‘మోదీ లేకుంటే చంద్రబాబు జీరో’ | BJP Leader Somu Veerraju Fires ON CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

లయ తప్పిన చంద్రబాబు పరిపాలన

Jun 20 2018 11:45 AM | Updated on Sep 17 2018 5:18 PM

BJP Leader Somu Veerraju Fires ON CM Chandrababu Naidu - Sakshi

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. బీజేపీ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మహా సంపర్క్‌ అభియాన్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలనలో చంద్రబాబు లయ తప్పారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేకుంటే చంద్రబాబు జీరో అని బీజేపీ నేత అన్నారు. చంద్రబాబు అసర్ధ, అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు.

పోలవరం ముంపు మండలాల గురించి వెంకయ్యనాయుడు రాజ్యసభలో మాట్లాడుతుంటే సీఎం రమేష్‌ అడ్డుపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విభజన హామీల గురించి పోరాడని పార్టీలు దుష్ప్రాచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉందన్నారు. పోలవరం, రైల్వేజోన్‌, కడప ఉక్కు పరిశ్రమ హామీలను 2019 కంటే ముందే అమలు చేస్తామని సోము వీర్రాజు విశ్వాసం వ్యక్తం చేశారు.

‘2014లో పోలవరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు. 2016 వరకు చంద్రబాబు ఏంచేశారు? పోలవరం వెనుక చాలా జరిగింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన నష్టానికి చంద్రబాబే కారణం. సుజల స్రవంతి పథకంలో టీడీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. కేంద్రం ఇచ్చిన నిధులను టీడీపీ భారీగా దుర్వినియోగం చేసింది. బీజేపీ రాజకీయాలు కోసం పనిచేయదు.. కమిట్‌మెంట్‌తో పనిచేసే పార్టీ.  సీఎం రమేష్‌ ఏపీ, తెలంగాణకు సమన్యాయమంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. వరంగల్‌కు చెందిన టీడీపీ ఎంపీ పోలవరంను వ్యతిరేకించారు.. ఇదా తెలుగుదేశం పార్టీ కున్నా నిబద్దత అని’ ఆయన నిలదీశారు. 

రైతుల రుణమాఫీ సక్రమంగా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. ‘టీడీపీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. చెట్టు-నీరులో అవినీతి ఆగిందా. టీడీపీ మేనిఫెస్టో ఇచ్చిన హీమాలు ఏమయ్యాయి? నిధులను పక్కదారి పట్టిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై బీజేపీ ప్రశ్నిస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో ఏ డిపార్ట్‌మెంట్‌లో చూసినా అవినీతే. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. కార్మికులు ఎక్కువగా ఉన్నచోట ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. కానీ.. విజయవాడలో ఏర్పాటు చేయడమేంటని’ బీజేపీ నేత విరుచుపడ్డారు.

‘ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల శ్రమను చంద్రబాబు దోచుకున్నారు. వీఆర్వోలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ జీతాలు పెంచడం లేదు. సమస్యలు పరిష్కరించమని నాయిబ్రాహ్మణులు కోరితే.. వెలేత్తి చూపి చంద్రబాబు బెదిరించారు. ఆసలు చంద్రబాబు వైఖరి సరిగా ఉందా? కడప ఉక్కు ఫ్యాక్టరీకు సంబంధించి ఏలాంటి సహాయసహకారాలు ఇవ్వాలో కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ, దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం బదులు ఇవ్వలేదు. ఆఫిడవిట్‌లో ఒక్క పేజీ అంశాన్ని పక్కన పెట్టి, పెద్ద చర్చ చేస్తున్నారు. పులివెందులలో దివంగత నేత వైఎస్సార్‌ డైరీ టెక్నాలజీను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎం రమేష్‌ ఇంటి సమీపంలోనే కాల్వలు తవ్వారు. కానీ చుక్క నీరు రాదు. విశాఖకు రైల్వే జోన్‌, కడపకు స్టీల్‌ ప్లాంట్‌ ఇవ్వడం బీజేపీ లక్ష్యమని’ సోము వీర్రాజు పేర్కొన్నారు.

పోలవరాన్ని 2014లో ప్రారంభించకుండా ఎత్తిపోతల పథకాలను ఎందుకు ప్రారంభిచారని ప్రశ్నించారు. ఆ తర్వాత 2016లో పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు ప్రారంభించారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై చర్చ జరగాలని బీజేపీ నేత సోము వీర్రాజు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎక్కవ సమయం వేచ్చిస్తోందని బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేడు, రేపు శ్రీకాకుళం, 22, 23 తేదీలో విజయనగరం, 24న పోలవరంలో పర్యటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement