. తనకంటే సీనియర్లు కరుణానిధీ, అడ్వాణీ, ములా యం వంటి నేతలు అనేక మంది ఉన్నారని ఎన్నిసార్లు చెప్పినా తానే సీనియర్‌ని అంటూ పదేపదే చెప్పుకోవడం వల్ల అబద్ధం నిజం అవుతుందా? తాము చదివినదానికీ, చూసినదానికీ తమ అనుభవానికీ మధ్య సామీప్యం ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారు. కేవలం మీడియా ప్రోత్సాహం సరిపోదనీ, ప్రజల సానుకూలత అత్యవసరమనీ దేశంలో 66 సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నికలు ప్రతిసారీ నిరూపించాయి. 

ప్రజలలో సానుకూలత లేకపోగా ఆగ్రహం ఉన్నదని జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా జరుగుతున్న సభలకు హాజరు అవుతున్న ప్రజల సంఖ్య, వారి హావభావాలు స్పష్టం చేస్తున్నాయి. కాస్త ఆలస్యంగానైనా బాబు ఈ వాస్తవాన్ని గ్రహించారు. ప్రత్యేకహోదా రాబోయే ఎన్నికలలో బలమైన అస్త్రం కాబోతున్నదని గ్రహించారు. ఎన్‌డీఏ సర్కార్‌ చివరి బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ప్రత్యేకంగా కేటాయించకపోవడాన్ని అవకాశంగా తీసుకొని సంకీర్ణం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. మునుపు అమలు చేసినంత వేగంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయారు. ఏవేవో అనుమానాలూ, భయాలూ. ప్రత్యర్థుల పట్ల మోదీ, అమిత్‌షాల వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో నాలుగేళ్ళుగా చూస్తూనే ఉన్నారు. 

కేంద్ర మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తీ ఎన్ని కష్టాలు పడుతున్నాడో గమనిస్తున్నారు. పైకి ఏమి బుకాయించినా తనకున్న విస్తృతమైన సంబంధాలను వినియోగించి, న్యాయవ్యవస్థలో ‘నాట్‌ బిఫోర్‌’వంటి నిబంధనలు వాడుకొని అనేక కేసులలో స్టేలు సంపాదించిన బాబుకు భయసందేహాలు ఉండటం సహజం. అందుకే ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించాలనే నిర్ణయం తీసుకోవడం కష్టతరమైనది. ఈ విషయం ఆలోచిస్తున్న సమయంలోనే ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎజెండా నిర్ణయించడం ప్రారంభించారు. ప్రత్యేక హోదా కోసం ఫలానా తేదీన అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించారు. కేంద్రం దిగిరాకపోతే తన పార్టీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్‌ 6న తమ పదవులకు రాజీనామా చేస్తారని చెప్పారు. 

అంతవరకూ ప్రత్యేకహోదా సంజీవిని కాదనీ, ఆ హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు ఒరిగింది ఏమీ లేదనీ, ఉద్యమం చేస్తే పీడీ యాక్ట్‌ కింద జైల్లో పెడతామనీ హెచ్చిస్తూ వచ్చిన బాబు వెంటనే రూటు మార్చవలసిన అవసరాన్ని గుర్తించారు. మీడియా సహకారం ఎంత ఉన్నప్పటికీ, పవన్‌కల్యాణ్‌ ఎటువంటి పాత్ర పోషిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్నదని గ్రహించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నాయకుడిగా జగన్‌మోహన్‌రెడ్డికి గుర్తింపు, జనామోదం నానాటికీ పెరుగుతున్నాయని గమనించారు. అందుకే ప్రత్యేక ప్యాకేజీని తటాలున వది లేసి ప్రత్యేక హోదా నినాదం అందుకున్నారు.

జగన్‌ పైచేయి 
‘మేము పెట్టే అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినా సరే, మీరు పెట్టే అవిశ్వాస తీర్మానానికి మా సహకారం కోరినా సరే’ తాము సిద్ధమంటూ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత ముందుకు రావడాన్ని చంద్రబాబు అర్థం చేసుకోవడంలో తటపటాయింపు కనిపించింది. జగన్‌మోహన్‌రెడ్డికి పేరు రాకూడదనే ఉద్దేశంలో అదే డిమాండ్‌పై అశోక్‌గజపతిరాజునూ, సుజనాచౌదరినీ మంత్రిమండలి నుంచి రాజీనామా చేయించారు. అప్పటికీ స్పష్టత రాలేదు. ఎన్‌డీఏ నుంచి వైదొలగడం గురించి నిర్ణయం తీసుకోలేకపోయారు. 

వివిధ రాష్ట్రాల సభ్యులు తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంటులో నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న కారణంగా బడ్జెట్‌ సమావేశాలను కుదించే అవకాశం ఉన్నట్టు అనుమానం రాగానే అవిశ్వాస తీర్మానాన్ని ముందే ప్రవేశపెట్టాలనే కీలక నిర్ణయం వైఎస్‌ఆర్‌సీపీ వేగంగా తీసుకున్నది. పార్టీ విప్‌ సుబ్బారెడ్డి నోటీసు అందజేశారు. అప్పటివరకూ ఎన్‌డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎవరు పోరాడినా బలపర్చుతామనీ, వైఎస్‌ఆర్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామనీ శాసనసభలో ప్రకటించారు. అంతలోనే నిర్ణయం మార్చుకొని తెల్లవారగానే పొలిట్‌బ్యూరో సభ్యులతో సమాలోచన జరిపినట్టు ప్రకటించారు. 

ఎన్‌డీఏ నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం ఉదయం గం. 9.30 కు ప్రకటించి ఒక్క నిమిషం తర్వాత మోదీ ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానానికి తోట నరసింహం చేత నోటీసు ఇప్పించారు. ప్రత్యేక హోదా ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి అదే హోదా కావాలంటూ డిమాండ్‌ చేయడం, అవిశ్వాసం దండగ అంటూ ప్రబోధించిన నేత అదే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఆదరాబాదరాగా ఎన్‌డీఏ నుంచి తప్పుకోవడం ఎందుకు? ఈ నాలుగేళ్ళలో చంద్రబాబు తీసుకున్నన్ని పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు ఆయన రాజకీయ జీవితం మొత్తంలో తీసుకోలేదు. 

చరిత్ర మారదు
నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగి, ఎన్‌డీఏ నుంచి వైదొలిగిన క్షణం నుంచి చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్న నాయకుడుగా ప్రచారం చేసుకోవడం, అంతవరకూ ప్రశంసిస్తూ వచ్చిన మోదీనే ఘాటుగా విమర్శిస్తున్నట్టు మాట్లాడటం విశేషం. చంద్రబాబుకు రాజకీయం ఒక క్రీడ. విజయ సాధనకు ఏమి చేయడానికైనా వెనుకాడరు. ఇతర ప్రతిపక్షాలు టీడీపీ తీర్మానాన్నే సమర్థిస్తున్నట్టు ప్రచారం కూడా అందుకే. నిజానికి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఒక రోజు ముందే జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను విపక్ష నేతలందరికీ అందించారు. 

సోనియాగాంధీ సహా చాలామంది ప్రతిపక్ష నేతలు వైఎస్‌ఆర్‌సీపీ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎంపీలు సుబ్బారెడ్డి, నరసింహం ఇచ్చిన నోటీసుల గురించి ప్రస్తావించగానే కాంగ్రెస్‌ సభ్యులందరూ చటుక్కున లేచి నిలబడ్డారు. సభలో పరిస్థితులు సవ్యంగా లేవు కనుక అవిశ్వాస తీర్మానాలని చర్చకు స్వీకరించే ప్రక్రియను పాటించడం లేదంటూ సభను సోమవారానికి వాయిదా వేశారు. రేపు ఏమి జరుగుతుందో చూడాలి. 

ఈ మొత్తం వ్యవహారంలో జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు చంద్రబాబు స్పందిస్తూ వచ్చారు. ఎన్‌డీఏ ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తొట్టతొలి నోటీసు ఇచ్చిన పార్టీగా వైఎస్‌ఆర్‌సీపీ చరిత్రకు ఎక్కుతుంది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న ప్రతిపక్షాలను మేల్కొలిపే ప్రక్రియకు ఊతం ఇచ్చిన నాయకుడుగా, ప్రత్యేక హోదాను జాతీయస్థాయిలో చర్చనీయాంశం చేసిన నేతగా జగన్‌మోహన్‌రెడ్డి నిలిచిపోతారు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సమకాలీన చరిత్రలోని ఈ వాస్తవాలను మాత్రం కప్పిపుచ్చలేరు.

- కె. రామచంద్రమూర్తి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top